కొత్తిమీర ఫ్రిజ్లో పెట్టినా కూడా త్వరగా పాడైపోతుంది. రెండు మూడు రోజుల్లోనే చెడిపోవడం ప్రారంభమవుతుంది. కానీ అది వారం రోజులు పాటు తాజాగా ఉండాలంటే ఎలా నిలవ చేయాలో తెలుసుకోండి.
మన వంటల్లో కచ్చితంగా వాడేది కొత్తిమీర. బిర్యానీ నుంచి పచ్చడి వరకు ఎందులో కొత్తిమీరను వేసినా ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే ప్రతి ఇంట్లోనూ పచ్చికొత్తిమీర కచ్చితంగా ఉంటుంది. అయితే కొత్తిమీరను మార్కెట్ నుంచి తెచ్చిన రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం మొదలవుతుంది. మీరు ఫ్రిజ్ లో పెట్టినా కూడా అది వాడిపోతూనే ఉంటుంది. నిజానికి కొత్తిమీరను సరైన పద్ధతిలో నిల్వ చేస్తే అది వారం రోజులు పాటు తాజాగా ఉంటుంది.
25
ఇలా సీసాలో పెట్టి
కొత్తిమీరను తాజాగా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఒక చిన్న చిట్కా ఉంది. ఒక చిన్న గ్లాసు లేదా సీసా లాంటిది తీసుకొని అందులో కొత్తిమీర వేర్లు మునిగేలా నీళ్లు పోసి పెట్టండి. కొత్తిమీరను అందులో పెట్టి పైన ఒక కవర్ తో కప్పేయండి. అలా దాన్ని ఫ్రిజ్లో పెడితే వారం పది రోజులు పాటు కొత్తిమీర ఆకుపచ్చగా జీవంతో ఉంటుంది. మీరు ఎప్పుడు తీసినా కూడా తాజా కొత్తిమీర సిద్ధంగా ఉంటుంది.
35
పేపర్ టవల్ తో
మరొక పద్ధతిలో పేపర్ టవల్ ను ఉపయోగించి కూడా నిల్వ చేయవచ్చు. ఇలా చేస్తే కొత్తిమీర త్వరగా కుళ్ళిపోదు. కొత్తిమీరను ముందుగానే బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత దాన్ని తేలికపాటి పేపర్ టవల్‌లో చుట్టి గాలి చొరబడని కంటైనర్లో లేదా జిప్ లాక్ బ్యాగ్లో వేసి ఫ్రిజ్లో పెట్టాలి. ఈ పేపర్ టవల్ సహాయంతో కొత్తిమీర కొన్ని రోజులు పాటు తాజాగా ఉంటుంది. నిజానికి పేపర్ టవల్ కొత్తిమీరలోని తేమను గ్రహిస్తుంది. దీని కారణంగా కొత్తిమీర ఆకుపచ్చగానే ఉంటుంది. మీరు కనీసం 10 రోజులు పాటు ఇలా కొత్తిమీర తాజాగా ఉండే అవకాశం ఉంది.
45
ఐస్ క్యూబ్స్ గా మార్చి
మార్కెట్ నుండి కొత్తిమీరను తెచ్చిన వెంటనే అందరూ ఫ్రిజ్లో పెట్టేస్తారు. దాన్ని తెలివిగా నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. కొత్తిమీరను ఫ్రీజర్ లో కూడా నిల్వ చేయవచ్చు. ఎలా అంటే కొత్తిమీరను మెత్తగా సన్నగా తరగండి. తర్వాత ఐస్ ట్రే లోని ఐస్ క్యూబ్స్ ప్లేస్ లో వీటిని వేయండి. వాటిపై కొంచెం నీరు వేయండి తర్వాత ఫ్రీజర్ లో పెట్టేయండి. కొత్తిమీర తరుగు అలా తాజాగా ఉండగానే ఫ్రీజ్ అయిపోతాయి. మీరు కూర, పప్పు వంటివి వండినప్పుడల్లా ఈ కొత్తిమీర ఐస్ క్యూబ్స్ ని తీసి వాటిలో వేసేయండి. కొత్తిమీర తాజాగా ఘుమఘుమలాడుతూ కూరకు మంచి రుచిని, సువాసనను అందిస్తుంది. ఇలా కొత్తిమీర రెండు వారాలు పాటు కూడా తాజాగా ఉంటుంది. నిజానికి ఇది చాలా సింపుల్ చిట్కా.
55
కొత్తిమీరతో లాభాలు
చాలామంది కొత్తిమీరను నిల్వ చేయలేక కొనడమే మానేస్తారు. కొత్తిమీర తినడం మానేస్తే మనకే నష్టం. కొత్తిమీరను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల కాలేయం పనితీరు చక్కగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే శక్తి కొత్తిమీరకు ఉంది. డయాబెటిస్ ఉన్నవారు కొత్తిమీరను ప్రతిరోజు తింటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే గ్యాస్ సమస్యలు, అజీర్తి సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కొత్తిమీర అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా కారం ఎక్కువగా తింటే మాత్రం కొత్తిమీరను ప్రతిరోజు తీసుకోండి. కారం వల్ల వచ్చే సమస్యలను కొత్తిమీర అడ్డుకుంటుంది.