Jasmine City: భారతదేశపు మల్లెపూల నగరం.. ఈ ఊర్లో ఎటు చూసినా మల్లెపూల ఘుమఘమలే

Published : Nov 19, 2026, 10:39 AM IST

Jasmine City: మనదేశంలో మల్లెపూల నగరం ఒకటుంది. ఈ ఊర్లో ఎక్కడ చూసినా మల్లెపూలు విరివిగా దొరుకుతాయి. దీన్ని మల్లెపూల నగరంగా పిలుచుకుంటారు. మల్లెపూల తోటలు విపరీతంగా అక్కడ కనిపిస్తాయి. ఆ నగరం పేరేమిటో తెలుసా?

PREV
13
భారతదేశ మల్లెపూల నగరం ఇది

మనదేశంలో మల్లెపూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారతదేశంలో మల్లెపూల నగరంగా మధురైను పిలుస్తారు. తమిళనాడులోని మధురై నగరానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఇక్కడ ప్రసిద్ధ ఆలయాలు, చారిత్రక కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే ఈ నగరానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అదే మల్లెపూల నగరం లేదా మల్లెపూల రాజధాని.

మధురైలో పండే మల్లెపూలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. అందుకే దీన్ని ‘జాస్మిన్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు లేదా మల్లెపూల రాజధాని అంటారు. ఇక్కడ పండే మల్లెపూలను ‘మధురై మల్లిగై’ అని అంటారు. ఈ పూలకు మంచి సువాసన ఉంటుంది. తెల్లగా, అందంగా కనిపించే ఈ పూలు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. మధురై చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున మల్లె సాగు చేస్తుంటారు. ముఖ్యంగా అరుప్పుకోట్టై, నాథం, మేలూర్, తిరుమంగళం ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది. అక్కడి నేల, వాతావరణం మల్లె మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి.

23
పెద్దఎత్తున మల్లెపూల వ్యాపారం

మధురైలో మల్లెపూల వ్యాపారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. తెల్లవారుజామునే రైతులు పూలను కోసి మార్కెట్లకు తీసుకొస్తారు. అక్కడి నుంచి వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు పంపిస్తారు. మధురై పూల మార్కెట్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సమయంలో మల్లెపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మహిళలు జడలో మల్లెపూలు పెట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ పూలకు స్థానిక సంస్కృతిలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. పూల సాగు వల్ల వేలాది మంది రైతులు, వ్యాపారులు, మాలలు కట్టేవారికి ఉపాధి లభిస్తోంది.

33
పూజల కోసం మల్లెపూలు

మధురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయంలోనూ మల్లెపూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పూజలు, ప్రత్యేక అలంకరణల్లో ఈ పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మధురై మల్లెపూల ప్రస్తావన పురాతన సంగం సాహిత్యంలోనూ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ ప్రాంతంలో మల్లెపూలకు వందల ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. ఒకవైపు ఆలయ సంప్రదాయాలు, మరోవైపు రైతుల కష్టం, ఇంకోవైపు పూలకు ఉన్న గిరాకీ.. ఇవన్నీ మధురైకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే మధురైని భారతదేశపు మల్లెపూల నగరంగా పిలుస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories