Mutton : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రుచిగా ఉండే మేకమాంసం ఎక్కడ లభిస్తుంది? ఈ మటన్ ఎందుకింత ప్రత్యేకం?

Published : Nov 05, 2026, 03:19 PM IST

ఆదివారం వచ్చిందంటే చాలు తెలుగు వంటిళ్లలో ముక్క ఉడకాల్సిందే. ఇక తెలంగాణలో అయితే శుభకార్యమైనా, అశుభకార్యమైనా యాట కోయాల్సిందే, మటన్ తో విందు చేయాల్సిందే. మరి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రుచిగా ఉండే మేకమాంసం ఏదో తెలుసా?

PREV
14
ఈ మటన్ కు ఎందుకంత రుచి?

ఒక్కో ప్రాంతంలో లభించే జంతువుల మాంసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణలోనే చూస్తే నిజామాబాద్ జిల్లా అంకాపూర్ లో లభించే నాటుకోడి మాంసం చాలా రుచిగా ఉంటుంది... అందుకే ఈ చికెన్ కు మంచి డిమాండ్ ఉంది. మటన్ విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన మేకల మాంసం రుచిగా ఉంటుందని చెబుతారు... అందుకే శుభకార్యాలు, పండగల సమయంలో చాలామంది దేవరకొండ మేకలను కొనేందుకు ఇష్టపడతారు.

అయితే దేవరకొండలో లభించే మేకలు ఎందుకింత ప్రత్యేకం? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. మరి ఇక్కడి మేకలు ఎలాంటి ఆహారం తీసుకుంటాయి? ఇక్కడ ఏ రకమైన మేకలను పెంచుతారు? వాటి మాంసానికి ప్రత్యేక రుచి రావడానికి కారణాలేంటి? వంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

24
దేవరకొండ మేకల మాంసం రుచి వెనకున్న సీక్రెట్ ఇదే..

దేవరకొండ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువగా కొండలు, గుట్టలు, అడవులు, పొడి భూములతో కూడిన నేలలు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో పచ్చిక బయళ్లతో పాటు సహజంగా పెరిగే అనేక రకాల చెట్లు, పొదలు, అడవి మొక్కలు కనిపిస్తాయి. ఇక్కడ పెరిగే మేకలు కేవలం సాధారణ గడ్డిని మాత్రమే కాకుండా అడవుల్లో సహజంగా పెరిగే తుమ్మచెట్ల ఆకులతో పాటు కాయలు తింటాయి. అలాగే రేగు, వేప, జమ్మి, చండ్ర వంటి చెట్ల ఆకులను కూడా మేస్తుంటాయి.

వీటితో పాటు కొండ ప్రాంతాల్లో లభించే వివిధ రకాల అడవి మొక్కలు, ఆకులు, చిన్నపాటి పొదలు కూడా మేకలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఇలా ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాల మొక్కలను తినడం వల్ల వాటి ఆహారంలో వైవిధ్యం ఉంటుంది. ఈ కారణంగానే దేవరకొండ మేకల మాంసానికి ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయని స్థానికులు చెబుతుంటారు.

దేవరకొండ మేకల్లో ఎక్కువ కొవ్వు ఎందుకుండదు?

దేవరకొండ ప్రాంతంలో మేకల పెంపకంలో కనిపించే మరో ప్రత్యేకత వాటి మేత విధానం. కొన్ని ప్రాంతాల్లో మేకలను షెడ్లలో ఉంచి దాణా, పచ్చిగడ్డి అందిస్తుంటారు... కానీ గుట్టలు, కొండలు ఎక్కువగా ఉన్న దేవరకొండ పరిసర ప్రాంతాల్లో చాలా మంది కాపరులు మేకలను బయటకు తీసుకెళ్లి మేపుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండలు, గుట్టలు, రాతి ప్రాంతాల్లో తిరుగుతూ మేకలు మేత మేస్తాయి...ఈ క్రమంలో వాటికి నిరంతరం శారీరక శ్రమ ఉంటుంది. నడవడం, ఎత్తైన ప్రాంతాలు ఎక్కడం, దిగడం వంటి కార్యకలాపాల వల్ల వాటి శరీరానికి వ్యాయామం లభిస్తుంది. అందుకే ఈ మేకల్లో కొవ్వు ఎక్కువగా ఉండదు.. మాంసం అంతా కండరాల్లోనే ఉంటుంది. అందుకే ఈ మేకల మాంసం వండినప్పుడు ముక్క మెత్తగా, జ్యూసీగా ఉండి అద్భుతమైన రుచిని ఇస్తుంది.

నీరు కూడా మాంసం రుచిని ప్రభావితం చేస్తుందా?

మేకల పెంపకంలో ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో ముఖ్యం. దేవరకొండ పరిసర ప్రాంతాల్లో కొండ వాగులు, బావులు, భూగర్భ జలాలు వంటి వనరుల నుంచి మేకలకు నీరు అందిస్తుంటారు. ఈ నీటిలోని ప్రత్యేక ఖనిజాలు, మినరల్స్ కూడా అక్కడి మేకల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని... మాంసం నాణ్యతను కూడా పెంచుతాయని చెబుతుంటారు. ఇలా దేవరకొండ ప్రాంతంలోని వాతావరణం, నీరు, మేత కలిపి మేకల మాంసం నాణ్యతపై ప్రభావం చూపుతాయని చెబుతుంటారు.

34
దేవరకొండలో ఏ రకమైన మేకలను పెంచుతారు?

దేవరకొండ ప్రాంతంలో మేకల పెంపకం అనేక కుటుంబాలకు ప్రధాన జీవనోపాధిగా ఉంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా స్థానిక మేకలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన కొన్ని రకాల మేకలను కూడా పెంచుతుంటారు.

తెలంగాణ స్థానిక మేకలు 

తెలంగాణలోని పొడి వాతావరణం, గుట్టలు, బీడు భూములకు అలవాటు పడిన స్థానిక మేకలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అందుబాటులో ఉన్న సహజ మేతను ఉపయోగించుకుంటూ పెరిగే ఈ మేకలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తాయి. వీటి పెంపకానికి రైతులు తమ ప్రాంతంలోని సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తుంటారు.

ఉస్మానాబాదీ మేకలు 

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ ప్రాంతం పేరుతో గుర్తింపు పొందిన ఈ జాతి మేకలు దక్కన్ పీఠభూమి వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా నలుపు రంగులో కనిపిస్తాయి. మాంసం కోసం వీటిని ఎక్కువగా పెంచుతారు. కొన్ని ప్రాంతాల్లో పాలు, మాంసం రెండింటి అవసరాల కోసం కూడా ఈ మేకలను ఉపయోగిస్తారు.

మహబూబ్‌నగర్ ప్రాంతపు స్థానిక మేకలు 

తెలంగాణలోని మహబూబ్‌నగర్ ప్రాంతంలోనూ మేకల పెంపకానికి మంచి గుర్తింపు ఉంది. అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పెరిగే మేకలను ఇతర ప్రాంతాల రైతులు కూడా కొనుగోలు చేస్తుంటారు. వీటిలో కొన్ని మేకలకు పండుగలు, శుభకార్యాల సమయంలో మంచి డిమాండ్ ఉంటుంది.

44
దేవరకొండ మేకలు చాలా స్పెషల్..

ఒక ప్రాంతంలోని మేకల మాంసం రుచిపై అక్కడి వాతావరణం, మేకల జాతి, ఆహారం, వయసు, పెంపకం విధానం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. దేవరకొండ ప్రాంతంలో కొండలు, గుట్టలు, సహజమైన మేత వనరులు ఉండటం మేకల పెంపకానికి అనుకూలంగా మారింది. ముఖ్యంగా వివిధ రకాల చెట్ల ఆకులు, అడవి మొక్కలను మేస్తూ స్వేచ్ఛగా సంచరించే మేకల పెంపకం ఇక్కడి ప్రత్యేకత. అందుకే దేవరకొండ మేకల మాంసానికి స్థానికంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుందని చెబుతుంటారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ వృత్తి నేటికీ అనేక గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories