Bamboo: కళ్లతో చూస్తుండగానే పెరిగే మొక్క..ఇది ప్రకృతి ఇచ్చిన గొప్పవరం

Published : Nov 21, 2026, 07:24 PM IST

Bamboo: మొక్కలు పెరగాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుంది. కానీ ఓ మొక్క మాత్రం గంటల్లోనే పెరిగిపోతుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. ఇంత వేగంగా పెరిగే ఈ మొక్క చెట్టు కూడా కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద గడ్డి జాతికి చెందింది. ఇంతకీ ఆ మొక్కేంటో తెలుసా?

PREV
15
కళ్లతో చూస్తుండగానే పెరిగే మొక్క..

మొక్కలు పెరగాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుందని మనకు తెలుసు. కానీ ఓ మొక్క మాత్రం రోజులు కాదు.. గంటల వ్యవధిలోనే అడుగుల కొద్దీ పెరిగిపోతుంది. అదే వెదురు (Bamboo). కొన్ని రకాల వెదురు మొక్కలు 24 గంటల్లోనే దాదాపు 3 అడుగుల వరకు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంత భారీగా, ఎత్తుగా పెరిగే వెదురు అసలు చెట్టే కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద గడ్డి జాతి మొక్క. నిర్మాణ రంగం నుంచి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల వరకు ఎన్నో విధాలుగా పనికొచ్చే వెదురులో మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

25
చెట్టు కాదు.. గడ్డి జాతి!

వెదురును చూడగానే చాలామందికి అది ఓ పెద్ద చెట్టు అనిపిస్తుంది. కానీ వృక్షశాస్త్రం ప్రకారం ఇది గడ్డి కుటుంబానికి చెందిన మొక్క. Poaceae కుటుంబంలోని Bambusoideae ఉపకుటుంబానికి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా వెదురులో 1,000కి పైగా జాతులు ఉన్నాయి. కొన్ని రకాలు చిన్న పొదల్లా పెరిగితే, మరికొన్ని ఏకంగా 30 నుంచి 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అందుకే వెదురును ప్రపంచంలోనే అతిపెద్ద గడ్డి జాతిగా పరిగణిస్తారు.

రోజుకు 3 అడుగుల వరకు పెరుగుతుంది!

వెదురు మొక్కల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వాటి పెరుగుదల. కొన్ని జాతుల వెదురు రోజుకు 90 సెంటీమీటర్లకు పైగా పెరగగలవు. మోసో వెదురు (Moso Bamboo) విషయంలో పరిశోధకులు రోజుకు 114.5 సెంటీమీటర్ల వరకు పెరుగుదలను నమోదు చేశారు. అంటే కొన్ని పరిస్థితుల్లో రోజుకు 3 అడుగులకు పైగా పెరగగలదన్నమాట. అయితే ఈ వేగం అన్ని రకాల వెదురులో ఉండదు. కొత్తగా నేల నుంచి మొలిచిన వెదురు రెమ్మలు అనుకూలమైన వాతావరణం, తగినంత నీరు, పోషకాలు ఉన్నప్పుడు వేగంగా పెరుగుతాయి. ఒకసారి పైకి వచ్చిన వెదురు కాండం తన కొన్ని వారాల్లోనే పెరిగిపోతుంది.

35
ఉక్కు లాంటి బలం

వెదురు చూడటానికి తేలికగా, సున్నితంగా కనిపించినా దానికి చాలా బలం ఉంటుంది. ముఖ్యంగా బరువుతో పోల్చినప్పుడు వెదురు కాండానికి అద్భుతమైన తన్యతా బలం (Tensile Strength) ఉంటుంది. కొన్ని రకాల వెదురు పీచులు బరువుకు అనుగుణంగా ఉక్కు అంతలా బరువు ఉంటాయి. అందుకే నిర్మాణ రంగంలో వెదురును ఉపయోగిస్తున్నారు. ఇళ్లు, నిర్మాణాలు, పరంజాలు (Scaffolding), ఫర్నిచర్, ఫ్లోరింగ్ తయారీలో వినియోగిస్తున్నారు. అయితే అన్ని రకాల వెదురు బలంగా ఉండవు. నిర్మాణాల్లో ఉపయోగించే ముందు వాటిని సరైన విధంగా ఎండబెట్టడం, రసాయనాలతో శుద్ధి చేయడం అవసరం.

సాధారణ చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుందా?

పర్యావరణ పరిరక్షణలో వెదురు కీలక పాత్ర పోషిస్తుంది. వేగంగా పెరిగే స్వభావం కారణంగా ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది. కొన్ని అధ్యయనాలు వెదురు తోటలు చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలవని చెబుతున్నాయి. మొక్కల జాతి, వాటి వయసు, పెరుగుదల, విస్తీర్ణం వంటి అంశాలపై ఆక్సిజన్ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది.

45
100 ఏళ్లకు ఒకసారి పూలు పూస్తుందా?

వెదురులో అత్యంత విచిత్రమైన విషయం దాని పుష్పించే విధానం. సాధారణంగా చాలా మొక్కలు ప్రతి ఏడాది లేదా కొన్ని నెలలకోసారి పూలు పూస్తాయి. కానీ కొన్ని రకాల వెదురు మాత్రం దశాబ్దాల తర్వాతే పూలు పూస్తాయి. కొన్ని జాతుల్లో ఈ వ్యవధి 60 నుంచి 130 సంవత్సరాల వరకు ఉంటుంది. మరికొన్ని వెదురు జాతులు ఒకేసారి పెద్ద సంఖ్యలో పూలు పూస్తాయి. దీన్ని గ్రెగేరియస్ ఫ్లవరింగ్ (Gregarious Flowering) అంటారు. ఒకే జాతికి చెందిన వెదురు మొక్కలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఒకే సమయంలో పూలు పూయడం దీని ప్రత్యేకత. పూలు పూసి విత్తనాలు ఉత్పత్తి చేసిన తర్వాత కొన్ని జాతుల వెదురు మొక్కలు చనిపోతాయి. అయితే అన్ని రకాల వెదురుకు ఇదే లక్షణం ఉండదు. వెదురు పుష్పించే సమయం, తర్వాత మొక్క చనిపోతుందా లేదా అనేది దాని జాతిపై ఆధారపడి ఉంటుంది.

55
వెదురుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

వెదురు కేవలం నిర్మాణ రంగానికే పరిమితం కాలేదు. మన రోజువారీ జీవితంలో ఉపయోగించే ఎన్నో వస్తువుల తయారీలోనూ కీలకంగా మారింది. బుట్టలు, చాపలు, ఫర్నిచర్, కాగితం, వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వెదురు చిగుళ్లను ఆహారంగా కూడా తీసుకుంటారు. తక్కువ సమయంలో తిరిగి పెరిగే సామర్థ్యం ఉండటంతో వెదురును పునరుత్పాదక వనరుగా పరిగణిస్తారు. కలపకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. నేల కోతను తగ్గిస్తాయి. కార్బన్‌ను నిల్వ చేయడం వంటి లక్షణాలు దీని ప్రాధాన్యతను పెంచుతున్నాయి.

మొత్తానికి బయటకు చూస్తే ఓ సాధారణ మొక్కలా కనిపించే వెదురు వెనుక ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.అందుకే వెదురును ప్రకృతి అందించిన అద్భుతమైన వనరుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories