ట్రెక్కింగ్ చేయాలని ఎంతోమంది కోరిక. కానీ దీని కోసం ఎక్కడికి వెళ్లాలో మాత్రం తెలియదు. వైజాగ్ కు దగ్గర్లో ఎత్తయిన, అందమైన కొండ ఉంది. ఇది చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. ఇక ట్రెక్కింగ్ చేస్తే అందమైన అనుభూతిని ఇస్తుంది.
ట్రెక్కింగ్ చేయాలంటే హిమాలయాలకో, ఇతర రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రకృతి అందాల మధ్య సాహస యాత్రకు ఆహ్వానం పలికే అద్భుతమైన కొండ ఉంది. అదే జిందగడ కొండ. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ కొండ ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారు 1,680 నుంచి 1,690 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనినే అర్మకొండ, సీతమ్మ కొండ అని కూడా పిలుస్తారు. తూర్పు కనుమల్లో భాగమైన ఈ కొండ పాడేరు సమీపంలోని హుకుంపేట మండల పరిధిలో ఉంది. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, లోయలు కనిపిస్తుంటాయి. నగరాల రద్దీకి దూరంగా ప్రకృతి ఒడిలో కొంత సమయం గడపాలనుకునే వారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం.
23
ఎక్కడ నుంచి ట్రెక్కింగ్ మొదలు?
జిందగడ కొండకు వెళ్లడం అంటే కేవలం పర్యాటక ప్రాంతాన్ని చూడటం కాదు.. ఓ సాహస యాత్రను ఆస్వాదించడం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి ప్రకృతి అందాలతో నిండిన మార్గాలు ఉన్నాయి. ఒలుబిద్ద గ్రామం నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. అక్కడ నుంచి కొండపైకి వెళ్లే దారిలో పచ్చని చెట్లు, కాఫీ తోటలు, చిన్న చిన్న నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. కొండ ఎక్కుతున్న కొద్దీ చుట్టూ కనిపించే లోయల అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పైకి చేరుకున్న తర్వాత తూర్పు కనుమల అందాలను వీక్షించవచ్చు. ముఖ్యంగా తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో కొండల మధ్య నుంచి వెలుగులు విరజిమ్మే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ కొండపై క్యాంపింగ్ చేయడం కూడా మరో ప్రత్యేక అనుభూతి. ట్రెక్కింగ్ మార్గం కొన్ని చోట్ల ఎత్తుగా, కష్టంగా ఉంటుంది. సాధారణంగా కొండపైకి చేరుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టవచ్చు.
33
ఏ నెలల్లో వెళ్లాలి?
సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జిందగడ కొండను సందర్శించడానికి అనువైన సమయంగా చెబుతారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో చల్లని వాతావరణం, పొగమంచు మధ్య ట్రెక్కింగ్ చేయడం మంచి అనుభూతిని ఇస్తుంది. విశాఖపట్నం నుంచి పాడేరు మీదుగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే ట్రెక్కింగ్‌కు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మార్గంలో దారి తప్పిపోయే అవకాశం ఉన్నందున స్థానిక గైడ్ సహాయం తీసుకోవడం మంచిది. తగినంత మంచినీరు, ఆహారం, ప్రథమ చికిత్స సామగ్రి వెంట ఉంచుకోవాలి. మంచి పాదరక్షలు ధరించాలి. ఒంటరిగా వెళ్లకుండా బృందంగా వెళ్లడం మంచిది. వాతావరణ పరిస్థితులు, స్థానిక అటవీ శాఖ సూచనలు తెలుసుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభించాలి. ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే. ఇలా సాహస యాత్రలు ఇష్టపడేవారు ఎక్కడికో వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉన్న జిందగడ కొండను సందర్శించవచ్చు.