మొలకలను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది పెసర్ల మొలకలను మాత్రమే తింటుంటారు. కానీ ఆరోగ్యం కోసం మీరు నానబెట్టిన శెనగలను కూడా తినొచ్చు. నిజానికి వీటిలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. నానబెట్టిన శెనగలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి.
అయితే ఈ నానబెట్టిన శెనగలు మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో తెలుసా? చాలా మంది టేస్ట్ కోసం మాత్రమే వీటిని తింటుంటారు. కానీ వీటిని తినడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గిస్తుంది
బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నం తగ్గించడం, చపాతీలను మాత్రమే తినడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం, రోజూ వ్యాయామం చేయడం లాంటి చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయితే మీరు ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన శెనగలను తింటే త్వరగా బరువు తగ్గుతారు. వీటిని ఉదయాన్నే తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. అలాగే మీరు అతిగా తినలేరు.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి నానబెట్టిన శెనగలు మంచి మేలు చేస్తాయి. ముఖ్యంగా నల్ల శెనగల్లో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గిపోతాయి.
కంటి ఆరోగ్యం
ఈ రోజుల్లో ఫోన్లను చూసే అలవాటు పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఎక్కువగానే ఉంది. కానీ దీనివల్ల కంటిచూపు తగ్గడంతో పాటుగా కంటికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే మీరు ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన నల్ల శెనగలను తింటే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
నల్ల శెనగల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మీరు ప్రతిరోజూ నానబెట్టిన శెనగలను తింటే సీజనల్ వ్యాధులకు, అంటువ్యాధులకు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు.
శరీర బలాన్ని పెంచుతుంది
నల్ల శెనగల్లో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో పాటుగా ఎన్నో రకాల ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని మీరు ప్రతిరోజూ తింటే మీ శరీర శక్తి పెరుగుతుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అలసట పోయి మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
గుండెకు మేలు
ఈ రోజుల్లో చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి నల్ల శెనగలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు రోజూ నల్ల శెనగలను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నానబెట్టిన శెనగలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతాయి.
శెనగలను ఎలా తినాలి?
ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన శెనగలను బెల్లంతో తినొచ్చు లేదా చాట్ చేసి తినొచ్చు. ఇలా చేయడం వల్ల మీరు దీని ప్రయోజనాలను తొందరగా పొందుతారు. అయితే మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఈ మిశ్రమాన్ని తీసుకోండి.