
ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ vs RO వాటర్.. ఆరోగ్యానికి ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారు? ఇంట్లో తాగే నీటి విషయంలో చాలామందికి ఓ సందేహం ఉంటుంది. మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ వాటర్ తాగడం మంచిదా? లేక ఇంట్లో RO ప్యూరిఫైయర్ ఏర్పాటు చేసుకుని ఆ నీటిని తాగాలా? రెండూ శుభ్రమైన నీటినే అందిస్తున్నట్లు కనిపించినా.. వాటి శుద్ధి విధానం, ఖనిజాల పరిమాణం, నిర్వహణలో తేడాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఏ నీరు ఇవ్వాలి? RO నీటిలో ఖనిజాలు తగ్గిపోతాయా? బాటిల్ వాటర్ నిజంగానే ఎక్కువ సురక్షితమా? ఈ సందేహాలపై వైద్యులు, పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
మన శరీరానికి నీరు అత్యంత అవసరం. అయితే కలుషితమైన నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కలరా, విరేచనాలు, డయేరియా, డిసెంట్రీ, హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందవచ్చు. అందుకే తాగే నీరు శుభ్రంగా ఉండటంతో పాటు హానికరమైన సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి.
భారత్‌లో చాలా ప్రాంతాల్లో నీటి నాణ్యతపై సందేహాలు ఉండటంతో చాలామంది ఇళ్లలో RO ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై ఆధారపడుతున్నారు. అయితే ఏ నీరు తాగాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుగా మనకు సరఫరా అవుతున్న నీటి నాణ్యతను తెలుసుకోవడం ముఖ్యం.
RO ప్యూరిఫైయర్ వాటర్: రివర్స్ ఆస్మోసిస్ (RO) అనేది నీటిలోని కరిగిన మలినాలు, కొన్ని భారీ లోహాలు, ఇతర కలుషితాలను తొలగించేందుకు ఉపయోగించే శుద్ధి ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా తగ్గిపోవచ్చు. అందుకే కొన్ని RO ప్యూరిఫైయర్లలో మినరల్ రీమినరలైజేషన్ సదుపాయం ఉంటుంది.
ప్యాకేజ్డ్ వాటర్: వీటిని నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసి, బాటిళ్లలో నింపి విక్రయిస్తారు. అయితే మార్కెట్లో లభించే ప్రతి బాటిల్ వాటర్ సహజమైన మినరల్ వాటర్ కాదు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, నేచురల్ మినరల్ వాటర్ రెండూ వేర్వేరు కేటగిరీలు. సహజమైన మినరల్ వాటర్‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సహజంగా ఉంటాయి.
ప్యాకేజ్డ్ వాటర్ అయినా, RO ప్యూరిఫై చేసిన నీరైనా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే తాగడానికి సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే నీటి మూలం, శుద్ధి చేసే విధానం, నిల్వ చేసే పద్ధతి కూడా చాలా ముఖ్యం. కలుషితమైన నీటిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ముఖ్యంగా డయేరియా, ఇతర పేగు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అందువల్ల ఏ రకమైన నీరు తాగుతున్నామనే దానికంటే అది సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా ఉందా? నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా? అనేదే ముఖ్యమని ఆయన వివరిస్తున్నారు.
RO ప్యూరిఫైయర్లతో నీటిలోని అనేక కరిగిన మలినాలను తొలగించవచ్చు. అయితే ఇదే సమయంలో సహజంగా ఉండే కొన్ని ఖనిజాల పరిమాణం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్యాకేజ్డ్ వాటర్‌లో ఖనిజాల పరిమాణం దాని రకాన్ని బట్టి మారుతుంది. సహజ మినరల్ వాటర్‌లో ఉండే ఖనిజాలు, సాధారణంగా శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో ఉండే ఖనిజాలు ఒకేలా ఉండవు. అందుకే బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను పరిశీలించడం అవసరం.
పిల్లలకు నీరు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. RO వాటర్ అయినా, ప్యాకేజ్డ్ వాటర్ అయినా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఉపయోగించవచ్చని ఫరీదాబాద్‌లోని సర్వోదయ హాస్పిటల్ పీడియాట్రిక్స్ డైరెక్టర్ డాక్టర్ సుశీల్ సింగ్లా చెబుతున్నారు. అయితే ప్రతి బాటిల్ వాటర్‌ను మినరల్ వాటర్‌గా భావించకూడదని ఆయన సూచిస్తున్నారు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, నేచురల్ మినరల్ వాటర్ మధ్య తేడా తెలుసుకోవాలి. బాటిల్ కొనేటప్పుడు దాని సీల్ సరిగ్గా ఉందో లేదో చూడాలి. తయారీ తేదీ, నాణ్యతకు సంబంధించిన వివరాలను పరిశీలించాలి. ఎండలో లేదా అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాల్లో బాటిళ్లను నిల్వ చేయకూడదు.
ఇంట్లో RO ప్యూరిఫైయర్ ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన నీరు ఎప్పుడూ సురక్షితంగా ఉంటుందని అనుకోకూడదు. దాని నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఫిల్టర్లను మార్చాలి.ప్యూరిఫైయర్‌లోని ఫిల్టర్లను తయారీ సంస్థ సూచించిన గడువు ప్రకారం మార్చాలి. సర్వీసింగ్ చేయించాలి. RO పరికరాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయించి, సరిగా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. నీటి నాణ్యత పరీక్షించాలి. ఇంటికి వచ్చే నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. ముఖ్యంగా TDSతో పాటు అవసరమైన ఇతర కలుషితాల స్థాయులను కూడా తెలుసుకోవాలి. మినరల్స్‌పై దృష్టి పెట్టాలి. శుద్ధి తర్వాత నీటిలో ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటే, నీటి నాణ్యతను పరిశీలించిన తర్వాత అవసరమైతే రీమినరలైజేషన్ పద్ధతిని ఎంచుకోవచ్చు.
మరి RO వాటర్ మంచిదా? బాటిల్ వాటర్ మంచిదా? రోజువారీ అవసరాల కోసం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్యూరిఫైయర్ ఉపయోగించడం బెటర్. అయితే ప్రతి ఇంటికీ RO ప్యూరిఫైయర్ అవసరం లేదు. మున్సిపల్ నీటి సరఫరా ఇప్పటికే సురక్షితంగా ఉండి, TDS స్థాయులు కూడా అనుకూలంగా ఉంటే సాధారణ ఫిల్ట్రేషన్ విధానం సరిపోతుంది.