Honey Capital: ఇక్కడి తేనె వరల్డ్ వైడ్ ఫేమస్.. హనీ క్యాపిటల్ గా పిలిచే ఈ సిటీ ఎక్కడుందో తెలుసా?

Published : Nov 09, 2026, 09:30 AM IST

Honey Capital: తేనె ఎలా వస్తుందో తెలుసు. అమెరికాలోని ఓ నగరానికి తేనెతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తేనె ఉత్పత్తి మాత్రమే కాదు..వందేళ్లకు పైగా చరిత్ర, విభిన్న రకాల తేనెలు దొరుకుతాయి. 'హనీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్'గా పిలిచే ఆ సిటీ గురించి తెలుసా?

PREV
17
ప్రపంచ తేనె రాజధానిగా గుర్తింపు

అమెరికాలోని ఐయోవా (Iowa) రాష్ట్రంలో ఉన్న సియూక్స్ సిటీ (Sioux City)కి ప్రపంచ తేనె రాజధానిగా పేరుంది. 1970ల కాలంలో ఈ నగరం తేనె వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రంగా ఎదగడంతో ఈ గుర్తింపు వచ్చింది. అయితే ఈ ప్రయాణం వెనుక వందేళ్లకు పైగా చరిత్ర ఉంది.

1921లో ఐయోవాలోని సెర్జెంట్ బ్లఫ్ ప్రాంతానికి చెందిన ఎడ్ బ్రౌన్ అనే 27 ఏళ్ల తేనెటీగల పెంపకందారుడు మరికొందరు పెంపకందారులతో కలిసి ఓ సహకార సంస్థను ప్రారంభించారు. ఇందుకోసం అప్పట్లో కేవలం 500 డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. దాదాపు 3 వేల పౌండ్ల తేనెతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తొలి ఏడాదిలోనే పౌండ్ తేనెను 10 సెంట్ల చొప్పున విక్రయిస్తూ స్థానికంగా 20 వేల పౌండ్ల తేనె అమ్మగలిగారు. ఆ తర్వాత ఈ వ్యాపారం క్రమంగా విస్తరించింది. 1930 నాటికి ఏడాదికి 8.25 లక్షల పౌండ్ల తేనె ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. అలా మొదలైన ప్రయాణం 1970ల నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఈ విజయానికి ప్రధాన కారణం సియూక్స్ హనీ అసోసియేషన్. ఈ సంస్థే ప్రముఖ 'సూ బీ' (Sue Bee) హనీ బ్రాండ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ దాదాపు 40 దేశాలకు తేనెను ఎగుమతి చేస్తోంది.

27
తేనె ఉత్పత్తికి ఐయోవా ఎందుకు అనుకూలం?

ఐయోవా రాష్ట్రంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడి భూభాగంలో 80 శాతానికి పైగా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి పంటలు విస్తారంగా సాగవుతాయి. వీటితో పాటు క్లోవర్, అడవి పూలు, స్థానిక పుష్పించే మొక్కలు తేనెటీగలకు సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తాయి.

ముఖ్యంగా సోయాబీన్ పూలు తేనెటీగలను ఆకర్షిస్తాయి. క్లోవర్ పూల నుంచి లభించే మకరందం కూడా తేనె ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. విస్తారమైన పచ్చిక బయళ్లు, పూల మొక్కలు ఉండటంతో తేనెటీగల పెంపకానికి ఐయోవా అనువైన ప్రాంతంగా మారింది.

37
ఐయోవాలో ఎన్ని రకాల తేనెటీగలు ఉన్నాయి?

ఐయోవాలో దాదాపు 400 రకాల స్థానిక తేనెటీగ జాతులు ఉన్నట్లు అంచనా. అయితే వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి చేయడానికి ప్రధానంగా యూరప్ నుంచి పరిచయమైన హనీ బీస్ (Apis mellifera)ను ఉపయోగిస్తారు.

వీటితో పాటు మరికొన్ని ప్రత్యేకమైన తేనెటీగ జాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. బంబుల్ బీస్ భూమిలోని చిన్న బొరియల్లో నివాసం ఏర్పరుచుకుంటాయి. స్వెట్ బీస్ నీలం, ఆకుపచ్చ రంగుల మెరుపులతో ఆకట్టుకుంటాయి. మేసన్ బీస్ పండ్ల చెట్లు, పంటల పరాగసంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. లీఫ్‌కట్టర్ బీస్ తమ పొట్ట భాగంలో పుప్పొడిని నిల్వ చేసుకుంటాయి. ఈ విభిన్న జాతుల తేనెటీగలు అక్కడి పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

47
ఐయోవాలో లభించే తేనె రకాలు ఇవే!

ఐయోవా ప్రత్యేకత కేవలం తేనె ఉత్పత్తిలోనే కాదు.. అక్కడ లభించే తేనె రకాలలోనూ ఉంది.

క్లోవర్ హనీ: ఐయోవాలో అత్యంత ఎక్కువగా ఉత్పత్తి చేసే తేనె రకాల్లో ఇది ఒకటి. తెలుపు, పసుపు రంగు క్లోవర్ పూల నుంచి సేకరించిన మకరందంతో తయారవుతుంది. లేత రంగులో ఉండే ఈ తేనె రుచి తియ్యగా, మృదువుగా ఉంటుంది. ప్రత్యేకమైన ఘాటైన రుచి లేకపోవడంతో టీ, పాలు, బేకరీ పదార్థాల్లో ఉపయోగిస్తారు.

వైల్డ్‌ఫ్లవర్ హనీ: అడవి పూల నుంచి సేకరించిన మకరందంతో తయారయ్యే ఈ తేనెకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. గోల్డెన్‌రోడ్, కోన్‌ఫ్లవర్, బీ బామ్ వంటి పూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. ఏ ప్రాంతంలో, ఏ కాలంలో సేకరించారనే దానిపై దీని రంగు, రుచి మారుతూ ఉంటాయి.

ఫ్లేవర్డ్ హనీ: సాధారణ తేనెకు భిన్నంగా నిమ్మకాయ, మిరపకాయలు, సముద్రపు ఉప్పు వంటి పదార్థాలతో ప్రత్యేక రుచులు జోడించి తయారు చేస్తారు. ముఖ్యంగా మిరపకాయలతో తయారుచేసే హాట్ హనీకి అమెరికాలో మంచి ఆదరణ ఉంది. పిజ్జా, చికెన్ వంటి ఆహార పదార్థాలపై దీన్ని ఉపయోగిస్తారు.

కాంబ్ హనీ: తేనెటీగలు తయారుచేసిన మైనపు తుట్టెల్లోనే నిల్వ ఉండే తేనెను కాంబ్ హనీ అంటారు. ఇందులో తేనెతో పాటు తుట్టె కూడా ఉంటుంది. ఆ మైనపు తుట్టెను కూడా తినవచ్చు. సాధారణంగా తేనెను సేకరించి వేరు చేసే ప్రక్రియ లేకుండానే ఇది వినియోగదారులకు అందుతుంది.

రా హనీ: ఎలాంటి అధిక వేడి ప్రక్రియలు, ఎక్కువ వడపోత లేకుండా సేకరించే తేనెను రా హనీ అంటారు. దీని సహజమైన రుచి, సువాసన ప్రత్యేకంగా ఉంటాయి. చిన్న తేనెటీగల పెంపక కేంద్రాలు ఈ తరహా తేనె ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

57
వంటల్లోనూ ప్రత్యేక స్థానం

ఐయోవా ప్రజల ఆహారపు అలవాట్లలో తేనెకు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం స్వీట్లు, డ్రింక్స్ లో కాకుండా వంటకాల్లోనూ దీనిని ఉపయోగిస్తారు. కేకులు, బ్రెడ్, కుకీలు, గ్రానోలా వంటి బేకరీ పదార్థాల్లో చక్కెరకు బదులుగా తేనెను వినియోగిస్తారు. ఇది ఆహార పదార్థాల్లో తేమను నిలవడానికి సహాయపడుతుంది. నాన్ వెజ్ వంటకాలకు గ్లేజ్‌గా కూడా తేనెను ఉపయోగిస్తారు. ముఖ్యంగా తియ్యదనంతో పాటు కొద్దిగా ఘాటు రుచి కలిగిన హాట్ హనీతో చికెన్ వింగ్స్, శాండ్‌విచ్‌లు, పిజ్జాలకు ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తారు.

టీ, ఆపిల్ సైడర్ వంటి పానీయాల్లోనూ తేనెను ఉపయోగిస్తారు. స్థానికంగా నిర్వహించే రైతు బజార్లలో వివిధ రకాల తేనెతో పాటు తేనెటీగల మైనంతో తయారుచేసిన ఉత్పత్తులు కూడా విక్రయిస్తుంటారు.

67
కోట్ల రూపాయల విలువైన తేనె పరిశ్రమ

ఐయోవాలో తేనె ఉత్పత్తి కేవలం సంప్రదాయ వృత్తిగా మాత్రమే కాకుండా మంచి ఆదాయాన్ని అందించే పరిశ్రమగా ఎదిగింది. ఈ పరిశ్రమ విలువ 8 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక పంటల పరాగసంపర్కంలో తేనెటీగల పాత్ర వల్ల ఐయోవా వ్యవసాయ రంగానికి ఏటా దాదాపు 92 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అంచనా. 2020లో ఐయోవాలోని 38 వేల తేనెటీగల కాలనీల నుంచి ఏకంగా 12,59,000 పౌండ్ల తేనె ఉత్పత్తి అయింది. అంటే సుమారు 5.7 లక్షల కిలోల తేనె అన్నమాట.

77
భారత్‌తోనూ పోల్చుకోవచ్చు

భారతీయులకు తేనెతో విడదీయలేని అనుబంధం ఉంది. వంటకాల్లో, ఆయుర్వేద సంప్రదాయాల్లో, పూజా కార్యక్రమాల్లోనూ తేనెను ఉపయోగిస్తుంటారు. అయితే ఐయోవా ప్రత్యేకత ఏమిటంటే.. చిన్న స్థాయిలో ప్రారంభమైన తేనెటీగల పెంపకాన్ని అంతర్జాతీయ వ్యాపారంగా అభివృద్ధి చేయడం. భారత్‌లోనూ అటవీ తేనె, మల్టీఫ్లోరల్ హనీ, సింగిల్ ఆరిజిన్ హనీ వంటి ప్రత్యేక రకాలపై ఆసక్తి పెరుగుతోంది. స్థానిక తేనెటీగల పెంపకందారులకు ప్రోత్సాహం లభిస్తే ఈ రంగంలో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి.

ఒకప్పుడు కేవలం 500 డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన ప్రయత్నం.. నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారంగా ఎదిగింది. అందుకే సియూక్స్ సిటీకి 'హనీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్' అనే పేరు వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories