
చేపల పేరు చెబితేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. కానీ కొంతమంది చేపల్లో ఉండే గుడ్లను మాత్రం తీసి పడేస్తారు. ఈ చేప గుడ్లను సన, జప అని పిలుస్తారు. చేపలు తినడం వల్ల ఎంత ఆరోగ్యం దక్కుతుందో.. చేప గుడ్లు తినడం వల్ల అంతకు రెట్టింపు పోషకాలు శరీరంలో చేరుతాయి. ఇంకెప్పుడూ చేప గుడ్లను బయటపడేయకుండా వాటిని పులుసుగా లేదా ఫ్రైగా చేసుకుని తినండి... చాలా రుచిగా ఉంటాయి. చేప గుడ్లు ఎందుకు తినాలో తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యం దక్కుతుందో తెలుసుకోండి.
మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా చేప గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో మరికొన్ని ప్రత్యేకమైన పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్ ఏ చేప గుడ్లలో అధికంగా దొరుకుతుంది. కంటి చూపు మందగించకుండా ఉండాలంటే అప్పుడప్పుడు చేప గుడ్లను తినాలి. ఇది కళ్ళకు రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇక రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలన్నా కూడా చేప గుడ్లను వారానికి ఒకసారి తినాల్సిన అవసరం ఉంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇవి ముందుంటాయి. మహిళలు, పిల్లలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు చేప గుడ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా చేప గుడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు వీటిని తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది.
పిల్లలకు కచ్చితంగా చేప గుడ్లను తినిపించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే దీనిలో విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా మారుస్తాయి. నిజానికి విటమిన్ డి సూర్యరశ్మి నుంచి మాత్రమే లభిస్తుంది. కానీ కొంత మొత్తంలో చేప గుడ్లలో కూడా ఇది ఉంటుంది. చేప గుడ్లను తినేవారికి భవిష్యత్తులో ఆర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ముఖ్యంగా పిల్లల జ్ఞాపక శక్తిని పెంచే సామర్థ్యం చేప గుడ్లకు ఉంది. అల్జీమర్స్, ఏకాగ్రత కుదరకపోవడం, మతిమరుపు, జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు ఈరోజు నుంచి చేప గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
హైబీపీతో బాధపడుతున్న వారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మందులు వాడే కన్నా ఆహారాన్ని మార్చుకొని ఒత్తిడిని తగ్గించుకుంటే హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చు. తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు కూడా అవుతారు. రక్తపోటు అదుపులో ఉండకపోతే గుండెకు ఎంతో చేటు చేస్తుంది. కాబట్టి ఆదివారం పూట చేపలు మాత్రమే కాదు. చేప గుడ్లు కూడా తెచ్చుకొని వండి తినేందుకు ప్రయత్నించండి.
చేప గుడ్లు ఎలా వండాలో తెలియక ఎంతో మంది సతమతమవుతూ ఉంటారు. నిజానికి దీన్ని చాలా సులువుగా వండవచ్చు. మీరు చేపల పులుసు లేదా చేపల ఇగురు చేస్తున్నప్పుడు వీటిని అందులో వేసి ఉడికించవచ్చు.. లేదా సెపరేటుగా ఫ్రై చేసుకోవచ్చు. కోడిగుడ్డు కీమాలా వీటిని వండుకోవచ్చు. నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు,కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మసాలా పొడి, ఉప్పు వేసి వేయించుకున్నాక ఈ చేప గుడ్లను కూడా వేసి వేయించేస్తే చాలు.. పది నిమిషాల్లో వేపుడు రెడీ అయిపోతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటాయి. పైన కొత్తిమీర చల్లుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది టేస్టీగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యాన్నిచ్చే రెసిపీగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం చేప గుడ్లు తినేందుకు ప్రిపేర్ అయిపోండి.