కరివేపాకు వల్ల కూరలు మంచి వాసన రావడమే కాకుండా.. టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే ప్రతికూరలో కరివేపాకును ఖచ్చితంగా వేస్తారు. నిజానికి మంచి వాసన, టేస్ట్ కోసమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకును తింటే మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం.
కరివేపాకులో మన ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, వంటి మూలకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
ఈ కరివేపాకును ప్రతిరోజూ మన ఆహారంలో చేర్చుకుంటే ఉదర సమస్యలే రావు. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. అసలు రోజూ కరివేపాకును తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీర్ణక్రియకు మేలు
కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల వికారం, వాంతులు,గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ కరివేపాకును నీళ్లలో మరిగించి తాగితే కడుపు ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. కడుపు క్లీన్ అవుతుంది. ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే టాక్సిన్స్ ను బయటకు పోతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
డయాబెటీస్ ఉన్నవారికి కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని షుగర్ ఉన్నవారు ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. కరివేపాకులో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇది మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సమతుల్యంగా ఉంచుతుంది. అందుకే కరివేపాకు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తారు.
బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. కరివేపాకును తింటే ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. ఇలా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
జుట్టును స్ట్రాంగ్ గా ఉంటుంది
కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. కరివేపాకు మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మన అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. కరివేపాకును తింటే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి లు జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
ఒత్తిడిని తగ్గించడానికి
కరివేపాకు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని తింటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నాడీ వ్యవస్థను శాంతపర్చడానికి సహాయపడతాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.