Chicken: కోడి రాళ్లను ఎందుకు మింగుతుంది?

Published : Nov 12, 2026, 04:01 PM IST

Chicken: కోళ్లకు పళ్లు ఉండవు. అందుకే ఆహారాన్ని నమలకుండా మింగుతుంది. నేలపై తిరుగుతూ ఆహారంతో పాటే చిన్నచిన్న రాళ్లు, గులకరాళ్లు కనిపిస్తే వాటిని ఏరుకుని మింగుతుంటాయి. అసలు రాళ్లతో ఏం ఉపయోగం ఉంటుంది? కడుపులో జీర్ణమవుతాయా?

PREV
15
కోడి రాళ్లను ఎందుకు తింటుంది?

మనుషుల్లా కోళ్లకు ఆహారాన్ని నమిలి మెత్తగా చేసే పళ్లు ఉండవు. అవి గింజలు, ధాన్యాలు, పురుగులు, ఇతర ఆహార పదార్థాలను మింగేస్తాయి. మింగిన ఆహారం మొదటగా అన్నవాహికలోని క్రాప్ అనే సంచిలోకి వెళ్తుంది. అక్కడ కొంతసేపు నిల్వ ఉంటుంది. అందులో ఉండే తేమ వల్ల గింజలు మెత్తబడతాయి. ఆ తర్వాత ప్రోవెంట్రిక్యులస్ అనే గ్రంథుల్లోకి వెళ్తాయి. అక్కడ విడుదలయ్యే ఆమ్లం, జీర్ణ ఎంజైములు ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. కానీ గట్టిగా ఉన్న గింజలను చిన్న ముక్కలుగా నలపాలంటే కోళ్లకు పళ్లు ఉండవు కాబట్టి గిజార్డ్ లోకి వెళ్తాయి. ఈ ఆహారాన్ని జీర్ణం చేయడానికి వాటి శరీరంలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. అందులో ప్రధాన పాత్ర పోషించేది గిజార్డ్ (Gizzard).

25
కోడి మింగిన రాళ్లు గిజార్డ్ లోపలికే చేరుకుంటాయి

గిజార్డ్ అనేది కోడి కడుపులో ఉండే బలమైన కండరాలతో కూడిన భాగం. గిజార్డ్ లోపలి భాగం రాపిడిని తట్టుకునే గట్టి పొర ఉంటుంది. కోడి మింగిన రాళ్లు ఇక్కడికే చేరుకుంటాయి. ఈ చిన్న రాళ్లు, గులకరాళ్ల సాయంతో ఆహారం నలిగిపోయి చిన్నచిన్న ముక్కలుగా మారుతుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంటే కోళ్లు రాళ్లను తినేది వాటి కడుపులో ఆహారాన్ని గ్రైండ్ చేయడానికే.

35
రాళ్లే కోళ్లకు గ్రైండర్‌లా పనిచేస్తాయా?

అవును. మనం మిక్సీలో పదార్థాలను వేసి గ్రైండ్ చేసినట్లుగానే కోళ్ల గిజార్డ్‌లో చిన్న రాళ్లు పనిచేస్తాయి. కోళ్లు మింగిన ధాన్యాలు, గింజలు, ఇతర గట్టి ఆహార పదార్థాలను ఈ రాళ్లు కండరాల కదలికలతో నలిపేస్తాయి. ఇలా ఆహారం చిన్న ముక్కలుగా మారిన తర్వాత జీర్ణ ఎంజైమ్‌లు వాటిపై సులభంగా పనిచేస్తాయి.

కోళ్లు మింగిన రాళ్లు వెంటనే బయటకు వచ్చేయవు. కొన్ని రాళ్లు గిజార్డ్‌లో కొంతకాలం ఉండి ఆహారాన్ని నలిపేందుకు ఉపయోగపడతాయి. కాలక్రమంలో అవి అరిగిపోయి చిన్నవిగా మారి మలం రూపంలో బయటకు వస్తాయి.

45
అన్ని రకాల రాళ్లను కోళ్లు తింటాయా?

అలా కాదు. సాధారణంగా కోళ్లు చిన్న పరిమాణంలో ఉండే గులకరాళ్లు, గరుకుగా ఉండే ఇసుక రేణువులు, ఇతర గట్టి పదార్థాలను ఏరుకుని మింగుతాయి. వీటిని గ్రిట్ (Grit) అంటారు. ఇవి ఆహారాన్ని నలిపేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా బయట తిరుగుతూ సహజంగా ఆహారం వెతుక్కునే కోళ్లకు నేలపై ఇలాంటి గ్రిట్ అందుబాటులో ఉంటుంది. అయితే కోళ్లకు అందించే గ్రిట్ పరిమాణం వాటి వయసును బట్టి ఉండాలి. పదునైన అంచులున్న రాళ్లు, పెద్ద రాళ్లు ఇవ్వకూడదు. కోళ్ల పెంపకంలో ప్రత్యేకంగా లభించే పౌల్ట్రీ గ్రిట్‌ను ఉపయోగించడం మంచిది.

55
గుడ్లు పెట్టే కోళ్లకు ఇవి ఉపయోగపడతాయా?

కోళ్లు మింగే రాళ్లు, గుడ్ల పెంకు తయారీకి అవసరమైన కాల్షియం ఒకటే కాదు. ఆహారాన్ని నలిపేందుకు గ్రిట్ ఉపయోగపడితే, గుడ్ల పెంకు బలంగా తయారవడానికి కాల్షియం అవసరం. అందుకోసం కోళ్లకు ప్రత్యేకంగా కాల్షియం ఉన్న ఆహారం అందిస్తారు. కొన్ని సందర్భాల్లో నలిపిన ఓయిస్టర్ షెల్స్ వంటి కాల్షియం కూడా ఇస్తారు. కాబట్టి కోళ్లు రాళ్లను మింగడం వెనుక ఆకలి మాత్రమే కారణం కాదు. వాటి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ప్రకృతి కల్పించిన అద్భుతమైన ఏర్పాటు ఇది. మనుషులకు పళ్లు ఎలాగైతే ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయో.. కోళ్లకు గిజార్డ్‌లోని చిన్న రాళ్లు అలా ఉపయోగపడతాయన్నమాట.

Read more Photos on
click me!

Recommended Stories