
పురాతన ఈజిప్టు రాజుల మరణం తర్వాత వారి సేవకులను కూడా చంపి సమాధుల్లో పాతిపెట్టేవారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న పరిశోధకులకు ఇప్పుడు కీలక ఆధారాలు లభించాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి మానవ పుర్రెలను ఫోరెన్సిక్ పద్ధతుల్లో పరీక్షించగా.. వాటిపై ప్రాణాంతక గాయాల ఆనవాళ్లు బయటపడ్డాయి. రాజుల మరణ సమయంలోనే ఈ గాయాలు తగిలి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
పురాతన ఈజిప్టులోని తొలి రాజవంశం కాలానికి (క్రీ.పూ. 3100–2900) చెందిన మానవ అవశేషాలపై ఈ పరిశోధన నిర్వహించారు. అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన బయోఆర్కియాలజిస్ట్ డాక్టర్ రోసెలిన్ క్యాంప్‌బెల్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. దక్షిణ ఈజిప్టులోని అబిడోస్ ప్రాంతంలో రాజుల సమాధుల సముదాయాల చుట్టూ లభించిన మానవ అవశేషాలను పరిశోధకులు మరోసారి పరిశీలించారు.
ఈ ప్రాంతం పురాతన ఈజిప్టు రాజుల సమాధులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సమాధుల్లో రాజులతోపాటు పెద్ద సంఖ్యలో ఇతర వ్యక్తుల అవశేషాలు కూడా బయటపడ్డాయి. వీరు రాజుల సేవకులై ఉండొచ్చని, పాలకులు మరణించినప్పుడు వారిని కూడా బలి ఇచ్చి సమాధుల సమీపంలో పాతిపెట్టి ఉండవచ్చని గతంలోనే కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు అనుమానించారు. అయితే, ఆ వాదనకు బలమైన ఆధారాలు లభించలేదు.
1920వ దశకంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఫ్లిండర్స్ పెట్రీ అబిడోస్‌లో తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో బయటపడిన మానవ అవశేషాలను పరిశీలించిన ఆయన.. రాజుల సేవకులను కూడా బలి ఇచ్చి ఉండవచ్చని అనుమానించారు. అయితే, ఎముకలపై ఆయుధాల గుర్తులు లేదా స్పష్టమైన ప్రాణాంతక గాయాలు కనిపించకపోవడంతో ఆ వాదనను నిరూపించలేకపోయారు.
ఆయన చాలా మానవ అవశేషాలను తిరిగి ఖననం చేయగా.. కొన్ని డజన్ల పుర్రెలను మాత్రం భద్రపరిచారు. అవి దెబ్బతినకుండా ఉండేందుకు వాటిపై మైనాన్ని పూశారు. ఆ తర్వాత ఈ పుర్రెలు బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చేరాయి. చాలా కాలం తర్వాత ఆధునిక ఫోరెన్సిక్ పద్ధతులతో వాటిని పరిశీలించడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పరిశోధకులు మొత్తం 46 పుర్రెలను తిరిగి పరీక్షించగా.. వాటిలో 18 పుర్రెలపై స్పష్టమైన పగుళ్లు, గాయాలు కనిపించాయి. అంటే, దాదాపు 39 శాతం పుర్రెలపై గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ గాయాలు మరణ సమయంలో లేదా దానికి దగ్గరగా ఉన్న సమయంలో ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.
పుర్రెలపై కనిపించిన గాయాలు పగుళ్ల రూపంలో ఉన్నాయని క్యాంప్‌బెల్ వివరించారు. ఇలాంటి గాయాల వల్ల వేగంగా స్పృహ కోల్పోవడం, రక్తస్రావం జరగడం, చివరకు మరణం సంభవించడం సాధ్యమని పేర్కొన్నారు.
పురాతన ఈజిప్షియన్లకు మరణానంతర జీవితం పట్ల బలమైన విశ్వాసాలు ఉండేవి. రాజులు మరణించిన తర్వాత కూడా మరో లోకంలో జీవిస్తారని, అక్కడ వారికి సేవలు అందించే వారు అవసరమవుతారని భావించి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నమ్మకంతోనే కొందరు సేవకులను రాజులతోపాటు సమాధి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
అయితే, సేవకులందరినీ బలవంతంగా చంపి ఉండాల్సిన అవసరం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు శాశ్వత జీవితాన్ని పొందాలనే నమ్మకంతో లేదా రాజుకు సేవ చేయడం గౌరవంగా భావించి స్వచ్ఛందంగా మరణానికి సిద్ధపడి ఉండవచ్చు. మరికొందరిని బలవంతంగా చంపి ఉండవచ్చని పేర్కొంటున్నారు. రాజుల అధికారాన్ని ప్రదర్శించడానికి కూడా ఇలాంటి ఆచారాలు జరిగేవని చెబుతున్నారు.
పరిశోధనకు సంబంధించిన ఫలితాలు Frontiers in Environmental Archaeology అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే, పుర్రెలపై గాయాలు కనిపించడం, అవి మరణ సమయంలో ఏర్పడి ఉండవచ్చని గుర్తించడం ముఖ్యమైన ఆధారమే అయినప్పటికీ.. ప్రతి వ్యక్తిని కచ్చితంగా బలి ఇచ్చే చంపారనే విషయాన్ని నిరూపించలేదు. పురావస్తు ఆధారాలతో కలిపి పరిశీలించినప్పుడు, కనీసం కొందరు సేవకులను ఉద్దేశపూర్వకంగా చంపి రాజుల సమాధుల సమీపంలో పాతిపెట్టి ఉండవచ్చనే వాదనకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాజుల కోసం సేవకులను బలి ఇచ్చే ఆచారం పురాతన ఈజిప్టు చరిత్రలో కొంతకాలం మాత్రమే కొనసాగిన దశగా పరిశోధకులు చెబుతున్నారు.