రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా కాళ్లలో తిమ్మిరి, నొప్పి వస్తున్నాయా?

First Published May 30, 2023, 11:55 AM IST

కొంతమందికి నిద్రపోయేటప్పుడు కూడా కాళ్లలో తిమ్మిరి వస్తుంది. ఇలా తిమ్మిరి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. 
 

మనలో చాలా మందికి రాత్రి నిద్రపోయేటప్పుడు కాళ్లలో నొప్పి, తిమ్మిరి సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల రాత్రిళ్లు నిద్ర సరిగ్గా రాదు. కంటినిండా నిద్రలేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. కాళ్లలో నొప్పి, తిమ్మిరికి  ఎన్నో కారణాలు ఉన్నాయి. రోజంతా అలసిపోవడం, కొన్ని శారీరక సమస్యలు దీనికి కారణం కావొచ్చు. కాస్త శ్రద్ధ పెడితే ఈ  కాళ్ల నొప్పులను తగ్గించుకోవడం చాలా సులభం. ముందు ఈ కాళ్ల నొప్పులు, తిమ్మిరి ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

leg cramps

కదలకుండా కూర్చోవడం 

కండరాలు చురుగ్గా ఉండాలంటే క్రమం తప్పకుండా వాటిని సాగదీయాలి. అయితే ఎక్కువ సేపు ఒకే పొజీషన్ లో కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. రాత్రిపూట మంచం మీద పడుకుని మీ శరీరాన్ని రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంచినప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి.

పోషక లోపం

శరీరంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లోపించడం వల్ల కూడా తిమ్మిరి వస్తుంది. ఈ ఎలక్ట్రోలైట్లన్నీ శరీరం, కండరాలలో ద్రవ సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇవి అసమతుల్యంగా మారితే తిమ్మిరి సమస్య వస్తుంది. 
 

leg pain

నిర్జలీకరణం

నిర్జలీకరణం ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ఇది రక్తంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కూడా కారణమవుతుంది. ఇది తిమ్మిరిని కలిగిస్తుంది. 

ఎక్కువసేపు నిలబడటం

ఎక్కువసేపు నిలబడటం వల్ల కూడా కాళ్లలో తిమ్మిరి, నొప్పి సమస్యలు వస్తాయి. కాలు తిమ్మిరిపై ఫ్రాన్సిస్ ఆన్లైన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు నిలబడే వ్యక్తులకు రాత్రిపూట కాళ్ల తిమ్మిరి వచ్చే అవకాశం ఉంది.
 

స్నాయువుల కుదింపు

స్నాయువులు కండరాలను, ఎముకలను కలుపుతాయి. అయితే ఇవి కాలక్రమేణా సహజంగా చిన్నవిగా మారుతాయి. ఇది కండరాల తిమ్మిరిని కలిగిస్తుంది. 

అధిక వ్యాయామం

వ్యాయామం ఎక్కువగా చేస్తే కండరాలపై ఎక్కువ భారం పడుతుంది. ఇది కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కూడా నొప్పి వస్తుంది. అందుకే వ్యాయామం ఎక్కువగా చేయకండి. 
 

leg pain

కాళ్ల నొప్పులను, తిమ్మిరిని తగ్గించే చిట్కాలు

సాగదీయండి:  నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి పడుకునే ముందు కాలు తిమ్మిరి వస్తే మీ కాళ్లను సాగదీయండి. ఇది మీ కాళ్లను రిలాక్స్ చేస్తుంది. 

హైడ్రేట్ గా ఉండండి: నిపుణుల ప్రకారం.. ఈ సమస్య ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నీటిని పుష్కలంగా తాగండి. ఇందుకోసం మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఎండాకాలంలో. సోడియం, పొటాషియం ఎక్కువగా ఉండే ద్రవాలను తాగండి. 
 

leg pain

మసాజ్:  రాత్రిపూట కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తే మీ చేతులతో పాదాలను మసాజ్ చేయండి. మీకు రోలర్ ఉంటే దాని సహాయంతో మీ కండరాలను బాగా మసాజ్ చేయండి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది.

హీట్ ప్యాడ్ :  నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి హీట్  ప్యాడ్ ను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటుగా పాదాలను వేడినీటిలో కాసేపు పెట్టండి. కావాలనుకుంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఇది మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 
కోల్డ్ కంప్రెస్ : కొన్ని ఐస్ క్యూబ్స్ ను ఒక టవల్ లో చుట్టి మీకు నొప్పి అనిపించిన చోట దానితో కంప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల కొద్దిసేపట్లోనే ఉపశమనం లభిస్తుంది.

click me!