Slowest Train : గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్న కాలంలో 46 కి.మీ దూరం ఏకంగా 5 గంటలు ప్రయాణించే రైలు కూడా ఉంది. భారతదేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఇదే.
Indias slowest train : ప్రపంచం వేగంగా పరుగెడుతోంది... ప్రతిఒక్కరూ కాలంతో పాటే పరుగు తీస్తున్నారు. అభివృద్ధికి వేగమే గీటురాయిగా మారింది... జెట్ స్పీడ్ విమానాలు, బుల్లెట్ ట్రైన్స్, వేగంగా దూసుకెళ్లే వాహనాలకు అందుకే డిమాండ్ పెరిగింది. భారతదేశం కూడా గంటలో 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వందే భారత్, మెట్రో వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే అన్నిసార్లు వేగమే కాదు కొన్నిసార్లు నెమ్మది కూడా ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ ట్రైన్స్ గురించి తెగ చర్చ జరుగుతున్న వేళ నెమ్మదిగా నడిచే ట్రైన్ గురించి తెలుసుకుందాం.
25
నీలగిరి మౌంటెన్ రైల్వే
ఈ బిజీ ప్రపంచంలో పరుగుపందెం సాగిస్తున్నవారు కొన్నిసార్లు జీవితాన్ని ఆస్వాదించడానికి స్లో అవుతారు. ఇలాంటి సమయంలో టైమ్ కూడా బాగా స్లోగా గడిచిపోవాలని కోరుకుంటారు. తమిళనాడులోని నీలగిరి మౌంటెన్ రైల్వేలో ప్రయాణం ఇలాంటి అనుభూతినే ఇస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ రైలు ప్రయాణం టైమ్ ఆగిపోయిందా అన్నట్లుగా ఉంటుంది.
మెట్టుపాలయం-ఊటీ ప్యాసింజర్ ట్రైన్ ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే సగటున 9 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందన్నమాట. అందుకే దీన్ని సరదాగా టాయ్ ట్రైన్ అనికూడా పిలుస్తారు. కొన్నిచోట్ల ఈ రైలు సైకిల్ కంటే స్లో అవుతుంది. ఊటీ అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తూ ఈ రైలు కొండలు, అడవులు, జతపాతాలు, తేయాకు తోటలను దాటుకుంటూ స్లోగా ముందుకు సాగుతుంది.
35
మెట్టుపాలయం-ఊటీ ప్రయాణం...
తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీ.. దీన్ని సందర్శించేందుకు నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఇప్పుడు కాదు... వందేళ్ళ క్రితమే పర్యాటక అభివృద్ధి జరిగింది. బ్రిటీష్ పాలనలో 1908 లో నీలగిరి మౌంటెన్ రైల్వే వ్యవస్థ ఏర్పాటయ్యింది.
ఈ మెట్టుపాలయం-ఊటీ ప్యాసింజర్ రైలు 16 టన్నెల్స్, 250 బ్రిడ్జెస్, 208 ములుపులను దాటుకుంటూ ప్రయాణిస్తుంది. ఇది కూనూరు, వెల్లింగ్టన్, లవ్ డేల్, ఫేర్న్ హిల్ వంటి హిల్ స్టేషన్లను కూడా కవర్ చేస్తుంది. మెట్టుపాలయం (326 మీటర్ల) నుండి ఊటీ (2203 మీటర్ల) వరకు ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఇలా ఎత్తైన కొండప్రాంతాల్లో ప్రయాణానికి అనుకూలంగా ఈ రైలు ఆకాలంలో ఏర్పాటుచేశారు.
ఊటీని సందర్శించేందుకు వెళ్లేవారు ఈ స్పెషల్ రైలులో తప్పకుండా ప్రయాణిస్తారు… జీవితంలో గుర్తుండిపోయే అనుభూతిని పొందుతారు. దేశంలోనే అత్యంత స్లోగా ప్రయాణించే ఈ రైళ్లో కూర్చుని అందాలను ఆస్వాదిస్తారు. అయితే ఊటీ సందర్శించేందుకు సమ్మర్ పర్ఫెక్ట్ టైమ్... ఏప్రిల్-జూన్ మధ్య ఊటీలో వాతావరణం ఆహ్లాదరకంగా ఉంటుంది. వర్షాలు, పొగమంచు పరిస్థితులు ఉండవు కాబట్టి ప్రకృతి అందాలను కనువిందు చేస్తాయి.
55
నీలగిరి మౌంటెన్ రైల్వేకు UNESCO గుర్తింపు
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నీలగిరి మౌంటెన్ రైల్వే UNESCO (యునెస్కో) వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపుపొందింది. భారతదేశంలో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్క-షిమ్లా రైల్వే కూడా ఇలాగే యునెస్కో గుర్తింపుపొందాయి.