
చల్లని వాతావరణం, పచ్చని కొండలు, దట్టమైన అడవులు, జలపాతాలు, ప్రశాంతమైన ప్రకృతి అందాలు.. ఇవన్నీ ఆస్వాదించాలంటే ఏ ఊటీకో, కొడైకెనాలో వెళ్లాల్సిందే... ఇదే చాలామంది తెలుగోళ్ల అభిప్రాయం. అందుకే చాలామంది దూరం అయినప్పటికి ఊటీ వంటి చల్లని ప్రాంతాలకు వెళుతుంటారు... కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చిల్ అవుతుంటారు. ఇందుకోసం వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ చాలామందికి హైదరాబాద్ శివారులోనే ఊటీని తలదన్నే టూరిస్ట్ స్పాట్ ఉందని తెలియదు.
ఇకపై టూర్ కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి, వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు... హైదరాబాద్‌కు దగ్గర్లోనే ప్రకృతి అందాలతో ఆకట్టుకునే అద్భుతమైన ప్రాంతం ఉంది. అదే అనంతగిరి హిల్స్. ప్రకృతి సోయగాలు, చల్లని వాతావరణంతో ఆకట్టుకునే ఈ ప్రాంతాన్ని ‘తెలంగాణ ఊటీ’గా పిలుస్తుంటారు.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ అనంతగిరి కొండలు ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు సుమారు 80–90 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. నగర జీవనంలోని రద్దీ, కాలుష్యం, శబ్దాల నుంచి కాస్త దూరంగా ప్రకృతిలో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది మంచి గమ్యస్థానంగా నిలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకునే అవకాశం ఉండటంతో వీకెండ్ ట్రిప్‌లకు ఈ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి అనంతగిరి కొండలను చుట్టేసి సాయంత్రానికి తిరిగి నగరానికి చేరుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు సెలవులు తీసుకోలేని వారికి కూడా ఇది అనువైన వన్ డే ట్రిప్ డెస్టినేషన్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా వీకెండ్ లో ఉదయం వెళ్లి, సాయంత్రం తిరిగివచ్చేందుకు అనువైన టూరిస్ట్ స్పాట్.
అనంతగిరి హిల్స్ చుట్టూ విస్తరించిన అటవీ ప్రాంతం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వాతావరణాన్ని అందిస్తుంది. నగరంతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో కొండలు, చెట్లు పచ్చదనంతో కళకళలాడుతాయి.
వర్షాకాలంలో కొండలపై మొలిచే పచ్చని గడ్డి తివాచీలా కనిపిస్తుంది… ఇక చెట్ల మధ్య నుంచి వీచే చల్లని గాలులు, మబ్బులతో కమ్ముకున్న వాతావరణం అనంతగిరికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తాయి. అందుకే ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారు ఈ ప్రాంతాన్ని తరచూ సందర్శిస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో అయితే భూమికి పచ్చని చీర కట్టినట్లుగా ఈ ప్రాంతం ఉంటుంది.... చల్లగా, ఆహ్లాదరకంగా ఉండే వాతావరణం ఊటీని తలపిస్తుంది.
అనంతగిరి హిల్స్ అందాలను ఆస్వాదించేందుకు వర్షాకాలం ప్రత్యేకమైన సమయం. వర్షాలు పడినప్పుడు కొండ ప్రాంతాల్లోని చిన్న చిన్న వాగులు, నీటి ప్రవాహాలు జీవం పోసుకున్నట్లు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న జలపాతాలు కూడా ఏర్పడి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వర్షంతో తడిసిన చెట్లు, కొండలపై పరుచుకున్న పచ్చదనం, మబ్బులతో నిండిన ఆకాశం.. ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు మంచి అనుభూతిని అందిస్తాయి.
