లాంగ్‌ఇయర్‌బైన్ గ్రామం నిత్య మంచుతో నిండి ఉంటుంది. నేల ఎప్పుడూ గడ్డకట్టే ఉంటుంది. దీన్నే 'పెర్మాఫ్రాస్ట్' అంటారు. అంటే ఇక్కడి మట్టి ఏడాది పొడవునా జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంటుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఊరి చివర ఉన్న స్మశాన వాటికలో ఖననం చేసేవారు. కానీ 1950ల్లో ఇక్కడి స్మశానవాటికలో పరిశోధనలు చేసిన సైంటిస్టులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్నో ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాలు ఏమాత్రం కుళ్లిపోకుండా, చర్మం, జుట్టు కూడా అలాగే ఉండటాన్ని వాళ్లు గమనించారు.
1918లో లక్షలాది మందిని బలితీసుకున్న 'స్పానిష్ ఫ్లూ' (Spanish Flu)తో చనిపోయిన వారిని ఇక్కడే పూడ్చిపెట్టారు. ఆ బాడీలను పరిశీలిస్తే, ఆ ప్రమాదకరమైన వైరస్‌లు ఇంకా బతికే ఉన్నాయని తేలింది.
మంచు కారణంగా మృతదేహాలు పైకి రావడం, వాటిలోని ప్రాచీన వైరస్‌లు మళ్లీ వ్యాపిస్తే ప్రపంచానికి ముప్పు అని గ్రహించారు. అందుకే 1950 నుంచి ఇక్కడ మృతదేహాలను పూడ్చిపెట్టడంపై అధికారికంగా నిషేధం విధించారు.