
పల్లీలు పోషకాలతో కూడిన ఆహారం కావడంతో చాలామంది వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. నూనెల తయారీకి పల్లీలను ఎక్కువగా ఉపయోగిస్తారు... అలాగే చట్నీలు, స్నాక్స్ రూపంలోనూ వీటిని తీసుకుంటారు.
అయితే ఇలా మనం రోజూ తినే పల్లీలు వేరుశనగ పంటనుండి వస్తాయి. మరి మార్కెట్లో కిలో వేరుశనగ కాయలు కొనుగోలు చేస్తే అందులో అసలు ఎన్ని పల్లీలు వస్తాయి? పొట్టు తీసేసిన తర్వాత ఎంత బరువు గింజలు మిగులుతాయి? అదే కేజీ పల్లీల నుండి ఎంత నూనె వస్తుంది? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనం మార్కెట్లో కొనుగోలు చేసే వేరుశనగ (పల్లీకాయల్లో) బయట గట్టి పొట్టు ఉంటుంది. ఆ పొట్టును తొలగిస్తే లోపల పల్లీ గింజలు కనిపిస్తాయి. అయితే కిలో వేరుశనక్కాయలు కొనుగోలు చేసినప్పుడు మొత్తం కిలో బరువు పల్లీలదే కాదు. అందులో కొంత బరువు పొట్టుకు కూడా ఉంటుంది.
సాధారణంగా ఒక కిలో ఎండిన వేరుశనగల నుంచి సుమారు 680 గ్రాముల నుంచి 750 గ్రాముల వరకు పల్లీ గింజలు లభిస్తాయి. మిగిలిన 250 నుంచి 320 గ్రాముల వరకు పొట్టు ఉంటుంది. అయితే పల్లీల రకం, కాయల పరిమాణం, వాటిలోని తేమ వంటి అంశాలను బట్టి ఈ లెక్కల్లో కొంత మార్పు ఉంటుంది. అంటే కిలో పల్లీకాయలు కొనుగోలు చేస్తే సుమారు మూడొంతుల బరువు పల్లీలుగా, మిగిలినది పొట్టుగా వస్తుందని చెప్పవచ్చు.
ఎండిన వేరుశనగలు, పచ్చి పల్లీకాయలకు దిగుబడిలో తేడా ఉంటుంది. పచ్చి పల్లీల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వాటి బరువు అధికంగా ఉంటుంది. పొట్టు తీసిన తర్వాత గింజల బరువు కూడా ఎండిన పల్లీలతో పోలిస్తే తక్కువగా ఉండొచ్చు. సాధారణంగా ఒక కిలో పచ్చి పల్లీకాయల నుంచి సుమారు 500 నుంచి 600 గ్రాముల వరకు పల్లీ గింజలు వచ్చే అవకాశం ఉంటుంది.
పల్లీలతో నూనె తయారు చేయడం మన దగ్గర చాలాకాలంగా ఉన్న పద్ధతి. చెక్క గానుగల నుంచి ఆధునిక ఆయిల్ మిల్లుల వరకు వేరుశెనగ నూనె తయారీకి అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే నూనె దిగుబడి పల్లీల నాణ్యతతో పాటు నూనె తీసే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా ఒక కిలో పల్లీ గింజల నుంచి సుమారు 350 నుంచి 450 మిల్లీలీటర్ల వరకు నూనె లభించవచ్చు. సగటున 400 మిల్లీలీటర్ల దిగుబడిని లెక్కలోకి తీసుకుంటే, ఒక లీటర్ పల్లీ నూనె తయారు చేయడానికి సుమారు 2.5 కిలోల పల్లీ గింజలు అవసరమవుతాయి. పల్లీల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటే దిగుబడి పెరుగుతుంది. తక్కువ నాణ్యత గల గింజలు లేదా తేమ ఎక్కువగా ఉన్న పల్లీల నుంచి నూనె తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
పల్లీల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలే పదార్థాన్ని పల్లి చెక్క అంటారు. ఇందులో కొంత నూనెతో పాటు ప్రోటీన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. అందుకే దీనిని పశువుల దాణా తయారీలో ఉపయోగిస్తుంటారు. వ్యవసాయంలో కొన్ని సందర్భాల్లో సేంద్రియ ఎరువుల తయారీకి కూడా వినియోగిస్తారు.
నూనె తీసే పద్ధతిని బట్టి పల్లి చెక్క పరిమాణం మారుతుంది. సాధారణంగా ఒక కిలో పల్లీ గింజల నుంచి నూనె తీసిన తర్వాత సుమారు 550 నుంచి 600 గ్రాముల వరకు పల్లి చెక్క మిగిలే అవకాశం ఉంటుంది. మిగిలిన బరువులో తేమ, ఇతర పదార్థాలు కూడా ప్రభావం చూపుతాయి.