Ghost Flights: ప్రతి విమానాశ్రయంలో కొన్ని విమానాలను ఖాళీగా నడుపుతారు. వాటిని ఘోస్ట్ ఫ్లైట్స్ అ్ంటారు. ఇలా కొన్ని విమానాలను ఖాళీగా ఎందుకు తిప్పుతారు? దానికి కారణం ఏమిటి?
విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ప్రయాణికులతో నిండిన విమానాలను చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఒక్క ప్రయాణికుడు కూడా లేకుండా విమానాలు గాల్లో ప్రయాణిస్తుంటాయి. ఇలాంటి విమానాలనే ఘోస్ట్ ఫ్లైట్స్ (Ghost Flights) అంటారు. అంటే పూర్తిగా ఖాళీగా లేదా చాలా తక్కువ మంది ప్రయాణికులతో నడిచే విమానాలు. సాధారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికుల రద్దీని బట్టి విమానాలను నడుపుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు లేకపోయినా విమానాలను నడపాల్సి వస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక కొన్ని వ్యాపార కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విమానాశ్రయాల్లో విమానాలు రాకపోకలు సాగించేందుకు కేటాయించే సమయాలను స్లాట్స్ (Slots) అంటారు. రద్దీ ఎక్కువగా ఉండే విమానాశ్రయాల్లో ఈ స్లాట్స్‌కు ఎంతో డిమాండ్ ఉంటుంది.
23
స్లాట్స్ కోల్పోకుండా...
ఘోస్ట్ ఫ్లైట్స్ నడపడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ స్లాట్స్‌ను కోల్పోకుండా చూసుకోవడం. కొన్ని దేశాల్లోని రద్దీ విమానాశ్రయాల్లో విమానయాన సంస్థలకు కేటాయించిన స్లాట్స్‌ను కొనసాగించాలంటే నిర్ణీత శాతం విమాన సర్వీసులను నడపాల్సి ఉంటుంది. ఉదాహరణకు యూరప్‌లో సాధారణ నిబంధనల ప్రకారం కేటాయించిన స్లాట్స్‌లో కనీసం 80 శాతం వినియోగించాలి. అలా చేయకపోతే భవిష్యత్తులో ఆ స్లాట్స్‌ను కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణికులు తక్కువగా ఉన్నా విమానాలను నడుపుతుంటాయి. అయితే ఈ నిబంధనలు విమానాశ్రయం, దేశం, అమల్లో ఉన్న మినహాయింపులను బట్టి మారుతుంటాయి. కొత్తగా స్లాట్స్ పొందడం కష్టమైన విమానాశ్రయాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
33
విమానాలను నిర్వహణ కోసం..
విమానాలను ఖాళీగా నడపడానికి మరో కారణం విమానాల నిర్వహణ. ఒక నగరం నుంచి మరో నగరానికి విమానాన్ని తరలించాల్సి వచ్చినప్పుడు ప్రయాణికులు లేకుండానే నడుపుతారు. విమానాన్ని మరో ప్రాంతంలో అందుబాటులో ఉంచడం, పైలట్లు, సిబ్బందిని సరైన చోటుకు చేర్చడం, తదుపరి ప్రయాణానికి విమానాన్ని సిద్ధం చేయడం కోసం కూడా ఇలాంటి సర్వీసులు నడుస్తాయి. కొన్నిసార్లు ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నా నిర్ణీత షెడ్యూల్‌ను కొనసాగించాల్సి వస్తుంది. అయితే ఘోస్ట్ ఫ్లైట్స్ వల్ల ఇంధనం వృథా అవుతుంది. కార్బన్ ఉద్గారాలు పెరుగుతాయి. పర్యావరణానికి నష్టం కలుగుతుంది. అందుకే ప్రయాణికుల రద్దీని బట్టి విమాన సర్వీసులను సర్దుబాటు చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.