ఈ విషయం తెలిస్తే చలికాలంలో పల్లీలను తినకుండా అస్సలు ఉండలేరు..

First Published | Nov 4, 2023, 2:59 PM IST

పల్లీలను తినని వారు అస్సలు ఉండరు. ఈ చిన్న చిన్న గింజలు  టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి కూడా. వీటిని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే షాక్ అవుతారు తెలుసా..

పల్లీల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. పల్లీల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, బి విటమిన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పల్లీలను రెగ్యులర్ గా తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరగడం నుంచి ఎముకలు బలంగా ఉండటం వరకు ఎన్నో ప్రయోజనాలను కలుగుతాయి. ఈ చలికాలంలో పల్లీలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మెరుగైన కంటి చూపు

పల్లీలు కంటి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లీల్లో ఉండే జింక్ మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కళ్లు బాగా కనిపించడానికి సహాయపడుతుంది. అలాగే రేచీకటిని దూరం చేయడానికి సహాయపడుతుంది. 
 


ఎముకలు దృఢం

వేరుశెనగలు మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వేరుశెనగల్లో మాంగనీస్, భాస్వరం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలోపేతం చేస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

ప్రోటీన్ కు మంచి మూలం

మీరు మాంసాహారం తినరా? అయితే ఖచ్చితంగా పల్లీలను తినండి. ఎందుకంటే వీటిలో మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఒక గుప్పెడు పల్లీల్లో 7.3 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

గుండె ఆరోగ్యానికి మేలు 

పల్లీలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ గా గుప్పెడు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

డిప్రెషన్ తగ్గుదల 

ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. వీటిలోడిప్రెషన్ ఒకటి. చిన్న సమస్యగా అనిపించినా.. ఇది మనిషి ప్రాణాలను తీసేయగలదు. అందుకే దీన్నుంచి వీలైనంత తొందరగా బయటపడాలి. అయితే పల్లీలను తింటే నిరాశ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో డిప్రెషన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. 
 

Latest Videos

click me!