National River: భారతదేశంలో 400 నదులు దాకా ఉన్నాయి. కానీ మనదేశ జాతీయ నది ఏదో తెలుసా? ఆ నదినే ఎందుకు ఎంపిక చేశారు? ఆ నది స్పెషాలిటీ ఏంటో తెలుసుకోండి. ఈ నదికి మనదేశంతో ఎంతో అనుబంధం ఉంది.
భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే దేశ జాతీయ నదిగా మాత్రం గంగా నదికి గుర్తింపు లభించింది. 2008 నవంబర్ 4న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గంగకు జాతీయ నది హోదా కల్పించింది. అయితే దేశంలో గోదావరి, కృష్ణా, యమునా, బ్రహ్మపుత్ర వంటి పెద్ద నదులు ఉన్నా గంగనే ఎందుకు ఎంపిక చేశారనే సందేహం చాలామందికి వస్తుంది. దీనికి ప్రధాన కారణం గంగకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక ప్రాధాన్యం. భారతీయ సంప్రదాయాల్లో గంగను పవిత్ర నదిగా భావిస్తారు. వేల ఏళ్లుగా ఈ నది ప్రజల జీవనంలో భాగంగా ఉంది. ఎన్నో పండుగలు, పూజలు, పుణ్యస్నానాలు గంగ తీరంలో జరుగుతుంటాయి. అందుకే దేశ ప్రజలతో ఈ నదికి ప్రత్యేక అనుబంధం ఉంది.
23
గంగానదే ఎందుకు?
గంగా నది కేవలం పవిత్ర నదిగానే కాకుండా కోట్లాది మందికి జీవనాధారంగా కూడా నిలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ప్రాంతంలో పుట్టే ఈ నది ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. గంగ పరివాహక ప్రాంతంలో కోట్లాది మంది నివసిస్తున్నారు. తాగునీరు, వ్యవసాయం, చేపల పెంపకం వంటి అవసరాలకు ఈ నది ఎంతో ఉపయోగపడుతోంది. గంగ తీసుకొచ్చే ఒండ్రుమట్టి వల్ల నది పరిసరాల్లోని భూములు సారవంతంగా మారుతాయి. దీంతో రైతులు వరి, గోధుమలు, చెరకు వంటి పంటలు పండిస్తున్నారు. ప్రాచీన కాలంలోనూ గంగ తీరంలో ఎన్నో పట్టణాలు, రాజ్యాలు అభివృద్ధి చెందాయి. వ్యాపారం, రవాణా, ప్రజల జీవనానికి ఈ నది ఎంతో తోడ్పడింది. అందుకే గంగకు చారిత్రకంగా కూడా ఎంతో గుర్తింపు ఉంది.
33
గంగలో పెరిగిపోతున్న కాలుష్యం
అయితే రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం గంగ నదికి పెద్ద సమస్యగా మారింది. పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీరు నదిలో కలవడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటోంది. జలచరాల మనుగడకు కూడా ముప్పు ఏర్పడుతోంది. ఈ సమస్యలను తగ్గించి గంగను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ నది హోదా కల్పించింది. 2009 ఫిబ్రవరి 20న గంగా నది పరిరక్షణ కోసం జాతీయ గంగా నది పరివాహక ప్రాంత ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. నదిలో కాలుష్యాన్ని తగ్గించడం, నీటి ప్రవాహాన్ని కాపాడటం, నదిని శుభ్రంగా ఉంచడం దీని ప్రధాన లక్ష్యాలు. గంగా నదిలో కనిపించే అరుదైన గంగా డాల్ఫిన్ కూడా ప్రత్యేక ఆకర్షణ. ఇలా ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, వ్యవసాయపరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నందున గంగకు భారతదేశ జాతీయ నది హోదా లభించింది.