Money Plant: మ‌నీ ప్లాంట్ ఉంటే ఇంట్లోకి పురుగులు వ‌స్తాయా.? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటే

Published : Apr 09, 2026, 02:42 PM IST

Money Plant: ఇంట్లో అలంకరణ కోసం చాలా మంది మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు. ఈ మొక్కను ఇంట్లో పెంచితే అదృష్టమ‌ని కూడా కొందరు నమ్ముతారు. అయితే మ‌నీ ప్లాంట్ కార‌ణంగా ఇంట్లోకి పురుగులు వ‌స్తాయ‌ని అనుకుంటారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందంటే.? 

PREV
14
మనీ ప్లాంట్ నిజంగా పురుగులను ఆకర్షిస్తుందా?

చాలామంది అనుకునే విధంగా మనీ ప్లాంట్ స్వయంగా పురుగులను ఆకర్షించదు. మొక్క చుట్టూ ఉన్న వాతావరణమే పురుగుల‌ను ఆక‌ర్షిస్తుంది. పురుగులకు సాధారణంగా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, దాక్కోవడానికి స్థలం, తక్కువ సూర్యకాంతి వంటి పరిస్థితులు అవసరం. ఈ పరిస్థితులు మనీ ప్లాంట్ దగ్గర ఉండే అవకాశం ఉండటంతో అక్కడికి పురుగులు రావచ్చు. అందుకే ఇంట్లో మ‌నీ ప్లాంట్ పెంచే విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

24
మనీ ప్లాంట్ పెంచేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

మనీ ప్లాంట్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీరు ఎక్కువగా పోయకూడదు. మట్టిపై పొర ఎండిన తర్వాత మాత్రమే నీరు పోయాలి. మొక్కను అప్పుడప్పుడు సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో పెట్టాలి. ఆకులను శుభ్రంగా తుడవాలి. మొక్క చుట్టూ శుభ్రత పాటించాలి. వీటితో పురుగులు రావ‌డం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

34
పురుగులను దూరం చేయడానికి సులభమైన చిట్కాలు

మొక్కలకు వచ్చే చిన్న పురుగులను నియంత్రించడం క‌ష్ట‌మేమి కాదు. కొన్ని సులభమైన మార్గాలు పాటిస్తే వాటిని తగ్గించవచ్చు. అవసరమైతే సహజ కీటకనాశక స్ప్రే ఉపయోగించాలి. ఆకులను నీటితో కడగడం మంచిది. మొక్క చుట్టూ నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలి. గాలి సరిగా వెళ్లే ప్రదేశంలో మొక్కను ఉంచాలి. ఇలా చేస్తే పురుగులు పెరగకుండా నియంత్రించవచ్చు.

44
నీటిలో పెంచే మనీ ప్లాంట్‌కు ప్రత్యేక శ్రద్ధ

చాలామంది మనీ ప్లాంట్‌ను నీటిలో కూడా పెంచుతారు. అలాంటి సమయంలో నీటిని తరచుగా మార్చడం చాలా ముఖ్యం. 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీరు మార్చాలి. కుండ లేదా గ్లాస్‌ను శుభ్రం చేయాలి. పాడైన ఆకులను తొలగించాలి. ఇలా చేస్తే నీరు చెడిపోకుండా ఉంటుంది. దీంతో ఫంగస్ లేదా పురుగులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories