Indian Currency: ఇప్పుడున్న కరెన్సీ నోట్లు చిరిగిపోవడమో, నలిగిపోవడమో జరుగుతాయి. ఒక్కోసారి పిల్లలు తెలియక చింపేస్తారు కూడా. ఒక్క ఏడాది ఆగితే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తాయి. అప్పుడు చిరిగిపోతాయన్న టెన్షనే ఉండదు.
ప్రస్తుతం మనం వాడే కరెన్సీ నోట్లు మందపాటి కాగితంతో తయారుచేసివి. కానీ పిల్లలు చింపినా చిరిగిపోతాయి. ఈ సమస్య లేకుండా కాగితపు కరెన్సీ స్థానంలో ఇకపై అత్యంత మన్నికైన 'ప్లాస్టిక్ కరెన్సీ'ని అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తోంది. సాధారణంగా మనం ఉపయోగించే కాగితపు నోట్లు నీటిలో తడిసినా, తరచూ చేతులు మారడం వల్ల నలిగిపోయినా లేదా కొద్ది రోజులకే చిరిగిపోయి చెల్లకుండా పోయేవి. దీనివల్ల ఆర్బీఐ ప్రతి ఏటా భారీగా పాత నోట్లను రద్దు చేస్తూ కొత్త కాగితపు నోట్లను ముద్రించాల్సి వచ్చేది. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, నీటిలో తడిసినా నానని, ఎంత వాడినా సులభంగా చిరిగిపోని పాలిమర్ షీట్లతో నోట్లను తయారు చేసేందుకు ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి వస్తే నోట్లు త్వరగా పాడైపోతాయనే భయం ప్రజలకు పూర్తిగా తొలగిపోనుంది.
23
ప్రయోగం మొదలైపోయింది
ప్లాస్టిక్ నోట్ల ఉత్పత్తికి కావలసిన నాణ్యమైన పాలిమర్ షీట్లను సరఫరా చేయడానికి ఆర్బీఐ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ప్రారంభంలో రెండు వేర్వేరు డినామినేషన్ల నోట్ల కోసం మొత్తం 68,000 రీముల పాలిమర్ షీట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, 2027 నాటికి పూర్తి స్థాయిలో ఈ ప్లాస్టిక్ నోట్లను దేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నోట్ల తయారీ విషయంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆర్బీఐ కఠినమైన నిబంధనలను విధించింది. ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నుండి భద్రతా అనుమతి పొందడంతో పాటు, చైనా లేదా పాకిస్తాన్ దేశాలతో ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉండకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, భారత్ కోసం రూపొందించే ప్రత్యేక పాలిమర్ షీట్లను వేరే ఏ ఇతర మూడో దేశానికి విక్రయించకూడదనే నిబంధనను కూడా పెట్టింది.
33
ప్లాస్టిక్ నోట్ల వల్ల లాభాలు
ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు మార్కెట్లోకి రావడం వల్ల సాధారణ పౌరులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఇవి నీటిని పీల్చుకోవు కాబట్టి మురికి కావడం, తడిసిపోవడం లేదా చిరిగిపోవడం జరగదు. ఫలితంగా ఒక్కో నోటు ఆయుష్షు సాధారణ కాగితపు నోటు కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలిమర్ నోట్లపై అత్యంత సంక్లిష్టమైన, అధునాతనమైన సెక్యూరిటీ ఫీచర్లను అమర్చడం సాధ్యమవుతుంది కాబట్టి నకిలీ నోట్ల చలామణిని దాదాపు పూర్తిగా అరికట్టవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి చూస్తే, పదే పదే కొత్త నోట్లను ముద్రించాల్సిన అవసరం తగ్గడం వల్ల కరెన్సీ ముద్రణ, రవాణా ఖర్చులు భారీగా ఆదా అవుతాయి. అంతర్జాతీయంగా ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ ప్లాస్టిక్ కరెన్సీ వ్యవస్థ, త్వరలోనే మన భారతదేశంలో కూడా అందుబాటులోకి రానుండటం విశేషం.