
ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు కనిపిస్తుంటే ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అమ్మలు చంద్రమామ రావే.. జాబిల్లి రావే అని లాలిపాటలు పాడుతూ పిల్లలను తినిపించడం, పడుకోబెట్టడం చేస్తుంటారు. ఇక ప్రేమసీప్రియులు చంద్రుడి వెన్నెల్లో పాడుకునే రొమాంటిక్ డ్యూయెట్స్ వింటుంటాం, అమ్మాయిల అందాన్ని చంద్రుడితో పోల్చడం చూస్తుంటాం. ఇలా చందమామ మనుషులందరికీ మామలా మారిపోయి చాలా దగ్గరయ్యాడు.
అయితే చందమామ రావే, జాబిల్లి రావే అని మనం ఎంతపిలిచినా రాకుండా ఓ ప్రాంతానికి ముందుగా వెళ్ళిపోతుంటాడు. ఇలా ప్రపంచంలో అందరికంటే ముందుగా చంద్రుడిని చూసే అవకాశం పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ద్వీప దేశాల ప్రజలకు దక్కుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో కిరిబాటి ప్రత్యేకంగా నిలుస్తుంది. న్యూజిలాండ్ సమీపంలోని టోంగా, సమోవా ద్వీపాలు కూడా ఈ విషయంలో ఆసక్తిని కలిగిస్తాయి. మరి చంద్రుడు మొదట కనిపించే ప్రాంతం ఏది? ఈ ప్రాంతాలకు ఆ ప్రత్యేకత ఎలా వచ్చింది? తెలుసుకుందాం.
చంద్రుడు మొదట కనిపించే ప్రాంతం గురించి చెప్పేటప్పుడు కిరిబాటి దేశం పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం అంతర్జాతీయ తేదీ రేఖకు సమీపంలో ఉంటుంది... ఈ దేశంలోనే కొత్త రోజు మొదలవుతుంది. కిరిబాటిలోని కిరిటిమతి ద్వీపం కొత్త రోజును ప్రపంచంలోనే ముందుగా స్వాగతించే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అందుకే కొత్త సంవత్సరం వేడుకల సమయంలోనూ ఈ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి తర్వాత టోంగా, సమోవా వంటి ద్వీప దేశాలు కూడా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ముందుగానే కొత్త క్యాలెండర్ రోజులోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రాంతాల భౌగోళిక స్థానం, అంతర్జాతీయ తేదీ రేఖకు సంబంధించి వాటి సమయ మండలాలు ఇందుకు కారణం. న్యూజిలాండ్ కూడా ప్రపంచంలో కొత్త రోజును ముందుగా స్వాగతించే దేశాల్లో ఒకటి.
అయితే ప్రపంచంలో ఎక్కడయినా 24 గంటల సమయమే ఉంటుంది… రోజు తొందరగా మొదలవుతుంది అంటే తొందరగా ముగుస్తుందని అర్థం. అంటే సూర్యుడు ఎక్కడయితే తొందరగా ఉదయిస్తాడో అక్కడే తొందరగా అస్తమిస్తాడు... ఆసక్తికరంగా ఇక్కడే చంద్రుడు తొందరగా ఉదయిస్తాడు. ఈ లెక్కన ప్రపంచంలో సూర్యుడే కాదు చంద్రుడు కూడా మొదట కనిపించేది ఈ కిరిబాటి ద్వీపంలోనే.
చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ప్రతిరోజూ ఆకాశంలో దాని స్థానం మారుతుంది. అందుకే ఒకే ప్రాంతంలో కూడా రోజురోజుకూ చంద్రోదయ సమయం ఒకేలా ఉండదు. సాధారణంగా ఒక రోజు కంటే మరుసటి రోజు చంద్రుడు సుమారు 50 నిమిషాలు ఆలస్యంగా ఉదయిస్తాడు. అయితే ఈ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
చంద్రుడు ఏ దశలో ఉన్నాడు? భూమిపై మనం ఏ ప్రాంతంలో ఉన్నాం? ఆ ప్రాంతం అక్షాంశం, రేఖాంశం ఎంత? వంటి అంశాలు చంద్రోదయ సమయాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాదు అమావాస్య సమయంలో చంద్రుడు సూర్యుడికి దగ్గరగా కనిపించే దిశలో ఉండటం వల్ల సాధారణంగా మనకు కనిపించడు. మబ్బులు, వాతావరణ పరిస్థితులు కూడా చంద్రుడిని చూసే అవకాశాన్ని ప్రభావితం చేస్తాయి.
అయితే కిరిబాటి, టోంగా, సమోవా వంటి దేశాలు కొత్త రోజును ముందుగా ప్రారంభించే ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. అందుకే చంద్రుడు, సూర్యుడు మొదట కనిపించే ప్రాంతాల గురించి చర్చ వచ్చినప్పుడు ఈ ద్వీప దేశాల పేర్లు తరచూ ప్రస్తావనకు వస్తుంటాయి. కానీ ఎప్పుడూ ఈ దేశాల్లోనూ సూర్యచంద్రులు మొదట ఉదయిస్తారని చెప్పలేేం… కొన్నిసార్లు మారవచ్చు.