మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చలి కారణంగా శరీరంలో కండరాల నొప్పులు పెరుగుతాయి. అలాగే ఒత్తిడి, చర్మం పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనెను రాసి పడుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అవేంటంటే?
కొబ్బరి నూనెను ప్రతిరోజూ పాదాలకు రాసి పడుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇది మన చర్మానికి, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అసలు ఇది మనకు ఎలాంటి మేలు చేస్తుందంటే?
కండరాల నొప్పి నుంచి ఉపశమనం
చలికాలంలో ఖచ్చితంగా జలుబు అవుతుంది. అయితే ఈ జలుబు వల్ల కండరాల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. దీనితో ఏ పనీ చేయాలనిపించదు. అయితే రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనెను పెట్టుకుని పడుకుంటే కండరాల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి.
మృదువైన చర్మం
చలికాలంలో చర్మం పొడిబారడంతో పాటుగా నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మంలో గ్లో, తేమ పూర్తిగా తగ్గిపోతాయి. అయితే మీరు ఈ చలికాలంలో కొబ్బరినూనెను పాదాలకు అప్లై చేయడం వల్ల మీ చర్మం పొడిబారడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే పాదాలు స్మూత్ గా కనిపిస్తాయి. పగుళ్లు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం
ఒత్తిడి ఒక మానసిక సమస్యే అయినా.. ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు గనుక రాత్రిపూట కాసేపు కొబ్బరినూనెతో పాదాలకు మసాజ్ చేస్తే ఒత్తిడి, యాంగ్జైటీ చాలా వరకు తగ్గుతాయి.
రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు
చలికాలంలో మన శరీరంలో బిగుసుకుపోతుంది. దీనివల్ల రాత్రిపూట అస్సలు నిద్రపట్టదు. ఇలాంటి పరిస్థితిలో మీరు కొబ్బరి నూనెను పాదాలకు రాసి పడుకుంటే కంటినిండా నిద్రపోతారు. మీ నిద్రకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు. కొబ్బరి నూనె నిద్ర బాగా పట్టడానికి కూడా సహాయపడుతుంది.
గోళ్లు మెరుస్తాయి
మీరు ప్రతిరోజూ రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనెను రాస్తే మీ గోర్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరి నూనె గోర్లను అందంగా మారుస్తుంది. అలాగే ఇది అలసటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పగలి అలసట పోవాలంటే రాత్రిపూట పాదాలకు కొబ్బరినూనె పెట్టి కొద్దిసేపు మసాజ్ చేయండి. ఇది మీ అలసటను పోగొట్టి ఫ్రెష్ గా ఫీలయ్యేలా చేస్తుంది.