పెళ్లి తరువాత పిల్లలు, భర్త, అత్తా మామ, ఆర్థిక పరిస్థితులు, ఇంటి పనులతో విసిగిపోయిన మహిళకు తమ భాగస్వామి నుంచి ప్రేమ, భావోద్వేగ బంధం కావాలనిపిస్తుంది. తనను అర్థం చేసుకునే విధంగా తన భర్త ఉండాలని కోరుకుంటుంది ప్రతి మహిళ. ఎప్పుడైతే ఇంట్లో ప్రేమ, అవగాహన, భావోద్వేగా బంధాలు కరవు అవుతాయో అప్పుడు బయటనుంచి ఆ బంధాన్ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎవరైతే తమకు భావోద్వేగ సపోర్టును, స్నేహాన్ని, ప్రేమను అందిస్తారో వారి ఉచ్చులో త్వరగా పడిపోతుంది. అందుకే ఎంతోమంది పెళ్లి అయిన స్త్రీలు వివాహేతర సంబంధాల్లో ఇరుక్కుంటున్నారు. దానికి ప్రధాన కారణం వారికి కావాల్సిన ప్రేమ, భావోద్వేగ సపోర్టు లభించకపోవడమే.
35 నుంచి 40 ఏళ్ల మధ్య గల మహిళల జీవితం ఇప్పుడు ప్రతిరోజూ ఒకేలా ఉంటుంది. ఒకే దినచర్యలో వారు ఇరుక్కుపోయి ఉంటారు. నిజానికి 35 నుంచి 40 ఏళ్ల వయసు అనేది జీవితంలో ఒక కీలకమైన దశ. పిల్లల చదువు, కుటుంబ ఖర్చులు, ముసలివారైపోయిన అత్తమామలు, తల్లిదండ్రుల సంరక్షణ వంటివన్నీ కూడా వారిపై పడతాయి. ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ కూడా తగ్గుతుంది. రోజంతా పనులు అలసిపోయిన భర్త.. భార్యకు ఎక్కువ సమయం కేటాయించలేడు. ఇదే దశలో వారిద్దరి మధ్య ఒక రకమైన శూన్యత ఏర్పడుతుంది. ఈ శూన్యతే మహిళలు బయట సంబంధాలు పెట్టుకోవడానికి కారణం అవుతుంది. కొందరు ఉద్యోగం చేసే మహిళలు కార్యాలయాల్లోని సహోద్యోగులతో సంబంధాలు పెట్టుకుంటే... ఇంట్లోనే ఉండే మహిళలు బయట అప్పుడప్పుడు తరచూ కలిసేవారితో స్నేహం చేయడం మొదలు పెడుతున్నారు. ఆ స్నేహమే భావోద్వేగ సంబంధంగా ఆ తర్వాత అక్రమ సంబంధంగా మారిపోతోంది.