ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిందే. కష్టకాలంలో దేశ ఆర్థిక పునాదిని కాపాడేది ఈ బంగారు నిల్వలే. తాజాగా విడుదలైన గ్లోబల్ డేటా ప్రకారం, అంతర్జాతీయంగా అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశాల జాబితాలో చైనా భారీ దూకుడు ప్రదర్శించింది. రష్యాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద గోల్డ్ రిజర్వ్ కలిగిన దేశంగా చైనా నిలిచింది. ప్రస్తుతం చైనా కంటే ముందు అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ మాత్రమే ఉన్నాయి.
ప్రముఖ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ 'ది కోబెసీ లెటర్' వెల్లడించిన గణాంకాల ప్రకారం, చైనా వద్ద ప్రస్తుతం ఏకంగా 2,410 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. టాప్-3 దేశాల జాబితాలోకి చేరేందుకు చైనా ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. ఫ్రాన్స్ వద్ద 2,437 టన్నులు, ఇటలీ వద్ద 2,452 టన్నుల బంగారం ఉంది.
అంటే, చైనా ఫ్రాన్స్ కంటే కేవలం 27 టన్నులు, ఇటలీ కంటే 42 టన్నులు మాత్రమే వెనుకబడి ఉంది. ఇక ఈ జాబితాలో భారత్ 881 టన్నుల నిల్వలతో 8వ స్థానంలో నిలిచింది. చైనా వద్ద భారత్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ బంగారం ఉండటం గమనార్హం.