rice
మన దేశంలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అన్నం మనకు శక్తినిస్తుంది. కానీ బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అన్నాన్ని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే అన్నాన్ని ఎక్కువగా తినడం మంచిది కాదు. మధ్యాహ్నం అన్నానికి బదులుగా వేరే ఆహారాలను తినొచ్చు. దీనివల్ల మధుమేహాన్ని నియంత్రించొచ్చు. అలాగే ఊబకాయం బారిన పడకుండా ఉండొచ్చు. మరి మధ్యాహ్నం అన్నానికి బదులుగా తినాల్సిన ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి.
ఓట్స్
ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఓట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం ఓట్స్ తినడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.
బార్లీ
బార్లీ కూడా మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. మీకు తెలుసా? బియ్యం కంటే బార్లీలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఇవి ఆకలిని త్వరగా తగ్గించి మధుమేహాన్ని నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి.
బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ కూడా వైట్ రైస్ కంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. అందుకే రెడ్ రైస్ ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. అలాగే తెల్ల బియ్యం కంటే ఎర్ర బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తీసుకోవచ్చు.
ఉప్మా
ఉప్మా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కొవ్వు తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇదిడయాబెటిస్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.