ప్రపంచంలో దోమలు లేని ఒకే ఒక దేశం ఏదో తెలుసా.? అసలు కారణం ఏంటంటే?

Published : Nov 05, 2026, 03:52 PM IST

Mosquito Free Country: ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో దోమల సమస్య ఉంటుంది. చిన్నవిగా కనిపించే ఈ కీటకాలు మనుషులకు నిద్రలేకుండా చేయడమే కాకుండా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. అయితే ఒక్క దేశంలో మాత్రం దోమ‌లు లేవ‌ని తెలుసా?

PREV
15
ప్రపంచంలో దోమలు లేని దేశం ఐస్‌లాండ్

ప్రపంచంలోని చాలా దేశాల్లో దోమలు కనిపిస్తాయి. నార్వే, స్కాట్లాండ్, గ్రీన్‌లాండ్ వంటి చల్లని ప్రాంతాల్లో కూడా దోమలు ఉన్నాయి. కానీ ఐస్‌లాండ్ మాత్రం ఇప్పటివరకు దోమలు లేని దేశంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అంటార్కిటికాలో కూడా దోమలు ఉండవు. అయితే అది ఒక ఖండం మాత్రమే. దేశాల విషయానికి వస్తే ఐస్‌లాండ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆ దేశ భౌగోళిక పరిస్థితులు, అక్కడి వాతావరణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్‌లాండ్ చుట్టూ చల్లని సముద్రపు నీరు ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దోమలు సహజంగా అక్కడికి చేరుకోవడం కష్టంగా మారుతోంది. అయితే దోమలు అసలు అక్కడికి వెళ్లలేదని చెప్పలేం. గతంలో ఐస్‌లాండ్‌కు సమీపంలోని గ్రీన్‌లాండ్ నుంచి రేక్యావిక్ మధ్య ప్రయాణిస్తున్న ఒక దోమను శాస్త్రవేత్తలు గుర్తించారు.

25
ఐస్‌లాండ్‌లో దోమలు బతకలేకపోవడానికి అసలు కారణం ఇదే!

ఐస్‌లాండ్‌లో దోమలు గుడ్లు పెట్టడానికి అనువైన నీటి వనరులు లేవని అనుకుంటే పొరపాటే. అక్కడ సరస్సులు, చెరువులు, తడి నేలలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా విమానాశ్రయాల పరిసరాల్లో కూడా నీరు నిలిచే ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ దోమలు అక్కడ సంతానోత్పత్తి చేయలేకపోతున్నాయి.

దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణంలో తరచూ చోటుచేసుకునే గడ్డకట్టడం, తిరిగి కరగడం అనే ప్రక్రియ. సాధారణంగా దోమలు నీటిలో గుడ్లు పెడతాయి. వాటి నుంచి లార్వాలు ఏర్పడి, క్రమంగా పెద్ద దోమలుగా మారతాయి. ఈ అభివృద్ధి జరగడానికి కొంతకాలం పాటు నీరు ద్రవరూపంలో ఉండాలి. కానీ ఐస్‌లాండ్‌లో వసంతకాలం, శరదృతువు సమయంలో ఉష్ణోగ్రతలు తరచూ మారుతుంటాయి. ఒకసారి నీరు గడ్డకడితే, కొద్దిసేపటికి తిరిగి కరుగుతుంది. మళ్లీ చల్లబడితే గడ్డకడుతుంది. ఇలా పదేపదే జరిగే ప్రక్రియ వల్ల దోమల గుడ్లు, లార్వాలు అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులు ఉండవు. ఫలితంగా అవి పెద్ద దోమలుగా మారకముందే చనిపోతాయి.

35
వేడినీటి కొలనుల్లో కూడా దోమలు ఎందుకు ఉండవు?

ఐస్‌లాండ్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే అక్కడ సహజంగా వేడినీరు వచ్చే ప్రాంతాలు చాలా ఉన్నాయి. భూగర్భంలో ఉండే వేడి కారణంగా కొన్ని కొలనుల్లో ఏడాది పొడవునా వేడినీరు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లోనైనా దోమలు పెరిగే అవకాశం ఉంటుందని అనిపించవచ్చు. కానీ అక్కడి పరిస్థితులు కూడా దోమలకు అనుకూలంగా లేవని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వేడినీటి ఉష్ణోగ్రతలు దోమల లార్వాలు బతకడానికి అవసరమైన స్థాయికి మించి ఉండవచ్చు. అంతేకాకుండా ఆ నీటిలో ఉండే ఖనిజాలు, ఇతర రసాయన లక్షణాలు కూడా దోమల అభివృద్ధికి అనుకూలంగా ఉండవు. అంటే ఐస్‌లాండ్‌లో సాధారణ నీటి వనరుల్లో చలి సమస్యగా ఉంటే, వేడినీటి కొలనుల్లో అధిక ఉష్ణోగ్రతలు మరో అడ్డంకిగా మారుతున్నాయి. ఇలా అక్కడి ప్రకృతి పరిస్థితులే దోమల పెరుగుదలను అడ్డుకుంటున్నాయి.

45
వాతావరణ మార్పులతో ఐస్‌లాండ్‌లోకి దోమలు వచ్చే అవకాశం!

ప్రస్తుతం ఐస్‌లాండ్‌లో దోమలు లేకపోయినా భవిష్యత్తులో ఈ పరిస్థితి మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. భూమి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఐస్‌లాండ్‌లో కూడా చలికాల తీవ్రత తగ్గి, వసంతకాలం, శరదృతువులో ఉష్ణోగ్రతలు కొంత పెరిగితే దోమలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా నీరు ఎక్కువకాలం గడ్డకట్టకుండా ఉంటే దోమల గుడ్లు, లార్వాలు అభివృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగితే అక్కడ దోమల సంతతి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గతంలో హవాయి దీవులు కూడా దోమలు లేని ప్రాంతాలుగా ఉండేవి. 1826లో నౌకల ద్వారా అక్కడికి దోమలు చేరుకున్నాయి. ఆ తర్వాత అక్కడ వాటి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా గతంలో దోమలు జీవించలేని ఎత్తైన పర్వత ప్రాంతాల్లోకి కూడా అవి విస్తరిస్తున్నాయి. అమెరికాలోనూ చలికాలాలు వెచ్చగా మారడంతో ఉష్ణమండల దోమలు ఉత్తర ప్రాంతాల వైపు విస్తరిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

55
ఐస్‌లాండ్‌లోకి దోమలు వచ్చినా ప్రమాదకరమైనవేనా?

ఒకవేళ భవిష్యత్తులో ఐస్‌లాండ్‌లో దోమలు కనిపించినా, అన్ని రకాల దోమలు అక్కడ మనుగడ సాగించలేవని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే ఏడిస్ (Aedes) జాతి దోమలకు వెచ్చని లేదా ఉష్ణమండల వాతావరణం అవసరం. ఐస్‌లాండ్‌లో ఉండే చల్లని పరిస్థితుల్లో అవి ఎక్కువకాలం జీవించడం కష్టమే. ప్రస్తుతం దక్షిణ ఐరోపాలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల కేసులు పెరుగుతున్నప్పటికీ, ఉత్తర ఐరోపాలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 2080 నాటికి కూడా డెంగ్యూ వ్యాప్తికి ఉత్తర ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉండకపోవచ్చని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories