తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పువ్వులు ఉన్నాయి… వీటినే రాష్ట్రీయ పుష్పాలుగా గుర్తించాయి ప్రభుత్వాలు. మరి తెలంగాణ రాష్ట్రీయ పుష్పం ఏది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం ఏది?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ గీతం ఏదంటే టక్కున 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' అని చెబుతారు. రాష్ట్రీయ జంతువు కృష్ణ జింక, రాష్ట్రీయ పక్షి రామచిలక అని చాలామందికి తెలుసు. ఇక తెలంగాణ రాష్ట్రీయ గీతం 'జయజయహే తెలంగాణ జననీ జయకేతనం', రాష్ట్రీయ జంతువు జింక, రాష్ట్రీయ పక్షి పాలపిట్ట... ఇవికూడా చాలామందికి తెలుసు. కానీ ఈ తెలుగు రాష్ట్రాల అధికారిక పుష్పాలు ఏవంటే చాలామంది జవాబు తెలియక తడబడుతుంటారు.
తెలుగువారు తమ స్వరాష్ట్రం గురించి ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ రాష్ట్రీయ పుష్పాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం. వీటి ప్రాముఖ్యత ఏమిటి? తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల్లో ఈ పుష్పాల ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం.
24
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం ఏది?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయగీతం తెలిసినవారు రాష్ట్రీయ పుష్పం ఏదో గెస్ చేయవచ్చు. తెలుగుతల్లిని స్తుతిస్తూ 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' అంటారుగా... ఈ మల్లె పూలే ఏపీ రాష్ట్రీయ పుష్పం. దీని శాస్త్రీయ నామం జాస్మీనమ్ అఫిసినేల్.
తెలుగు మహిళలు జెడలో మల్లెపూలను ధరించేందుకు ఇష్టపడతారు... అలాగే పూజలు, శుభకార్యాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఇవి స్వచ్చత, ఆతిథ్యానికి చిహ్నం... వీటి సువాసన మనసుకు తెలియని ప్రశాంతతను అందిస్తుంది. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ లో మల్లెపూల తోటలు ఎక్కువగా కనిపిస్తాయి... ఇక్కడి రైతులు వీటిద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. అందుకే దీనిని రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం... తద్వారా రాష్ట్రంలో మల్లె తోటల పెంపకం, సాగు, పూల ఎగుమతికి ప్రోత్సాహకం అందించినట్లు అయ్యింది.
34
తెలంగాణ రాష్ట్రీయ పుష్పం ఏది?
బతుకమ్మ పండగ గురించి తెలిసినవారు తెలంగాణ రాష్ట్రీయ పుష్పంఏదో ఈజీగా గెస్ చేయవచ్చు. బతుకమ్మ పాటల్లో ఈ పూవు గురించి ప్రస్తావన ఉంటుంది... అదే తంగేడు పువ్వు. దీని శాస్త్రీయ నామం సెన్నా అరిక్యులాటా. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి ప్రజల జనజీవనంతో తంగేడు పువ్వుకు అనుబంధం ఉంది... అందుకే దీనిని రాష్ట్రీయ పుష్పంగా ఎంపిక చేసింది ప్రభుత్వం.
తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు తంగేడు మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ప్రత్యేకంగా పెంచకపోయిన ఇవి ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. వీటిని బతుకమ్మ తయారీలో ఉపయోగించడంతో పాటు సౌభాగ్యానికి, రక్షణకు ప్రతీకగా మహిళలు భావిస్తుంటారు. ఈ తంగేడు పూలలో ఔషధ గుణాల కూడా ఉంటాయి... అందుకే బతుకమ్మలో వీటిని ఉపయోగించడం ద్వారా నీరు శుద్ది అవుతాయని నమ్ముతారు.
రాష్ట్ర విభజనకు ముందు అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రాష్ట్రీయ పుష్పంగా కలువ పువ్వు ఉండేది... దశాబ్దాల పాటు ఇదే కొనసాగింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తంగేడును రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం 2018 లో కలువ స్థానంలో మల్లెపువ్వును రాష్ట్ర పుష్ఫంగా గుర్తించింది.
ఇక దేశంలోని ఎక్కువ రాష్ట్రాలకు రాష్ట్రీయ పుష్పంగా బంతిపువ్వు ఉంది. ఇది బిహార్, చత్తీస్ గడ్, గుజరాత్ కు రాష్ట్రీయ పుష్పం. మధ్య ప్రదేశ్ కు వైట్ లిల్లి, మణిపూర్ సిరోయి లిల్లి అధికారిక పుష్పాలు. ఇలా ఇండియాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో పువ్వును అధికారికంగా గుర్తించాయి... రాష్ట్రీయ పుష్పంగా వాడుతున్నాయి.