ఇక శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం వాకింగ్ పామ్ అసలు నడవదు. చెట్టు ఒకేచోటే ఉంటుంది. కానీ దాని వేళ్ల నిర్మాణం వల్ల మనకు కదులుతున్నట్టు అనిపిస్తుంది. వర్షపు అడవుల్లో నేల చాలా మృదువుగా ఉంటుంది. భారీ వర్షాల వల్ల నేల కొట్టుకుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో చెట్టు పడిపోకుండా నిలబడటానికి ఈ ప్రత్యేకమైన వేళ్లు ఉపయోగపడతాయి. నేల మార్పులకు అనుగుణంగా కొత్త వేళ్లు బలంగా పెరుగుతాయి. పాత వేళ్లు క్రమంగా క్షీణిస్తాయి. ఈ మార్పు వల్ల చెట్టు స్థానం ముందుకు మారినట్టు భ్రమ కలుగుతుంది. చెట్టుకు కొత్త వేర్లు వచ్చి ముందు వైపు చొచ్చుకుని వెళతాయి. వెనుకమైపు ఉన్న వేర్లు ఊడిపోతాయి. దీని వల్ల చెట్టు ముందుకు కదిలినట్టు వస్తుంది.
వాకింగ్ పామ్ వేర్లు చెట్టుకు అదనపు సపోర్టు ఇస్తాయి. పెద్ద గాలులు వీచినప్పుడు చెట్టు పడిపోకుండా ఇవి కాపాడతాయి. అలాగే అడవుల్లో వెలుతురు కోసం పైకి ఎదగడానికి సహాయపడతాయి. ఈ వేర్ల నిర్మాణం వల్ల చెట్టు ఇతర చెట్లకంటే వేగంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వాకింగ్ పామ్ ను ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతంగా చెబుతారు శాస్త్రవేత్తలు. మొత్తానికి వాకింగ్ పామ్ చెట్టు నిజంగా నడిచే చెట్టు కాదు. ఇది ఒక చోట నుంచి మరో చోటికి అడుగులు వేసి వెళ్లదు. కానీ దాని ప్రత్యేకమైన రూట్ల నిర్మాణం వల్ల ముందుకు వెళ్లినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ చెట్టు మాత్రం చాలా వింతైనది. చూసేందుకు కూడ ఆసక్తికరమైనది.