Sunday Traditions: సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామంది ఇళ్లలో చికెన్, మటన్ వాసనలు అదిరిపోతుంటాయి. ఇంకొందరైతే ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలు చేసుకుంటారు. కానీ తెలంగాణలోని ఒక ఊరిలో మాత్రం మందు, మాంసం ముట్టరు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
ఆదివారం నాన్ వెజ్ తినడం, మందు తాగడం చాలామందికి సాధారణ అలవాటు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గర్షకుర్తి గ్రామస్తులు మాత్రం దీనికి భిన్నంగా ఓ ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలని భావించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల ప్రభావంతో మొదలైన ఈ మార్పు ఇప్పుడు గ్రామ ప్రత్యేకతగా మారింది. ఇంతకీ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటి? అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
24
ఈ నిర్ణయం వెనుక కారణం
గర్షకుర్తి గ్రామంలో ఆదివారం మాంసాహారం, మద్యం మానేయాలనే నిర్ణయం వెనుక ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ ఇక్కడ మహాభారతంపై ప్రవచనాలు చేశారట. ఈ ప్రవచనాల్లో ఆదివారం ప్రాముఖ్యత, సూర్యభగవానుడి ఆరాధన, ఆధ్యాత్మిక నియమాల గురించి వివరించారట. ఆదివారం సూర్యభగవానుడికి అంకితమైన రోజుగా భావిస్తారని, ఆ రోజున నాన్ వెజ్, ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచించారట. ఆ ప్రవచనాలతో ప్రభావితమైన గ్రామస్తులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం తీసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నారట.
34
గ్రామమంతా ఏకమై తీసుకున్న నిర్ణయం
ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత గ్రామస్తులు తమ ఆచారాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలని భావించారట. అంతేకాకుండా, గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, వీధుల్లో ఈ నియమాన్ని తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేశారట. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంగా కాకుండా, గ్రామస్తులు అంతా కలిసి ఆచరించాలనుకున్న సామూహిక సంకల్పంగా ఈ మార్పు ప్రత్యేకతను సంతరించుకుంది.
హిందూ సంప్రదాయంలో ఆదివారం సూర్యభగవానుడికి సంబంధించిన రోజుగా భావిస్తారు. సూర్యుడిని శక్తి, ఆరోగ్యం, తేజస్సుకు ప్రతీకగా పూజిస్తారు. కొందరు ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఆచారాలను పాటిస్తారు. ఉపవాసం ఉండటం లేదా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం కూడా వ్యక్తిగత, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. గర్షకుర్తి గ్రామస్తులు కూడా ఈ ఆధ్యాత్మిక భావనను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.