ట్రెక్కింగ్ ప్రియులకు మంచి స్పాట్
అనంతగిరి కొండలు ప్రకృతి అందాలను చూడటానికే కాకుండా అడ్వెంచర్‌ను ఇష్టపడేవారిని కూడా ఆకట్టుకుంటాయి. అడవులు, కొండ మార్గాల మధ్య ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. చెట్ల మధ్య నడుస్తూ కొండ ప్రాంతాలను అన్వేషించడం నగర జీవితానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. అయితే అడవుల్లోకి వెళ్లేటప్పుడు స్థానికంగా సూచించిన మార్గాల్లోనే ప్రయాణించడం మంచిది. తెలియని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకుండా, ముఖ్యంగా వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అనంతగిరి హిల్స్ ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా కలిగి ఉంది. ఇక్కడి పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కొండ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉండటంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.
ఆలయ పరిసరాల్లోని ప్రశాంత వాతావరణం, పచ్చని చెట్లు, కొండల అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అనంతగిరి పర్యటనలో ఆలయాన్ని సందర్శించడం చాలామంది తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు.
మూసీ నది జన్మస్థలం
అనంతగిరి హిల్స్‌కు ఉన్న మరో ప్రత్యేకత మూసీ నది జన్మస్థానం ఇక్కడే ఉండటం. హైదరాబాద్ నగరంతో ముడిపడిన మూసీ నది తన ప్రయాణాన్ని అనంతగిరి కొండల్లోని చిన్న నీటి ఊటల నుంచి ప్రారంభిస్తుంది. కొండల్లో పుట్టే చిన్న నీటి ప్రవాహాలు క్రమంగా కలిసి ముందుకు సాగుతూ మూసీ నదిగా మారతాయి. అనంతరం ఈ నది హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహిస్తూ దాని భౌగోళిక, చారిత్రక పరిణామాల్లో కీలక పాత్ర పోషించింది. దీంతో అనంతగిరి ప్రాంతానికి ప్రకృతి పరంగానే కాకుండా చారిత్రకంగా కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
ఫొటోలు, ప్రకృతి ఆస్వాదనకు..
ప్రకృతి అందాలను కెమెరాలో బంధించాలనుకునేవారికి అనంతగిరి హిల్స్ మంచి ప్రదేశం. కొండలపై నుంచి కనిపించే పచ్చని దృశ్యాలు, అడవులు, మబ్బులు, ఉదయం–సాయంత్రం వేళల్లో మారే ప్రకృతి రంగులు ఫొటోగ్రఫీకి ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత పచ్చగా మారుతుంది. ఉదయం వేళల్లో కొండలపై ఉండే పొగమంచు, చెట్ల మధ్య నుంచి వచ్చే సూర్యకిరణాలు పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి.
హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం అనంతగిరి హిల్స్‌కు ఉన్న ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రకృతి ప్రేమికులు వీకెండ్‌లో ఇక్కడికి వెళ్లి ఒక రోజంతా గడపవచ్చు. ప్రకృతి అందాలను చూడటంతో పాటు ఆలయ సందర్శన, ట్రెక్కింగ్, ఫొటోగ్రఫీ వంటి కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
అయితే ప్రకృతి ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయకుండా, చెత్తను అక్కడే వదిలిపెట్టకుండా పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అడవుల్లో మంటలు పెట్టడం, వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
ఊటీకి వెళ్లలేకపోతే.. అనంతగిరికి వెళ్లొచ్చు!
చల్లని వాతావరణం, పచ్చని కొండలు, అడవి అందాలు, నీటి ప్రవాహాలు, ఆధ్యాత్మిక ప్రదేశం.. ఇలా ఒకే ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో అనంతగిరి హిల్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రముఖ పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది. ఊటీ లేదా కొడైకెనాల్ వంటి హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు సమయం, బడ్జెట్ కుదరకపోతే హైదరాబాద్‌కు దగ్గర్లోనే ఉన్న ఈ ‘తెలంగాణ ఊటీ’ని ఒకసారి సందర్శించొచ్చు. ముఖ్యంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కొన్ని గంటలు గడపాలనుకునేవారికి అనంతగిరి హిల్స్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.