Backswimmer Species: తెలంగాణ అమ్రాబాద్, ఏపీ శేషాచలం అడవుల్లో తలకిందులుగా ఈదే కొత్త రకం నీటి కీటకం ఎనిథారెస్ డెక్కనెన్సిస్ ను జెడ్ఎస్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటిలో తలకిందులుగా ఈదుతూ వేటాడే ఈ జీవి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తలకిందులుగా ఈదే వింత కీటకం.. మన తెలుగు రాష్ట్రాల అడవుల్లోనే బయటపడింది
మన తెలుగు రాష్ట్రాల అడవుల్లో మరో అరుదైన జీవజాతి వెలుగులోకి వచ్చింది. నీటి అడుగుభాగంలో తలకిందులుగా ఈదుతూ వేటాడే సరికొత్త మంచినీటి కీటకాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో ఈ కొత్త కీటక జాతిని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు దీనికి ఎనిథారెస్ డెక్కనెన్సిస్ అని పేరు పెట్టారు.
25
ఎవరీ పరిశోధకులు? ఏంటీ విశేషం?
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం, తమిళనాడు విరుదునగర్‌లోని వీహెచ్ఎన్ఎస్ఎన్ కళాశాలకు చెందిన పరిశోధకులు కలిసి ఈ ఆవిష్కరణ చేశారు. ఈ బృందంలో సోమేష్ బెనర్జీ, దేవదాస్ కుమార్, డాక్టర్ దీపా జైస్వాల్, కరుతపాండి మడసామి ఉన్నారు.
ఈ కీటకం నోటోనెక్టిడే కుటుంబానికి చెందినది. వీటిని సాధారణంగా బ్యాక్స్విమ్మర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి నీటిలో తమ శరీరాన్ని తలకిందులుగా ఉంచి, వెల్లకిలా పడుకున్నట్లుగా ఉంటూ పొడవైన వెనుక కాళ్లతో ఈదుతాయి. ఇవి ఇతర చిన్న జీవులను వేటాడి తింటాయి. నవంబర్ 16న అంతర్జాతీయ జర్నల్ 'జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీ' లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. నవంబర్ 20న దీన్ని అధికారికంగా డాక్యుమెంట్ చేశారు.
35
డీఎన్ఏ టెస్టుతో నిర్ధారణ
ఇది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని కొత్త జాతి అని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు దీని శరీర నిర్మాణంతో పాటు జన్యు పరీక్షలు చేశారు. ఈ కీటకం రెక్కలపై ముదురు రంగులో 'V' ఆకారపు మచ్చ ఉండటం దీని ప్రత్యేకత. అలాగే మగ కీటకాల్లో కొడవలి ఆకారంలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవం ఉంది.
ఇవి లేత, ముదురు రంగుల్లో కనిపిస్తున్నాయి. జన్యు విశ్లేషణలో దీని జాతికి చెందిన ఇతర కీటకాలతో పోలిస్తే ఇందులో దాదాపు 10 నుంచి 14.5 శాతం వరకు జన్యుపరమైన తేడాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఇది కచ్చితంగా ఒక ప్రత్యేకమైన కొత్త జాతి అని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ ఆవిష్కరణతో అడవుల్లో ఉండే చిన్నపాటి మంచినీటి ఆవాసాల ప్రాముఖ్యత మరోసారి బయటపడింది. జెడ్ఎస్ఐ హైదరాబాద్ ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ డాక్టర్ దీపా జైస్వాల్ మాట్లాడుతూ.. అడవుల్లోని రాళ్ల మధ్య ఉండే నీటి గుంతలు, చిన్న వాగులు, జలపాతాల దగ్గర ఉండే నీటి నిల్వల్లో ఎన్నో తెలియని జీవజాతులు దాగి ఉంటాయని తెలిపారు. వాటిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
55
తూర్పు కనుమల్లో జీవవైవిధ్యం
జెడ్ఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ ధృతి బెనర్జీ ఈ ఆవిష్కరణపై స్పందిస్తూ.. తూర్పు కనుమల్లో జీవవైవిధ్య సర్వేలను నిరంతరం కొనసాగించాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన గుర్తు చేస్తోందని అన్నారు. మంచినీటి ఆవాసాలను సంరక్షించుకోవడం ద్వారా ఇలాంటి అరుదైన జీవులను కాపాడుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఎనిథారెస్ డెక్కనెన్సిస్ చేరికతో తూర్పు కనుమల మంచినీటి జీవవైవిధ్య జాబితా మరింత పెరిగింది.