చక్కెర కంటె బెల్లమే మంచిదా?

First Published Apr 6, 2024, 2:03 PM IST

సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది చక్కెర కంటే బెల్లాన్ని అన్నింటికీ వాడుతున్నారు. ఎందుకంటే చక్కెర కంటే బెల్లమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి. అసలు చక్కెర కంటె బెల్లమే ఎందుకు బెటరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది చక్కెర వాడాకాన్ని చాలా వరకు తగ్గించేశారు. టీ, కాఫీలలో కూడా చక్కెరను మోతాదులోనే వేస్తున్నారు. కొంతమంది అయితే టీ నుంచి స్వీట్లను తయారుచేయడం వరకు చక్కెరకు బదులుగా బెల్లాన్నే వాడుతున్నారు. ఎందుకంటే బెల్లమే ఆరోగ్యానికి మంచిదని. అలాగే చక్కెరను తింటే డయాబెటీస్ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. అలాగే ఇది బరువును కూడా పెంచేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ వస్తుందనే భయంతోని చాలా మంది తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసుకుంటున్నారు. ముఖ్యంగా చక్కెరను తినడం తగ్గించేశారు. 
 


డయాబెటీస్ వస్తుందనే భయం వల్ల చాలా మంది చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెను వాడటం మొదలుపెట్టారు. అసలు చక్కెరకంటే బెల్లమే మంచిదా? ఒకవేళ అదే మంచిదైతే దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos



చక్కెరకు, బెల్లానికి తేడా ఇదే..

చక్కెరకు, బెల్లానికి తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ రెండూ ఒకేదానితో తయారువుతాయి కదా అని చాలా మంది అనుకుంటుంటారు. ఈ రెండు చెరకు నుంచే తయారైనా వీటికి చాలా తేడా ఉంది. చెరకు నుంచి చక్కెరను తయారుచేయడానికి కాల్షియం హైడ్రాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి ఎన్నో కెమికల్స్ ను ఉపయోగిస్తారు. ఈ కెమికల్స్ వల్ల చెరకులో ఉండే పోషకాలన్నీ నశిస్తాయి. తెల్లని చక్కెరలో కేలరీలు మాత్రమే ఉంటాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, విటమిన్లు ఏవీ ఉండవు. 
 

బెల్లం ఎలా తయారుచేస్తారంటే? 

బెల్లాన్ని తయారుచేయడానికి చెరకు రసాన్ని తీసుకుంటారు. దీన్ని బాగా మరిగించి చిక్కటి పాకంలా తయారుచేసి ముద్దలుగా అచ్చు పోసి ఆడబెట్టేస్తారు. దీనిలో ఎలాంటి కెమికల్స్ కలవవు. దీంతో బెల్లంలో పోషకాలు నశించవు. చక్కెరకు, బెల్లానికి ఉన్న తేడా కూడా ఇదే. బెల్లంలో పోషకాలుంటే.. చక్కెరలో పోషకాలు మొత్తమే ఉండవు. 

చక్కెరను తింటే? 

డయాబెటీస్ పేషెంట్లకు చక్కెర కంటే బెల్లమే మంచిదని చెప్తుంటారు. ఎందుకంటే చక్కెరను తిన్న వెంటనే తొందరగా జీర్ణమవుతుంది. ఎందుకంటే చక్కెరలో ఖనిజాలు, ప్రోటీన్లు ఏవీ ఉండవు. తొందరగా జీర్ణమవడంతో ఇది చాలా ఫాస్ట్ గా రక్తంలో కలవడంతో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అందుకే చాక్లెట్ ను తిన్నప్పుడు వెంటనే ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది. చక్కెరే కాదు బెల్లాన్ని తిన్నా కూడా ఇలాగే అవుతుంది. 

కానీ చక్కెరలా బెల్లం అంత తొందరగా జీర్ణం కాదు. ఎందుకంటే బెల్లంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది జీర్ణం కావడానికి కాస్త టైం పడుతుంది. నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నెమ్మదిగానే పెరుగుతాయి. కానీ చక్కెరలా వేగంగా పెరగవు. 

స్వీట్ ఎక్కువగా తింటే జరిగేది ఇదే..!

చాలా మంది స్వీట్లను బాగా తింటుంటారు. కానీ తీపి పదార్థాలను మోతాదులోనే తినాలి. అది చక్కెరతో చేసినదైనా కావొచ్చు. బెల్లంతో చేసినదైనా కావొచ్చు. బెల్లం మంచిదే అయినా చక్కెరలో మాదిరిగానే బెల్లంలో కూడా కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే బెల్లాన్ని కూడా లిమిట్ లోనే తినాలి. చక్కెర, బెల్లం ఏదైనా సరే అతిగా తింటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

మీరు తీపిపదార్థాలను ఎక్కువగా తింటే అదనపు గ్లూకోజ్ మీ శరీరంలో కొవ్వుగా నిల్వ మారుతుంది. దీనివల్ల మీ శరీరంలో అక్కడక్కడ కొవ్వు విపరీతంగా పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల మీరు బరువు పెరగడంతో పాటగా మీ గుండె, మెదడుతో పాటుగా శరీరంలోని చాలా భాగాలపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దీనివల్ల చిన్నవయసులోనే చర్మం ముడతలు ఏర్పడుతుంది. అలా అని మీరు పూర్తిగా చక్కెరను మానేయాల్సిన అవసరం లేదు. లిమిట్ లో తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

డయాబెటీస్ ఉన్నవారు చక్కెరకు బదులు బెల్లం తినాలా? 

చాలా మంది షుగర్ పేషెంట్లు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినొచ్చని అనుకుంటారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని అనుకుంటారు. కానీ ఇది కూడా చక్కెర లాంటి ప్రభావమే చూపెడుతుంది. తేనె కూడా అంతే. అందుకే డయాబెటీస్ ఉన్నవారు చక్కెర, బెల్లానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. బ్లడ్ షుగర్ ను ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకునేవారు ఎప్పుడన్నా ఒకసారి తీపి పదార్థాలను తింటే వచ్చే నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు. కానీ లిమిట్ లోనే తినాలి. 

click me!