ISRO : మత్స్యకార గ్రామం నుండి చంద్రయాన్ వరకు.. ఇస్రోను నడిపించిన ఈయన ఎవరో తెలుసా?

Published : Nov 21, 2026, 05:25 PM IST

భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇస్రో (ISRO) పాత్ర ఎంతో కీలకం. మరి మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు పునాది వేసింది ఎవరు? వేల కోట్ల ఆస్తులు ఉన్నా దేశం కోసం ఇస్రో, ఐఐఎం లాంటి సంస్థలను స్థాపించిన ఆ గొప్ప వ్యక్తి కథ ఇది.

PREV
14
విక్రమ్ సారాభాయ్ గురించి ఆసక్తికర విషయాలు

భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇస్రో (ISRO) పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. చంద్రయాన్, మంగళయాన్ లాంటి ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించింది. అయితే మన అంతరిక్ష ప్రయోగాలకు గట్టి పునాది వేసిన ఓ గొప్ప వ్యక్తి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక శ్రీమంతుడి ఇంట్లో పుట్టినా, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి దేశం కోసం, సైన్స్ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనే భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్.

శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన సైంటిస్ట్

విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ పెద్ద వ్యాపారవేత్త. గుజరాత్‌లో ఎన్నో టెక్స్‌టైల్ మిల్లులు ఉన్న పెద్ద కుటుంబం వాళ్లది. వ్యాపారంతో పాటు స్వాతంత్య్ర పోరాటంలోనూ అంబాలాల్ చురుగ్గా ఉండేవారు.

చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న విక్రమ్ పైచదువుల కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లారు. ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన సిఫార్సు లేఖతో ఆయనకు అక్కడ అడ్మిషన్ దొరికింది. కానీ 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలవడంతో ఆయన చదువుకు బ్రేక్ పడింది. తండ్రి ఒత్తిడితో భారత్‌కు తిరిగి వచ్చిన సారాభాయ్ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో చేరారు.

24
సీవీ రామన్ గైడెన్స్‌లో రీసెర్చ్

బెంగళూరులోని IIScలో నోబెల్ బహుమతి గ్రహీత సర్ సీవీ రామన్ మార్గదర్శకత్వంలో విక్రమ్ సారాభాయ్ తన పరిశోధనలు మొదలుపెట్టారు. కాస్మిక్ కిరణాలపై (Cosmic Rays) ఆయన ప్రధానంగా రీసెర్చ్ చేశారు. ఇదే సమయంలో హోమీ జహంగీర్ భాభాతో కూడా ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ కేంబ్రిడ్జ్ వెళ్లి 1947లో తన డాక్టరేట్ పూర్తి చేశారు.

28 ఏళ్లకే రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే అంటే 1947 నవంబర్ 11న అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL)ని స్థాపించారు విక్రమ్ సారాభాయ్. అప్పటికి ఆయన వయసు కేవలం 28 ఏళ్లు. కుటుంబ వ్యాపారాన్ని చూసుకునే అవకాశం ఉన్నా కూడా దేశంలో సైన్స్ అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఏకంగా భారత అంతరిక్ష పరిశోధనల బాధ్యతలను తీసుకునే స్థాయికి ఆయన ఎదిగారు.

34
మత్స్యకారుల గ్రామం నుంచి అంతరిక్షం వైపు

కేరళలోని తిరువనంతపురం దగ్గర తుంబా అనే మత్స్యకారుల గ్రామంలో భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో సారాభాయ్ కీలక పాత్ర పోషించారు. 1963 నవంబర్ 21న ఇక్కడి నుంచే తొలి రాకెట్‌ను ప్రయోగించారు. ఆ తర్వాత ఈ కేంద్రమే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)గా పేరు మార్చుకుంది.

అభివృద్ధి చెందుతున్న మన దేశానికి అంతరిక్ష పరిజ్ఞానం ఎంత అవసరమో అప్పటి ప్రభుత్వానికి ఆయన స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. ఆయన ముందుచూపు వల్లే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)కు ఒక మంచి పునాది పడింది. భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట వెనుక కూడా ఆయన కృషి ఎంతో దాగి ఉంది.

44
ఐఐఎం అహ్మదాబాద్ స్థాపనలోనూ సారాభాయ్ పాత్ర

విక్రమ్ సారాభాయ్ సేవలు కేవలం అంతరిక్ష రంగానికే పరిమితం కాలేదు. మన దేశంలో అత్యుత్తమ మేనేజ్మెంట్ చదువుల అవసరాన్ని గుర్తించి ఐఐఎం (IIM) అహ్మదాబాద్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. వ్యాపారవేత్తల సపోర్ట్ తీసుకొని, ఆ సంస్థకు స్థలం ఇప్పించేందుకు ఎంతో కష్టపడ్డారు. 1961లో మొదలైన ఈ సంస్థకు ప్రారంభంలో ఆయన డైరెక్టర్‌గా కూడా పని చేశారు.

అంతేకాకుండా సైన్స్, మెడిసిన్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ రంగాల్లో ఎన్నో సంస్థల ఏర్పాటుకు ఆయన సాయం చేశారు. 1966లో పద్మభూషణ్ అందుకున్న ఆయనకు, 1972లో మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు కూడా వరించింది. 1971 డిసెంబర్ 31న విక్రమ్ సారాభాయ్ కన్నుమూశారు.

కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినా, ఆస్తుల కన్నా దేశ భవిష్యత్తుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు విక్రమ్ సారాభాయ్. భారత సైన్స్, అంతరిక్ష చరిత్రలో ఎప్పటికీ ఆయన ఒక హీరోనే… చిరకాలం సారాభాయ్ పేరు నిలిచిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories