వానాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద మొదలవుతుంది. ఇళ్లలోకి, బండ్లలోకి వచ్చేస్తుంటాయి. అయితే పాములకు కొన్ని విషయాలంటే చాలా భయం. అవేంటో తెలుసుకుంటే, వాటి నుంచి మనల్ని మనం ఈజీగా కాపాడుకోవచ్చు.
వానాకాలం మొదలైందంటే చాలు... ఇంట్లో పాము దూరిందని, కారులో కనిపించిందని, బైక్‌లో చుట్టుకుందని... ఇలాంటి వార్తలు రోజూ వింటూనే ఉంటాం. పాములు కేవలం అడవుల్లోనే ఉంటాయని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వర్షాకాలంలో వరదలు, పుట్టల్లోకి నీళ్లు చేరడం, ఆహారం కోసం వెతుకులాట వంటి కారణాలతో పాములు బయటకు వస్తాయి. అవి ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ, కొత్త నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకే ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం పాములు వేటికి భయపడతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాములు ఏవో మొక్కలకో, ఇంటి చిట్కాలకో భయపడవు. మరి అవి దేనికి భయపడతాయో చూద్దాం.
25
పాములను భయపెట్టి తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..
గట్టి శబ్దాలు, ప్రకంపనలు :
నేలపై వచ్చే ప్రకంపనలను పాములు చాలా సులభంగా పసిగడతాయి. మనం గట్టిగా అడుగులు వేసినా, దగ్గర్లో ఏదైనా కదలిక ఉన్నా అవి వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి పారిపోతాయి. కాబట్టి పాములు ఉండే అవకాశాలున్న ప్రాంతాల్లో కర్రతో నేలను తట్టడం, గట్టిగట్టిగా అడుగులేయడం చేయాలి.
మనుషులన్నా పాములకు భయమే :
పాములు కూడా మనుషుల్ని చూసి భయపడతాయి. అందుకే ఊరికే దాడి చేయవు. వాటి ప్రాణానికి ప్రమాదం ఉందని భావించినప్పుడు లేదా వాటికి ఏదైనా హాని కలిగినప్పుడు మాత్రమే కాటు వేస్తాయి. కాబట్టి పాము కనిపించగానే కంగారుపడి దాడి చేయకండి... అది కాటేయడానికి వస్తేనే దాడి చేయండి.
వెలుతురన్నా పాములకు భయం
హఠాత్తుగా లైట్ వేస్తే పాములు బెదిరిపోతాయి. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, వాటి కళ్లు రాత్రిపూట చూసేందుకు అనువుగా ఉంటాయి. అందుకే ఎక్కువ కాంతి వాటి కళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి పాములను తరిమికొట్టేందుకు బ్యాటరీలు, వెలుతురు ఇచ్చే వస్తువులు వాడండి.
35
వాసనలకు పాములు పారిపోతాయా?
చాలా జంతువులు, కీటకాలు కొన్ని రకాల ఘాటైన వాసనలకు దూరంగా పారిపోతాయి. అందుకే చాలామంది ఫినాయిల్, కిరోసిన్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కర్పూరం వంటివి వాడితే పాములు రావనుకుంటారు. కానీ నిజానికి, ఈ వాసనల వల్ల పాములపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇలాంటి నాటు ప్రయోగాలు కాకుండా పాములను తరిమేందుకు కాస్త తెలివిగా వ్యవహరించాలి.
పరిశుభ్రత పాటించండి : వానాకాలంలో ఇల్లు, పరిసరాలు తేమగా, మురికిగా మారతాయి. ఇది కీటకాలకు నిలయంగా మారుతుంది. వాటిని తినడానికి పాములు రావచ్చు. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
ఎలుకలను తరిమేయండి : ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ పాములకు ఎలుకలంటే చాలా ఇష్టం. వాటిని వేటాడేందుకు ఇళ్లలోకి వస్తుంటాయి. అందుకే ముందుగా ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోండి.
ఇంటి చుట్టు గడ్డిని కత్తిరించండి : ఇంటి చుట్టూ గడ్డి లేదా పొదలు దట్టంగా ఉంటే పాములు దాక్కోవడానికి అవి సురక్షితమైన స్థలాలుగా మారతాయి. కాబట్టి గడ్డిని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి.
55
పాములను తరిమికొట్టే చిట్కాలు
తలుపులు, కిటికీల సందులు మూసేయండి : తలుపుల కింద ఉండే సందుల (Door gaps) ద్వారా పాములు సులభంగా లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి డోర్ స్వీప్స్ (Door Sweeps) లేదా రబ్బర్ పట్టీలను అమర్చండి. కిటికీలకు నెట్స్ (జాలీలు) వాడడం మంచిది.
డ్రైనేజీ, పైపుల రంధ్రాలు : బాత్రూమ్ డ్రైనేజీ రంధ్రాలు, సింక్ పైపుల వద్ద ఇనుప జాలీలను పెట్టండి. అలాగే గోడలకు ఏవైనా రంధ్రాలు లేదా పగుళ్లు ఉంటే వాటిని వెంటనే సిమెంట్‌తో పూడ్చేయండి.
రాత్రి వేళల్లో వెలుతురు ఉండేలా చూడండి : ఇంటి చుట్టూ, ముఖ్యంగా ప్రహరీ గోడ లోపల రాత్రి వేళల్లో లైట్లు వెలిగేలా చూసుకోండి. పాములు చీకటిని ఇష్టపడతాయి... కాబట్టి వెలుతురు ప్రాంతాల్లోకి రావు.
ఇంట్లో పాము కనిపిస్తు కంగారుపడిపోవద్దు… వెంటనే కుటుంబసభ్యులకు విషయం తెలియజేయండి. వారి సహాయంతో స్నేక్ క్యాచర్స్ లేదా పోలీసులకు సమాచారం అందించండి. పాములపై దాడి చేస్తే అవి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి.