Success Story: అనాథాశ్రమంలో పెరిగి, రూ.5 కూలీగా పనిచేసి.. అమెరికాలో రూ. 1500 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలంగాణ మహిళ జ్యోతి రెడ్డి.. ఆమె ఇన్స్పైరింగ్ స్టోరీ ఇక్కడ తెలుసుకుందాం.
టైపిస్ట్ ఉద్యోగం నుంచి గ్లోబల్ బిజినెస్ ఐకాన్ దాకా.. తెలంగాణ ఆడబిడ్డ సంచలన విజయం!
జీవితం మనకు ఏమీ ఇవ్వనప్పుడు, మనమే దాన్ని సృష్టించుకోవాలి. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం జ్యోతి రెడ్డి. కుటుంబం ఉన్నా ఆదరించే స్థోమత లేక అనాథాశ్రమంలో పెరిగిన ఒక సాధారణ చిన్నారి.. నేడు అమెరికాలో రూ. 1500 కోట్ల ఐటీ కంపెనీకి బాస్ అంటే నమ్మగలరా? ఎటువంటి గాడ్ ఫాదర్, పెట్టుబడి లేకుండా కేవలం కష్టం, పట్టుదలతో చరిత్ర తిరగరాసిన జ్యోతి రెడ్డి స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
25
అనాథలా గడిచిన చిన్నతనం.. 16 ఏళ్లకే పెళ్లి
1970లో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జ్యోతి రెడ్డి జన్మించారు. నలుగురు ఆడపిల్లల్లో అందరికంటే చిన్నది కావడం, పేదరికం కారణంగా తండ్రి ఆమెను అనాథాశ్రమంలో చేర్చారు. కనీస సౌకర్యాలు లేని చోట ఆమె బాల్యం గడిచింది. పదవ తరగతి వరకు ఎలాగోలా చదువుకున్న జ్యోతికి, 16 ఏళ్ల వయస్సులోనే తమ కంటే 10 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తితో పెళ్లి చేశారు. 18 ఏళ్లకే ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయ్యారు.
35
రూ. 5 కూలీ పని నుంచి రాత్రి వేళ సెక్యూరిటీ గార్డ్‌గా..
కుటుంబ భారం, ఆంక్షలు తట్టుకోలేక 1980ల కాలంలో భర్తను వదిలేసి ఇద్దరు చిన్న పిల్లలతో బయటకు వచ్చేశారు జ్యోతి. మగవాళ్ల ప్రాబల్యం ఉన్న సమాజంలో ఒంటరిగా పోరాటం మొదలుపెట్టారు. పిల్లల ఆకలి తీర్చడానికి రోజుకు కేవలం 5 రూపాయల కూలీకి పొలాల్లో పనులు చేశారు. అంతటితో ఆగక, రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేస్తూ, మిగిలిన సమయంలో ఇంటింటికీ తిరిగి చీరలు అమ్మేవారు. రోజులో ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా శ్రమించారు.
అలసటను సైతం లెక్కచేయకుండా జ్యోతి చదువును కొనసాగించారు. టైపింగ్ నేర్చుకుని పాఠశాలలో ఉద్యోగం సంపాదించారు. 1992లో నెలకు రూ. 398 జీతంతో స్కూల్ టీచర్‌గా చేరి, పిల్లలను మిషనరీ స్కూల్‌లో చేర్పించారు. జీవితం కాస్త కుదుటపడినా, సాధించాల్సింది ఇంకా ఏదో ఉందనే తపన ఆమెను నిద్రపోనివ్వలేదు. అమెరికా నుంచి వచ్చిన కజిన్ ఇచ్చిన ధైర్యంతో ఎలాగైనా అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నారు.
55
అమెరికాలో ఐటీ సామ్రాజ్యం.. రూ. 1500 కోట్ల విజయం
అమెరికా వెళ్లాక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే, వీసా ప్రాసెసింగ్‌లో ఉన్న డిమాండ్‌ను గుర్తించారు. వీసా కన్సల్టింగ్ కోసం ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసి సొంతంగా బిజినెస్ ప్రారంభించారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఫినిక్స్ నగరంలో 'కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్' (Key Software Solutions) అనే ఐటీ సంస్థను స్థాపించి, రూ. 1500 కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అమెరికాలో 6 విలాసవంతమైన ఇళ్లు, భారతదేశంలో అనేక ఆస్తులు ఆమె సొంతం. లక్ష్యం బలంగా ఉంటే ఎలాంటి కష్టాలైనా దాటవచ్చని జ్యోతి రెడ్డి ప్రయాణం నిరూపిస్తుంది.