Railway Station: మనదేశంలో ఒక ప్రత్యేకమైన రైల్వేస్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి ప్రయాణం చేయాలంటే వీసా, పాస్ పోర్టు రెండూ చూపించాలి. లేకుంటే రైలు కూడా ఎక్కనివ్వరు. ఆ రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
భారతదేశంలో రైల్వే స్టేషన్‌లోకి వెళ్లడానికి సాధారణంగా ప్లాట్‌ఫారమ్ టికెట్ లేదా ప్రయాణ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ మన దేశంలో ఒక ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్లాలంటే కేవలం టికెట్ మాత్రమే కాకుండా పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే వీసా తప్పనిసరిగా ఉండాలి. అదే పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ జిల్లాలోని అట్టారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్. ఇది భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది. స్థానిక పౌరులు సైతం సరైన అనుమతి పత్రాలు లేకుండా ఈ స్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి అస్సలు వీలుండేది కాదు.
23
ఇదే చివరి స్టేషన్
ఈ నిబంధన వెనుక బలమైన కారణం ఉంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నడిచిన ప్రసిద్ధ సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇది మన దేశ సరిహద్దులోని చివరి స్టేషన్. ఢిల్లీ నుంచి లాహోర్ వెళ్లే ప్రయాణికులకు ఇక్కడే కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు జరిగేవి. ప్రయాణికులు పాకిస్తాన్ వెళ్లడానికి రైలు ఎక్కేముందు వారి వద్ద సరైన ప్రయాణ పత్రాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి అధికారులు ఈ కఠిన నిబంధన పెట్టారు. చెల్లుబాటు అయ్యే వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్కడ ఎవరైనా పట్టుబడితే ఫారినర్స్ చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపేంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉండేవి.
33
ఇప్పుడు రైల్వే సేవలు నిలిచిపోయాయి
ఈ స్టేషన్ ప్రాంగణం మొత్తం బీఎస్ఎఫ్ జవాన్లతో, కేంద్ర నిఘా విభాగాల నిరంతర నిఘా నీడలో ఉంటుంది. అయితే 2019 ఆగస్టులో పాక్, భారత్ దేశాల మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ఉద్రిక్తతల వల్ల సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు ఆగిపోయాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ రైలు ప్రయాణాలు ఇక్కడ నుంచి జరగడం లేదు. ఆ ప్రాంతం సరిహద్దు కావడంతో ఇప్పటికీ అక్కడ పటిష్టమైన భద్రత కొనసాగుతోంది. భారతీయ రైల్వే చరిత్రలో పాస్‌పోర్ట్, వీసా అవసరమైన ఏకైక స్టేషన్‌గా అట్టారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.