Telugu Saying: ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు... దానికి అంత కంగారు పడాలా?" ఇలా మన నిత్య జీవితంలో, ముఖ్యంగా ఊర్లలో లేదా సినిమాల్లో ఈ మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. అసలింతకు ఈ ఆకాశరామన్న అనే పేరు ఎలా వచ్చింది?
ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు... దానికి అంత కంగారు పడాలా?" ఇలా మన నిత్య జీవితంలో, ముఖ్యంగా ఊర్లలో లేదా సినిమాల్లో ఈ మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. అసలింతకు ఈ ఆకాశరామన్న అనే పేరు ఎలా వచ్చింది? ఆకాశరామన్న పేరు వెనుక 2 కథలు ఉన్నాయి. మొదటి స్టోరీ చూద్దాం.
24
సంస్కృతం నుంచి వచ్చింది
ఈ పేరు వెనుక ఉన్న మొదటి కారణం తెలుసుకోవాలంటే మనం కాస్త భాషా చరిత్రలోకి వెళ్లాలి. ఆకాశరామన్న అనే పదం నిజానికి సంస్కృతంలోని ‘ఆకాశానామ్నా’ అనే పదం నుండి పుట్టింది.
దీన్ని విడదీసి చూస్తే: ఆకాశం అంటే శూన్యం (ఏమీ లేకపోవడం). నామ్నా అంటే పేరు గల అని అర్థం. ఆకాశనామ్నా' అంటే 'శూన్యం అనే పేరు గల' లేదా 'ఏ పేరు లేని' అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఈ 'ఆకాశానామ్నా' అనే సంస్కృత పదం వాడుక భాషలోకి వచ్చేసరికి, 'ఆకాశరామన్న'గా మారిపోయింది. అందుకే, పంపినవారి అడ్రస్ గానీ, పేరు గానీ లేని ఉత్తరాలను 'ఆకాశరామన్న ఉత్తరాలు' అని పిలవడం అలవాటైంది.
34
రెండో కథ
ఇక దీని వెనుక ఒక అద్భుతమైన జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో గ్రామాల్లో పంచాయితీలు అన్నీ ఊరి మధ్యలో ఉండే రచ్చబండ దగ్గరే జరిగేవి. అయితే, కొంతమంది ఊరి పెద్దలు లేదా భూస్వాములు పేద ప్రజలపై అన్యాయాలు, అక్రమాలు చేస్తుండేవారు. వారిని ఎదిరించి మాట్లాడే ధైర్యం సామాన్యులకు ఉండేది కాదు. అలాంటి సమయంలో, ఆ రచ్చబండ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుకు కొన్ని ఉత్తరాలు ప్రత్యక్షమయ్యేవి. ఆ ఉత్తరాలలో... ఊరి పెద్దలు చేస్తున్న అన్యాయాలు, వారు దాస్తున్న నిజాలు అన్నీ వివరంగా రాసి ఉండేవి. కానీ, ఆ ఉత్తరం ఎవరు రాశారో తెలుసుకోవడానికి ఎలాంటి ఊరు గానీ, పేరు గానీ ఉండేవి కావు.
మనం చేసే మంచి చెడ్డలను పైనున్న ఆ దేవుడే గమనిస్తుంటాడు. సమాజంలో అన్యాయం పెరిగినప్పుడు సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే ఆకాశం నుండి దిగివచ్చి, ఈ ఉత్తరాల రూపంలో మనకు నిజాలు చెబుతున్నాడని ప్రజలు బలంగా నమ్మేవారు. ఆకాశం నుండి రాముడే పంపిన ఉత్తరాలు కాబట్టి, వీటికి ‘ఆకాశరామన్న ఉత్తరాలు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఎవరైనా నిజం చెప్పడానికి భయపడి, అనామకంగా రాసే లేఖలకు ఈ జానపద కథ ఒక ప్రతీకగా నిలిచింది.