
స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ… ఎక్కడైనా పరీక్షల్లో పాస్ అవ్వాలంటే 100 కు తప్పనిసరిగా 35 మార్కులు రావాలి. ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినట్లే. అందుకే చదువులో వెనకబడ్డ విద్యార్థులు కేవలం 35 మార్కులు వస్తే చాలని అనుకుంటారు... ఇందుకోసమే ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ 35 పాస్ మార్కుల రూల్ ఎక్కడి నుండి వచ్చింద్రా బాబు అనుకుంటారు.. ఇదే డౌట్ ఇంకా చాలామందికి ఉంటుంది. మరి ఈ పాస్ మార్కుల స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
కొన్ని దశాబ్దాలుగా భారత విద్యావ్యవస్థలో పాస్ మార్కులు 35 రూల్ కొనసాగుతోంది.. ఇది మన పరీక్షల సంస్కృతిలో భాగమైపోయింది. అయితే ఈ రూల్ బ్రిటిష్ కాలం నాటి వారసత్వంగా వచ్చిందా లేక స్వాతంత్య్రం తర్వాత తీసుకున్న నిర్ణయమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మన విద్యా విధానాన్ని రూపొందించే క్రమంలో తీసుకున్న ఆనాటి నిర్ణయాలను లోతుగా పరిశీలించాలి.
ఇండియా బ్రిటిష్ వాళ్ల ఆధీనంలో ఉండగా పరిపాలనా అవసరాల కోసం ఉద్యోగులు కావాల్సి వచ్చింది. అయితే ప్రతి చిన్న ఉద్యోగిని ఇంగ్లాండ్ నుండి తీసుకురాలేరు… కాబట్టి ఇక్కడి ప్రజలకే జాబ్స్ ఇవ్వాలని భావించారు. అందుకోసమే ఇక్కడి విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టారు ఆంగ్లేయులు.
బ్రిటీష్ అధికారి లార్డ్ మెకాలే 1835లో తన 'మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్'లో ఒక ప్రతిపాదన చేశారు. 'రక్తంలో, రంగులో భారతీయులుగా ఉండి.. అభిరుచి, అభిప్రాయాలు, నైతికత, తెలివిలో ఆంగ్లేయులుగా' ఉండే ఒక వర్గాన్ని తయారు చేయడమే మన లక్ష్యం కావాలని సూచించాడు. ఈ మెకాలే ప్రతిపాదనలే ఆంగ్ల విద్యకు దారి చూపాయి.
అయితే మెకాలే ఎక్కడా 35 పాస్ మార్క్ గురించి చెప్పలేదు. ఆయన దృష్టి బోధనా మాధ్యమం, సిలబస్‌పైనే ఉండేది. మొదట్లో కొద్దిమంది ఉన్నత వర్గాలకే విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది క్రమంగా మారింది… అందరికీ విద్యా అందుబాటులోకి వచ్చింది.
పరీక్షల్లో 35 పాస్ మార్క్ అనే నియమం కచ్చితంగా ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టం. దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవు. 19వ శతాబ్దం చివర్లో లేదా 20వ శతాబ్దం ప్రారంభంలో తీసుకున్న కొన్ని ఆచరణాత్మక నిర్ణయాల వల్లే ఈ రూల్ వచ్చివుంటుందని చాలామంది మేథావుల అభిప్రాయం.
బ్రిటిష్ పరిపాలనకు పెద్ద సంఖ్యలో క్లర్కులు, జూనియర్ అధికారులు అవసరమయ్యారు. ఇందుకోసం 100 కు 100 మార్కులు సాధించేంత తెెలివైనవారు అవసరం లేదు… మినిమం మార్కులతో పాసయినా సరిపోతుంది. అందుకే 35 లేదా 33 వంటి తక్కువ పాస్ మార్కును పెట్టడం వల్ల ఈ ఉద్యోగాలకు చాలా మందిని వేగంగా అర్హులుగా చేయగలిగారు. ఈ విధానం వలస ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది. చాలా మంది భారతీయులు సివిల్ సర్వీస్, ఇతర పరిపాలన ఉద్యోగాల్లో చేరడానికి ఇది వీలు కల్పించింది.
50% కాకుండా 35% మార్కును ఎందుకు ఎంచుకున్నారు? అంటే దీనికీ ఒక థియరీ ఉంది. బ్రిటిష్ వ్యవస్థ కొన్ని పరీక్షలకు 33% మార్కును పాస్ మార్క్‌గా పరిగణించేది. ఇందులో చిన్నచిన్న మార్పులు చోటుచేసుకుని 35% పాస్ మార్కుల రూల్ వచ్చినట్లు చెబుతుంటారు.
మరో వాదన ప్రకారం… అప్పట్లో విద్యార్థులు ఎదుర్కొన్న సవాళ్లు, ముఖ్యంగా విదేశీ భాష అయిన ఇంగ్లీషులో చదవడం కష్టతరం కావడంతో తక్కువ పాస్ మార్కు పెట్టడం ఆచరణాత్మక నిర్ణయంగా మారింది. విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే దీని ఉద్దేశం. ఎక్కువ మంది ఫెయిల్ అవ్వకుండా చూడటం, తద్వారా ఎక్కువ మందిని చదువు వైపు ప్రోత్సహించడం దీని లక్ష్యం. అకడమిక్ నైపుణ్యం కంటే, ప్రాక్టికల్ అక్షరాస్యతకే ప్రాధాన్యం ఇచ్చారు.
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది… అయినాా ఆంగ్లేయులు అలవాటు చేసిన విద్యావిధానమే కొనసాగించారు మన పాలకులు. వివిధ రాష్ట్ర, కేంద్ర బోర్డులలో 35% పాస్ మార్క్ ఒక ప్రామాణిక పద్ధతిగా మారింది. ఉత్తమ పనితీరును ప్రోత్సహించడానికి పాస్ మార్కును పెంచాలనే చర్చలు తరచుగా జరిగినా, 35 మార్కులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భారతీయ విద్యార్థుల విద్యా జీవితాన్ని ఈ మార్కులే నిర్దేశిస్తున్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనా సాధనంగా ఉన్న ఈ వారసత్వం, ఇప్పుడు భారతీయ విద్యార్థులకు కనీస అర్హతను నిర్దేశిస్తోంది.