West Flowing River: భారతదేశంలో ఎక్కువ నదులు తూర్పు వైపు ప్రవహిస్తే, తపతి నది మాత్రం పశ్చిమ వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని వెనక ఉన్న భౌగోళిక కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్టా రూట్.. తపతి నది అరేబియా సముద్రంలో ఎందుకు కలుస్తుంది?
భారతదేశంలో నదుల ప్రవాహం సాధారణంగా తూర్పు వైపు ఉంటుంది. గోదావరి, కృష్ణా, మహానది వంటి ముఖ్యమైన నదులన్నీ తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ, తపతి నది మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా పశ్చిమ వైపు ప్రవహిస్తుంది. ఈ నది అరేబియా సముద్రంలో పడటానికి ప్రధాన కారణం మన భారత ద్వీపకల్పం భౌగోళిక నిర్మాణం, ముఖ్యంగా రిఫ్ట్ వ్యాలీ ఏర్పడటమే.
25
తపతి నది పుట్టుక.. భౌగోళిక ప్రయాణం
తపతి నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ముల్తాయ్ ప్రాంతంలో, సత్పూరా పర్వత శ్రేణులలో జన్మిస్తుంది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రయాణించి గుజరాత్ లోని ఖాంబత్ సింధు శాఖ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు దాదాపు 724 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి పూర్ణ, గిర్నా, పాంఝ్రా వంటి ఉపనదులు ఉన్నాయి.
35
తపతి నదిపై రిఫ్ట్ వ్యాలీ ప్రభావం ఎంత?
తపతి నది పశ్చిమ వైపు పారడానికి మెయిన్ రీజన్ రిఫ్ట్ వ్యాలీ. భూమి పొరలలో ఏర్పడిన పగుళ్ల కారణంగా రెండు సమాంతర పర్వతాల మధ్య భూమి కిందకి కుంగిపోవడాన్ని రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఉత్తరాన సత్పూరా పర్వతాలు, దక్షిణాన అజంతా-సాత్మల కొండల మధ్య ఈ నది ప్రయాణిస్తుంది. కొత్త దారి వెతుక్కోకుండా, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ లోతైన దారి గుండానే నది పశ్చిమ వైపు పరుగులు పెడుతుంది.
ద్వీపకల్ప పీఠభూమి సాధారణంగా పశ్చిమం నుంచి తూర్పునకు వాలుగా ఉంటుంది. అందుకే నదులు తూర్పు వైపు వెళ్తాయి. కానీ తపతి విషయంలో పరిస్థితి వేరు. ఈ నది ప్రవహించే ప్రాంతపు వాలు పశ్చిమం వైపు ఉంటుంది. గుజరాత్ లోని సూరత్ దగ్గర తీర ప్రాంతం ఎత్తు తక్కువగా ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి కారణంగా నీరు అరేబియా సముద్రంలోకి వేగంగా చేరుకుంటుంది. ఇక్కడ నది డెల్టాలను ఏర్పరచకుండా ఎశ్చ్యూరీ లను సృష్టిస్తుంది.
55
తపతి నది ఆర్థిక, పర్యావరణ ప్రాముఖ్యత ఇదే
తపతి నది మధ్య, పశ్చిమ భారతదేశ ప్రజల జీవితాల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు ఇది ప్రధాన ఆధారం. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో పత్తి, చెరకు, అరటి పంటలు విరివిగా పండుతాయి. అలాగే గుజరాత్ లోని ఉకై డ్యామ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. భూగర్భ జలాలను కాపాడటంలో ఈ నది ఎంతో ముఖ్యం.