కొమ్మలపై స్వయంగా మట్టికుండ చేసి.. అందులో బిడ్డను పెంచే జీవి ఏది?

Arun Kumar P   | ANI
Published : Nov 13, 2026, 10:39 AM IST

ఓ తల్లి బిడ్డను సురక్షితంగా పెంచేందుకు మట్టితో పటిష్ఠమైన గూడు నిర్మించుకుని ఇంజనీర్ గా మారుతుంది, బిడ్డ అహారం కోసం ఓ పురుగుకు మత్తుమందు ఇంచి అనస్తీషియన్ గా మారుతుంది. ఇంతకీ ఆ జీవి ఏదో తెలుసా?

PREV
13
మట్టితో గూడుకట్టే కీటకం ఏది?

మనుషులు సురక్షితంగా నివసించేందుకు ఇల్లు కట్టుకున్నట్లే జంతువులు, పక్షులు కూడా వివిధ రకాల అవాసాలను ఏర్పాటుచేసుకుంటాయి. పులులు, సింహాలు వంటి పెద్దపెద్ద అడవి జంతువులు ప్రకృతి నిర్మించిన గుహలు వంటివాటితో జీవిస్తాయి. పక్షులు కూడా ఇలా సహజంగా ఏర్పడిన చెట్ల రంధ్రాలు, దట్టమైన కొమ్మల్లో నివాసముంటాయి. కానీ కొన్నిరకాల పక్షులు, పురుగులు మాత్రం మనిషి మాదిరిగానే సొంతంగా నివాసాలను ఏర్పాటుచేసుకుంటాయి... కాకలుతీరిని ఇంజనీర్లనే ఆశ్చర్యపర్చేలా వీటి గూళ్ళ నిర్మాణం ఉంటుంది.

అయితే చిన్నచిన్న కర్రలు, గడ్డి, ఆకులతో గూడు నిర్మించుకునే జీవులు చాలా ఉన్నాయి. కానీ మట్టితో గూడు నిర్మించుకునేవి చాలా అరుదుగా కనిపిస్తాయి... ఇందులోనూ కేవలం బిడ్డల పెంపకం కోసం ఇళ్లుకట్టేవి మరింత అరుదు. ఇలా చెట్ల కొమ్మలపై మట్టికుండను నిర్మించి అందులో బిడ్డను పెట్టి పెంచే ఓ అరుదైన కందిరీగ జాతి ఉంది. ఇది బిడ్డను పెంచేతీరు చాలా విచిత్రంగా ఉంటుంది... దానిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

23
కందిరీగ మట్టితో గూడు ఎలా కడుతుంది?

కందిరీగల్లో చాలా రకాలు ఉంటాయి... కొన్ని కాగితంలాంటి పల్చని పదార్థంతో గూడు కట్టుకుంటే మరికొన్ని మట్టితో కట్టుకుంటాయి. ఇలా మట్టితో గూడుకట్టేవి తాము నివాసం ఉండేందుకు కాకుండా పిల్లలను పెంచేందుకు కడుతుంటాయి. ఇలాంటి కందిరీగలు పిల్లలను పెంచే విధానం ఆసక్తికరంగా ఉంటుంది.

గుడ్డు పెట్టడానికి ముందు తడిమట్టిని తెచ్చి చెట్లకొమ్మలపై కందిరీగ గూడు కడుతుంది. తడిమట్టికి ప్రత్యేకమైన తన లాలాజలాన్ని చేర్చి మెత్తగా చేస్తుంది... దీంతో చెట్ల కొమ్మలపై చిన్న కుండ మారిదిగా ఓ గూడు కట్టుకుంటుంది. ఇది కొమ్మకు గట్టిగా అతుక్కుని ఉంటుంది... వర్షంలోనూ ఆ మట్టి కరగకుండా ఉంటుంది. ఇలా మట్టితోనే చాలా దృఢమైన నిర్మాణాన్ని ఏర్పాటుచేసుకుంటుంది.

33
మట్టికుండలో బిడ్డను ఎలా పెంచుతుంది?

మట్టితో కట్టిన నిర్మాణంలో కందిరీగ గుడ్లు పెడుతుంది. అనంతరం ప్రాణంతో ఉన్న ఓ గొంగళి పురుగును ఆ గూడులో పెట్టి మట్టితో దాన్ని పూర్తిగా మూసేస్తుంది. కొంతకాలానికి ఆ గుడ్డులోంచి లార్వా బయటకు వచ్చి గొంగళి పురుగును తింటూ పెరుగుతుంది. ఇలా మట్టి గూడులోనే పూర్తిగా ఎదిగిన కందిరీగ దాన్ని బద్దలుగొట్టి బయటకు వస్తుంది.

ఇలా మట్టికుండలోనే కందిరీగ పెరుగుతుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే గొంగళి పురుగును చంపి గూడులో వేస్తే అది పాడయ్యే అవకాశం ఉంటుంది... దీంతో అహారం లేక అందులోని పిల్ల కందిరీగ చనిపోతుంది. అందుకే తల్లి కందిరీగ ప్రత్యేకమైన మత్తు పదార్థంతో గొంగళిపురుగు స్పృహ కొల్పోయేలా చేసి గూడులో పెడుతుంది... అందుకే అది పాడవకుండా ఉంటుంది, బిడ్డ కందిరీగకు అహారంగా ఉపయోగపడుతుంది.

ఇలా కందిరీగ పిల్లల పెంపకం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్వయంగా మట్టితో కుండను నిర్మించి సహజసిద్దమైన ఇంజనీర్ గా మారుతుంది.. బిడ్డకు అహారం అందించేందుకు బ్రతికున్న పురుగుకు మత్తుమందు ఇచ్చి డాక్టర్ పట్టాలేని ఎనస్తీషియన్ గా మారుతుంది. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరు అనే ఓ సినిమా డైలాగ్ కు కందిరీగ పిల్లల పెంపకం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories