
Worlds Biggest Dump Yards : ప్రపంచంలో అత్యధికంగా చెత్తను ఉత్పత్తి చేసే దేశమేది...? ఈ ప్రశ్న కనిపించగానే మీకుకూడా ఏ నిరుపేద దేశమో గుర్తొచ్చి ఉంటుంది కదా..? చాలామంది ఏ కెన్యా, సోమాలియా, సూడాన్ లేక బంగ్లాదేశ్ వంటి దేశాలు అనుకుంటారు... కానీ కాదు. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచంలో అతిపెద్ద డంప్ యార్డ్ (చెత్తను పడేసే ప్రాంతం) అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. ఇటీవల విడుదలైన వరల్డ్ టాప్ డంపిగ్ యార్డ్స్ లిస్ట్ లో అమెరికా టాప్ లో నిలిచింది.
అపెక్స్ రీజినల్ ల్యాండ్‌ఫిల్ (Apex Regional Landfill)... అమెరికాలోని నెవాడా (Nevada) ప్రాంతంలోని డంప్ యార్డ్ ఇది. వైశాల్యం పరంగా చూస్తే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్... సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ 9 వేల నుండి 15 వేల టన్నుల చెత్తను డంప్ చేస్తారు. 250 ఏళ్ల పాటు చెత్తను నిల్వ చేసే సామర్థ్యం దీనికి ఉంది.
అయితే భూమి మీద కాకుండా సముద్రంలో పేరుకుపోయిన చెత్తను పరిగణనలోకి తీసుకుంటే 'గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్' (Great Pacific Garbage Patch) అతిపెద్దది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో రెండు 'టెక్సాస్' రాష్ట్రాలంత వైశాల్యంలో (సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది.
లావోగాంగ్ (Laogang)... ఇది చైనాలో అత్యధిక జనాభా కలిగిన షాంఘై నగరంలోని డంప్ యార్డ్. ఇది సుమారు 830 ఎకరాల్లో విస్తరించి ఉంది... ప్రతిరోజూ 11 వేల టన్నుల చెత్తను డంప్ చేస్తారు. అయితే టెక్నాలజీ సాయంతో ఇక్కడ చెత్త నుండి 1.6 బిలియన్ కిలో వాట్స్ విద్యుత్తును తయారుచేస్తున్నారు.
అయితే గతంలో మెక్సికో లోని బోర్డో పొనియంటే (Bordo Poniente) ప్రపంచంలో రెండో అతిపెద్ద డంప్ యార్డ్ గా ఉండేది. 927 ఎకరాల్లోని డంప్ యార్డ్ ప్రస్తుతం మూతపడింది... అంటే దీన్ని ఉపయోగించడం లేదు. అందుకే చైనాలోని లావోగాంగ్ రెండో స్థానానికి చేరుకుంది.
బంటర్ జెబ్యాంగ్ (Bantar Gembang)... ఇది ఇండోనేషియా దేశంలోని జకార్తాలో గల డంపింగ్ యార్డ్. ఇక్కడ చెత్త పెద్ద కొండలా పేరుకుపోయిందట. ప్రతిరోజూ 7000 నుండి 9000 టన్నుల చెత్త డంప్ చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డంప్ యార్డ్ ఏకంగా 20000 ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడి చెత్తనుండి వస్తువులను ఏరుకుని అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు.
జవహర్ నగర్ డంప్ యార్డ్ (హైదరాబాద్)
ఇక ప్రపంచంలో అతిపెద్ద డంప్ యార్డ్స్ లిస్ట్ లో టాప్ 4, 5 ఇండియాలోనే ఉన్నాయి. మన హైదరాబాద్ చెత్తను తరలించే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దేశంలోనే అతిపెద్దది... ప్రపంచంలో నాల్గవది. 350 ఎకరాల్లో విస్తరించిన ఈ డంప్ యార్డ్ లో రోజూ 9 వేల నుండి 10 వేల టన్నుల డంప్ అవుతుంది.
ఆందోళనకరమైన అంశం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా మీథేన్ వాయువును విడుదల చేస్తున్న డంప్ యార్డ్ ఈ జవహర్ నగర్ దే. ఇది గంటకు 5.9 టన్నుల మీథేన్‌ను విడుదల చేస్తూ పర్యావరణానికి ముప్పుగా మారింది... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇలా జవహర్ నగర్ డంప్ యార్డ్ కార్డన్ డై ఆక్సైడ్ కంటే ప్రమాదకమైన మీథేన్ విడుదలచేస్తూ... చుట్టుపక్కల 8,9 కిలోమీటర్ల పరిధిలో నీటిని కాలుష్యపరుస్తూ... ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
ఘాజీపూర్ డంప్ యార్డ్ (డిల్లీ)
దేశ రాజధాని డిల్లీలోని ఘాజీ పూర్ డంప్ యార్డ్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ డంప్ యార్డ్ వైశాల్యం పరంగా చిన్నదైనా, ఎత్తు పరంగా కుతుబ్ మినార్‌ను కూడా దాటేసి 'చెత్త పర్వతంగా' మారింది. డిల్లీలోని వేల టన్నుల చెత్త ప్రతిరోజూ ఈ డంప్ యార్డ్ కే చేరుకుంటుంది.
చైనా, కొరియా వంటి దేశాలు ఈ చెత్తను కేవలం పారేయడమే కాకుండా, దాని నుండి గ్యాస్, విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 'వేస్ట్ టు వెల్త్' కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాయి. భారతదేశం కూడా ఇలాగే చెత్తనుండి సంపదను సృష్టించే ఏర్పాట్లు చేయాలి... అప్పుడే డంప్ యార్డ్స్ లో చెత్త పేరుకుపోకుండా నిలువరించవచ్చు.