America: అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది.ట్రంప్ పాలనతో భారతీయులకు అక్కడ కష్టకాలం నడుస్తోంది. కంపెనీల్లో లేఆఫ్స్ కారణంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీంతో తిరిగి స్వదేశానికి తిరిగి వస్తున్నారు.
అమెరికాలో స్థిరపడి మంచి భవిష్యత్తును అందుకోవాలని ఎంతోమంది భారతీయులు కలలు కన్నారు. అయితే అక్కడ ఐటీ కంపెనీల్లో ఆగకుండా సాగుతున్న లే-ఆఫ్స్ కారణంగా వేలాది మంది భారతీయ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు కొత్త జాబ్ సంపాదించడం తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు స్థానికులు విదేశీయులపై వ్యతిరేకత పెంచుకోవడం, ప్రభుత్వం వలస నిబంధనలను మరింత కఠినంగా మార్చడం వల్ల అక్కడి భారతీయుల్లో ఆందోళన పెరిగింది. H-1B వీసా నిబంధనలు మారండం, I-140 పిటిషన్లు పెద్ద ఎత్తున తిరస్కరణకు గురికావడంతో అక్కడ చట్టబద్ధంగా ఉండే దారులు మూసుకుపోతున్నాయి.
23
అద్దెలు కట్టలేక..
ఒకప్పుడు చేతినిండా లక్షల డాలర్ల జీతాలు అందుకున్న నిపుణులు ఇప్పుడు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. చేతిలో ఉద్యోగం లేక, నెలకు వేల డాలర్ల అద్దెలు కట్టలేక దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. లీజు గడువులు మిగిలి ఉన్నా, కార్లను కనీసం అమ్ముకునే అవకాశం కూడా లేక స్క్రాప్యార్డుల్లో వదిలేసి, విలువైన సామగ్రిని పారేసి రాత్రికి రాత్రే భారత్కు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. గతంలో తక్కువ వడ్డీలకు ఆశపడి ఇళ్లు కొన్నవారికి ఇప్పుడు వడ్డీ రేట్లు 4 శాతం నుంచి ఏకంగా 7.5 శాతానికి పెరిగిపోవడం పెనుభారంగా మారింది. ద్రవ్యోల్బణం, లోన్ ఈఎంఐల దెబ్బకు ఇళ్లు అమ్ముడుపోక చాలామంది రోడ్డున పడే దుస్థితి వచ్చింది. ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ అందుకున్నవారు సైతం హైదరాబాద్ వంటి నగరాల్లో రూ. 35 లక్షల జీతానికే సంతృప్తి పడుతున్నారు.
33
పాపం చదువుల కోసం వెళ్లి
ఇక ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వేలకు వేలు డాలర్ల ఫీజులు చెల్లించి డిగ్రీలు పూర్తి చేసినా క్యాంపస్లలో ఉద్యోగాలు దక్కడం లేదు. చేసిన అప్పులు తీర్చడానికి, కనీస ఖర్చుల కోసం పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లలో చిరుద్యోగాలు, డెలివరీ బాయ్స్గా మారుతున్నారు. ఈ పరిస్థితులన్నీ 2008 నాటి ఆర్థిక మాంద్యాన్ని గుర్తుచేస్తున్నాయని అక్కడి భారతీయులు చెబుతున్నారు. డాలర్ల కలలతో విమానం ఎక్కిన భారతీయులు ఇప్పుడు స్వదేశానికి తిరిగి వస్తుండటంతో, కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోతోంది.