వెల్లుల్లిని తింటే ఆయుష్షు పెరుగుతుందా?

First Published | Jan 19, 2024, 7:15 AM IST

వెల్లుల్లిని మనం ఎన్నో వంటల్లో ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వెల్లుల్లి ఆహారం రుచిని మాత్రమే పెంచుతుందని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే? వెల్లుల్లి ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. 
 

Garlic

వెల్లుల్లి ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మసాలా దినుసు. ఈ మసాలా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అవును చలికాలంలో దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే ఈ సీజన్ లో వచ్చే ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడంలో వెల్లుల్లి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

garlic

వెల్లుల్లిని ఎలా వేయించాలి?

చలికాలంలో కాల్చిన వెల్లుల్లిని కూడా తినొచ్చు. దీన్ని కాల్చడానికి ముందు వెల్లుల్లి తొక్క తీయండి. తర్వాత దానిపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోసి ఉప్పు, నల్ల మిరియాల పొడి కలపండి. తక్కువ మంట మీద డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒకటి నుంచి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే సరిపోతుంది. చలికాలంలో వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


జలుబు, దగ్గు, ఫ్లూ నుంచి ఉపశమనం

చలికాలంలో ప్రతి ఒక్కరూ వెల్లుల్లి రెబ్బలను తినాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో దగ్గు, ఫ్లూ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లు శరీరంలో ఎక్కువ సేపు మనుగడ సాగించలేవు. 

కొలెస్ట్రాల్ తగ్గుదల

వెల్లుల్లి జీర్ణమైన తర్వాత దాని భాగాలు రక్తంలో కరిగిపోవడం ప్రారంభిస్తాయి. దీంట్లో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం  ఉంటుంది. వెల్లుల్లి మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే యాంటీ-హైపర్లిపిడెమియా ప్రభావాలను కలిగి ఉంటుంది.

ఆయుష్షు

ఒక చైనీస్ అధ్యయనం ప్రకారం.. వారానికి ఒకసారి వెల్లుల్లిని తినే వ్యక్తులు తినని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని కనుగొంది. వెల్లుల్లి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడమే కాకుండా నయం చేసే శక్తిని కూడా కలిగి ఉంటుంది.

రక్తపోటు తగ్గడం

గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు అధిక రక్తపోటునే ప్రధాన కారణంగా భావిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గుండెను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. అయితే వెల్లుల్లిలోని సమ్మేళనాలు రక్తపోటు మందుల మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. 

కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

కాల్చిన వెల్లుల్లని తింటే శరీరం అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇది అథ్లెట్ల పనితీరును పెంచుతుంది. ఎముకలను ఆరోగ్యం, బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. 

Latest Videos

click me!