కూరలో పులుపు తగ్గాలంటే ఏం చేయాలి?

First Published | Jul 31, 2024, 4:39 PM IST

చాలా మంది పప్పుతో పాటుగా రకారకాల కూరల్లో చింతపండును ఖచ్చితంగా వేస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు కూరల్లో చింతపండు ఎక్కువయ్యి కూరల టేస్ట్ పూర్తిగా మారుతుంది. మరి కూరల్లో పులుపును ఎలా తగ్గించాలో తెలుసా? 
 


కూరలు కమ్మగా ఉంటేనే తింటాం. ముఖ్యంగా కూరలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువైతే వీటిని నోట్లో పెట్టడం చాలా కష్టం. ముఖ్యంగా పులుపు. చాలా మందికి ఎక్కువ పులుపు ఉండదు. చింతపండును టేస్ట్ కోసం చాలా మంది పప్పు, సాంబర్ వంటి రకరకాల ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సందర్బాల్లో కూరల్లో పులుపు ఎక్కువ అవుతుంటుంది. ఏదేమైనా పులుపు ఎక్కువైతే మాత్రం కూరలను అస్సలు తినలేం. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం పులుపును తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

తీపి..

అవును పులుపును తగ్గించడానికి మీరు కొద్దిగా తీపిని కూడా కూరలో వేయొచ్చు. పులుపును తగ్గించడానికి కూరలో  కొద్ది మొత్తంలో చక్కెర లేదా తేనెను వేయండి. ఇవి కాకుండా మీరు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేయొచ్చు. ఇందుకోసం ముందుగా చిన్న బెల్లం ముక్కను వేసి బాగా కరగనివ్వాలి. కూరను ఒకసారి ఉడకబెట్టి టేస్ట్ చూడండి. అవసరమైతే బెల్లాన్ని మరికొంత వేయండి. బెల్లంతో పాటుగా బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇది రుచిని పెంచి పులుపును తగ్గిస్తుంది.



పాల ఉత్పత్తులు.. 

పెరుగు పులుపునకు కారణమవుతుంది. కానీ ఇది పులుపును తగ్గించడానికి సహాయపడుతుంది. అవును గ్రేవీ లేదా కూర పుల్లగా ఉంటే దానిలో కాస్త పెరుగును వేసి కలపండి. కానీ అంతకంటే ముందు పెరుగులో అరకప్పు పాలు పోసి బాగా కలపండి. తర్వాత దీన్ని కూరలో వేసి ఉడికించండి. ఇది పుల్లని రుచిని సమతుల్యం చేస్తుంది. అలాగే కూరకు ఫ్రెష్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ తీపిని జోడించి ఆహారాన్ని టేస్టీగా చేస్తుంది.

cooking

కూరగాయలను కలపండి

కూరలో పులుపు ఎక్కువైతే దానిలో మరిన్ని కూరగాయలను కట్ చేసి వేయండి. ఇది పులుపును తగ్గించడానికి సహాయపడుతుంది. బంగాళాదుంపలు, క్యారెట్లు లేదా బఠానీలు వంటి పదార్థాలు పులుపును తగ్గించి కూరలను టేస్టీగా చేస్తాయి. అంతేకాదు ఇవి మీ కూరకు పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని గ్రేవీ లేదా కర్రీలో బాగా ఉడికించండి. వీటివల్ల కూర రుచితో పాటు పులుపు కూడా తగ్గుతుంది.
 

cooking

బేకింగ్ సోడా 

బేకింగ్ సోడా కూడా పులుపును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం కూరలో చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. కాకపోతే దీన్ని ఎక్కువగా వేయొద్దు. ఇది మీ కూర లేదా గ్రేవీ రుచి, ఆకృతిని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పులుపును తగ్గించడానికి 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా సరిపోతుంది. సోడా కలిపిన తర్వాత కూరను కొన్ని నిమిషాల పాటు ఉడికించండి. సోడా పులుపును పూర్తిగా నియంత్రిస్తుంది.
 

cooking

 కొబ్బరి లేదా వాల్నట్ పేస్ట్

కొబ్బరి లేదా వాల్ నట్ పేస్ట్ ను పులుపును తగ్గించడానికి, రుచిని పెంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం తాజా, పొడి కొబ్బరిని బ్లెండర్ లో వేయండి. దీన్ని పేస్ట్ లా చేసి గ్రేవీ లేదా కర్రీలో కలపండి. అలాగే గ్రేవీకి బాదం లేదా జీడిపప్పుతో చేసిన పేస్ట్ ను కూడా కలపొచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా చేసిన పదార్థాలకు జీడిపప్పు, బాదం, గసగసాలు లేదా కొబ్బరి పేస్ట్ కలుపుతారు. ఇవి కూరలో పులుపును తగ్గించడమే కాకుండా.. గ్రేవీ టేస్టీగా అయ్యేలా చేస్తాయి.

Latest Videos

click me!