First Movie Theatre: ఇప్పుడు మనదేశంలో ఒక్కో సిటీలో బోలెడు సినిమా థియేటర్లు.కానీ ఒకప్పుడు సినిమా అంటేనే తెలియదు. అలాంటి మనదేశంలో తొలి సినిమా హాలు వచ్చింది ఏ నగరంలోనో తెలుసా? ఆ వివరాలు ఇవిగో.
సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లడం మనకు అలవాటు. మల్టీప్లెక్స్‌లు, భారీ తెరలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కానీ మన దేశంలో తొలి సినిమా హాలు ఎక్కడ నిర్మించారో తెలుసా? పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ చారిత్రక సినిమా హాలు నిర్మించారు. దీని పేరు ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ (Elphinstone Picture Palace). 1907లో జంషెడ్‌జీ ఫ్రాంజీ మదన్ అనే వ్యాపారవేత్త దీన్ని నిర్మించారు. అప్పట్లో సినిమాలు ప్రదర్శించడానికి ప్రత్యేక థియేటర్లు ఉండేవి కావు. బహిరంగ ప్రదేశాల్లో, తాత్కాలిక గుడారాల్లో సినిమాలు చూపించేవారు. ఈ సమస్యను గుర్తించిన జేఎఫ్ మదన్ శాశ్వత సినిమా హాలు నిర్మించాలని నిర్ణయించారు. అలా కోల్‌కతాలో.. మన దేశంలోనే తొలి ప్రత్యేక సినిమా హాలు అందుబాటులోకి వచ్చింది.
23
మూకీ సినిమాల కాలంలో
ఈ సినిమా హాలు ప్రారంభమైన సమయంలో మూకీ సినిమాల కాలం నడుస్తోంది. అంటే తెరపై నటీనటులు కనిపించేవారు కానీ వారి మాటలు వినిపించేవి కావు. కథను అర్థం చేసుకోవడానికి తెర కింద వివరణలు చూపించేవారు. కొన్ని చోట్ల సినిమా ప్రదర్శన సమయంలో సంగీతకారులు ప్రత్యక్షంగా సంగీతం అందించేవారు. ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌లో విదేశీ సినిమాలు కూడా ప్రదర్శించేవారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించేది. జేఎఫ్ మదన్ కేవలం సినిమా హాలు నిర్మించడమే కాకుండా సినిమా నిర్మాణం, పంపిణీ రంగాల్లోనూ అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన మదన్ థియేటర్స్ సంస్థ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించింది. ఒక దశలో ఈ సంస్థకు భారత ఉపఖండంలో 120కి పైగా సినిమా హాళ్లు ఉండేవని చరిత్రకారుల అంచనా. 1929లో ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ ఆసియాలోనే శాశ్వత ధ్వని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న తొలి సినిమా హాలుగా గుర్తింపు పొందింది.
33
ఇప్పుడు ఈ థియేటర్ ఉందా?
కాలక్రమంలో ఈ సినిమా హాలు పేరు కూడా మారింది. మొదట ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌గా ఉన్న దీన్ని తర్వాత మినర్వా సినిమా అని పిలిచేవారు. ఆ తర్వాత చార్లీ చాప్లిన్ పేరు మీద చాప్లిన్ సినిమా హాలుగా మార్చారు. అయితే కాలం మారడంతో పాత సినిమా హాళ్లకు ఆదరణ తగ్గింది. నిర్వహణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. చివరకు 2013లో ఈ చారిత్రక భవనాన్ని కూల్చివేశారు. ఇప్పుడు ఆ సినిమా హాలు భౌతికంగా లేకపోయినా భారతీయ సినిమా చరిత్రలో దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు గుడారాల్లో మొదలైన సినిమా ప్రదర్శనలకు శాశ్వత చిరునామా కల్పించిన ఈ భవనం భారతీయ సినిమా ప్రయాణంలో మరచిపోలేని గుర్తుగా నిలిచిపోయింది.