
తుమ్ము అనేది మన శరీరంలో సహజంగా జరిగే రక్షణ ప్రక్రియ. ముక్కులోకి దుమ్ము, ధూళి, పుప్పొడి, అలర్జీ కలిగించే పదార్థాలు లేదా ఇతర చిన్న కణాలు ప్రవేశించినప్పుడు శరీరం వాటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మెదడుకు సంకేతాలు అందుతాయి. వెంటనే శరీరం స్పందించి ముక్కు, నోటి ద్వారా గాలిని ఒక్కసారిగా వేగంగా బయటకు పంపుతుంది. ఈ ప్రక్రియనే తుమ్ము అంటారు. దీనిని వైద్య పరిభాషలో స్నీజ్ రిఫ్లెక్స్ (Sneeze Reflex) అని పిలుస్తారు. ఇలా తుమ్మడం వల్ల శ్వాస మార్గాల్లోకి చేరిన ఇబ్బందికరమైన పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అయితే ఈ ప్రక్రియలో కళ్లు కూడా వాటంతట అవే మూసుకుపోతాయి.
తుమ్మేటప్పుడు కళ్లు తప్పనిసరిగా మూసుకోవాలని, ఒకవేళ తెరిచి ఉంచితే ఒత్తిడి కారణంగా కనుగుడ్లు బయటకు వస్తాయని చాలామంది చెబుతుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. తుమ్మే సమయంలో శరీరంలో ఒత్తిడి పెరిగినప్పటికీ.. ఆ ఒత్తిడి వల్ల కనుగుడ్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి తుమ్మేటప్పుడు కళ్లు తెరిచి ఉంటే ఏదో ప్రమాదం జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. కళ్లు మూసుకోవడం అనేది శరీరంలో సహజంగా జరిగే ప్రతిచర్య మాత్రమే.
తుమ్మేటప్పుడు కళ్లు మూసుకుపోవడానికి ప్రధాన కారణం శరీరంలోని అసంకల్పిత ప్రతిచర్యలు. తుమ్ము వచ్చినప్పుడు ముఖంలోని కండరాలు, ముక్కు, నోరు, కళ్లు ఒకదానితో మరొకటి సమన్వయంతో పనిచేస్తాయి. ఈ సమయంలో కనురెప్పలను మూసే కండరాలు కూడా స్పందిస్తాయి. ఫలితంగా కళ్లు వాటంతట అవే మూసుకుపోతాయి. తుమ్మేటప్పుడు నోరు, ముక్కు నుంచి గాలి వేగంగా బయటకు వెళ్తుంది. దానితో పాటు చిన్న చిన్న తుంపర్లు, సూక్ష్మ కణాలు కూడా గాలిలోకి వ్యాపిస్తాయి. కళ్లు మూసుకోవడం వల్ల వాటి నుంచి కంటికి కొంత రక్షణ లభించవచ్చు. అయితే కళ్లు మూసుకుపోవడానికి ఇదొక్కటే కారణం కాదు. ఇది తుమ్ము ప్రక్రియలో భాగంగా జరిగే సహజ నాడీ ప్రతిచర్య.
తుమ్మేటప్పుడు కళ్లు మూసుకుపోవడంలో ట్రైజెమినల్ నాడి (Trigeminal Nerve) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన ముఖంలోని అనేక భాగాలకు సంబంధించిన స్పర్శ సంకేతాలను మెదడుకు చేరవేస్తుంది. ముఖ్యంగా ముక్కు, ముఖం, కళ్ల చుట్టూ ఉండే ప్రాంతాల నుంచి సంకేతాలను తీసుకెళ్తుంది. ముక్కులోకి దుమ్ము లేదా ఇతర ఇబ్బందికరమైన పదార్థాలు చేరినప్పుడు ఈ నాడి స్పందిస్తుంది. ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మెదడు వెంటనే తుమ్ము ప్రక్రియను ప్రారంభించేందుకు సంకేతాలు పంపుతుంది. ఈ క్రమంలో ముఖంలోని కండరాలు, కనురెప్పలను మూసే కండరాలు కూడా స్పందిస్తాయి. అందుకే తుమ్మేటప్పుడు కళ్లు కూడా అసంకల్పితంగా మూసుకుపోతాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి మనం కావాలని నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చు.
తుమ్ము వచ్చినప్పుడు కొంతమంది నోరు, ముక్కు గట్టిగా మూసుకుని దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. తుమ్మును బలవంతంగా ఆపడం వల్ల శరీరంలో ఒక్కసారిగా ఏర్పడే ఒత్తిడి బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోవచ్చు. దీనివల్ల ముక్కు, చెవులు, గొంతు ప్రాంతాలపై ఒత్తిడి పడుతుంది. అరుదైన సందర్భాల్లో చెవికి సంబంధించిన సమస్యలు, రక్తనాళాలకు గాయాలు వంటి ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. అందుకే తుమ్ము వచ్చినప్పుడు దాన్ని బలవంతంగా అడ్డుకోకుండా సహజంగా బయటకు వెళ్లనివ్వాలి. అయితే ఇతరులకు ఇబ్బంది కలగకుండా టిష్యూ లేదా మోచేతి మడతలోకి తుమ్మాలి. ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల తుమ్ము ద్వారా వ్యాపించే సూక్ష్మక్రిముల నుంచి ఇతరులను కూడా రక్షించవచ్చు.