
మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చే హానికరమైన పదార్థాలను గుర్తించి వాటిపై పోరాడుతుంది. అయితే రోగికి సరిపోని బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించినప్పుడు, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ రక్తంలోని ఎర్ర రక్తకణాలను శత్రువులుగా గుర్తించి వాటిపై దాడి చేయవచ్చు. దీంతో ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హీమోలిటిక్ ట్రాన్స్‌ఫ్యూజన్ రియాక్షన్ అంటారు.
ముఖ్యంగా ABO బ్లడ్ గ్రూప్‌లో సరిపోని రక్తాన్ని ఎక్కిస్తే ఈ సమస్య తీవ్రంగా ఉండవచ్చు. రక్తకణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం వల్ల శరీరంలో విషతుల్య ప్రభావాలు ఏర్పడతాయి. ఫలితంగా రక్తపోటు తగ్గడం, కిడ్నీలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సమస్యలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడం, ప్రాణాపాయం సంభవించడం కూడా జరగవచ్చు.
సరిపోని రక్తాన్ని ఎక్కించినప్పుడు కొంతమంది రోగుల్లో రక్తమార్పిడి జరుగుతున్న సమయంలోనే లేదా కొద్దిసేపటికే లక్షణాలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఒకే విధమైన లక్షణాలు ఉండకపోవచ్చు. అకస్మాత్తుగా జ్వరం రావడం, చలి వణుకు రావడం, ఛాతీ, వీపు లేదా నడుము ప్రాంతంలో నొప్పి కలగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, రక్తపోటు అకస్మాత్తుగా తగ్గిపోవడం, మూత్రం ముదురు రంగులో రావడం లేదా మూత్రం పరిమాణం తగ్గడం, తీవ్రమైన అసౌకర్యం, ఆందోళన లేదా నీరసం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం ఎక్కిస్తున్న సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలి. రక్తమార్పిడి పూర్తయ్యే వరకు వేచి చూడకూడదు. త్వరగా స్పందించడం వల్ల తీవ్రమైన సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుంది.
సరిపోని రక్తం ఎక్కించినప్పుడు ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమై వాటిలోని హిమోగ్లోబిన్ బయటకు విడుదలవుతుంది. ఇది కిడ్నీలపై ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా రక్తపోటు తగ్గిపోవడం, కిడ్నీలకు తగినంత రక్తప్రసరణ అందకపోవడం వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్ అవసరం కావచ్చు. అంతేకాకుండా, రక్తపోటు బాగా తగ్గితే గుండెతో పాటు మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు సరిపడా రక్తం, ఆక్సిజన్ అందకపోవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సమస్యలు ఏర్పడి అంతర్గత రక్తస్రావం కూడా జరగవచ్చు. అయితే ప్రతి తప్పు రక్తమార్పిడిలోనూ ఇలాంటి తీవ్రమైన పరిణామాలు తప్పనిసరిగా వస్తాయని చెప్పలేం. ఎక్కించిన రక్తం రకం, పరిమాణం, రోగి ఆరోగ్య పరిస్థితి, చికిత్స ఎంత త్వరగా ప్రారంభించారనే అంశాలపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది.
రక్తమార్పిడి సమయంలో సరిపోని రక్తం ఎక్కిస్తున్నట్లు అనుమానం వచ్చినా, అలర్జీ లేదా తీవ్రమైన రియాక్షన్ లక్షణాలు కనిపించినా వైద్య సిబ్బంది వెంటనే రక్తమార్పిడిని నిలిపివేస్తారు. అనంతరం రోగి పరిస్థితిని పరిశీలించి అవసరమైన చికిత్స ప్రారంభిస్తారు. సాధారణంగా వైద్యులు రోగి రక్తపోటు, గుండె స్పందన, శ్వాస వంటి ముఖ్యమైన లక్షణాలను పర్యవేక్షిస్తారు. రక్తం, మూత్ర పరీక్షల ద్వారా రక్తకణాల విచ్ఛిన్నం, కిడ్నీల పనితీరును పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి నరాల ద్వారా ద్రవాలు అందించి రక్తప్రసరణను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. మూత్రం ఎంత వస్తోంది, కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయా అనే విషయాలను గమనిస్తారు. తీవ్రమైన పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స అందిస్తారు. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటే డయాలసిస్ అవసరం కావచ్చు.
రక్తమార్పిడి సమయంలో ప్రమాదాలను నివారించడానికి ఆసుపత్రుల్లో కొన్ని ముఖ్యమైన పరీక్షలు, జాగ్రత్తలు పాటించాలి. రోగి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. రోగికి ఎక్కించబోయే రక్తం అనుకూలంగా ఉందో లేదో కూడా పరీక్షించాలి. పేరు, గుర్తింపు వివరాలు, రక్త నమూనా సరైన రోగికి చెందినవేనా అని నిర్ధారించుకోవాలి. గి ABO, Rh బ్లడ్ గ్రూప్‌ను గుర్తించాలి. రోగి రక్తంతో దాత రక్తం అనుకూలంగా ఉందో లేదో పరీక్షించాలి. జ్వరం, నొప్పి, శ్వాస సమస్యలు లేదా ఇతర అసాధారణ లక్షణాలు ఉన్నాయా అని వైద్య సిబ్బంది గమనించాలి. రక్తం ఎక్కించే సమయంలో ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే నర్సు లేదా వైద్యుడికి తెలియజేయాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావంచాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.