టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం… ఇలా ప్రయాణిస్తూ పట్టుబడితే ఫైన్స్ వేస్తారు. అయితే కొందరు రైలు టికెట్ అవసరం లేకుండానే ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం కలిగినవారు ఎవరో తెలుసా..?
Indian Railways : భారతీయుల దైనందిన జీవితంలో రైలు ప్రయాణం ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు పిల్లల టికెట్ నిబంధనల గురించి చాలామందికి సందేహాలుంటాయి. 'ఏ వయసు వరకు టికెట్ అవసరం లేదు?', 'హాఫ్ టికెట్ ఎప్పుడు తీసుకోవాలి?', 'వేరే సీటు కావాలంటే పూర్తి ఛార్జీ కట్టాలా?' వంటి ప్రశ్నలు తరచుగా వస్తుంటాయి. నిజానికి భారతీయ రైల్వే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ చాలా మంది ప్రయాణికులకు వాటిపై పూర్తి అవగాహన ఉండదు. కాబట్టి ట్రైన్ టికెట్ రూల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
25
ఏ వయసు చిన్నారులకు ట్రైన్ జర్నీ ఫ్రీ..?
రైల్వే నిబంధనల ప్రకారం... 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా టికెట్ కొనాల్సిన అవసరం లేదు. పుట్టిన బిడ్డ నుంచి 4 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఈ సదుపాయానికి ఒక షరతు ఉంది. పిల్లలకు ప్రత్యేకంగా సీటు లేదా బెర్త్ కేటాయించరు. వాళ్లు తల్లిదండ్రుల సీటు లేదా బెర్త్‌లోనే సర్దుకుని ప్రయాణించాలి. ఒకవేళ తల్లిదండ్రులు కోరుకుంటే అదనపు సౌకర్యం కోసం పిల్లలకు ప్రత్యేక టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
35
రైలులో హాఫ్ టికెట్ ఉంటుందా..?
5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు నిబంధనలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఈ వయస్సు వారికి ఛార్జీలో రాయితీ లభించవచ్చు.. కానీ వారికి ఆటోమేటిక్‌గా ప్రత్యేక సీటు కేటాయించరు. ప్రయాణ సమయంలో పిల్లలకు ప్రత్యేక సీటు లేదా బెర్త్ కావాలనుకుంటే పూర్తి ఛార్జీ చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాలి. సుదూర ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించేటప్పుడు పిల్లల సౌకర్యం కోసం చాలా మంది తల్లిదండ్రులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు.
12 ఏళ్లు పైబడిన వారిని పూర్తిస్థాయి ప్రయాణికులుగా పరిగణిస్తారు. కాబట్టి వారికి తప్పనిసరిగా పూర్తి టికెట్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు పిల్లల వయస్సును సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం. వయస్సుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే టికెట్ చెకింగ్ సమయంలో ఇబ్బందులు తప్పవు. వయసు ధృవీకరణ పత్రం అడిగే అధికారం TTEకి ఉంటుంది.
కాబట్టి కుటుంబంతో కలిసి రైలు ప్రయాణం చేసే ముందు, పిల్లల వయస్సును బట్టి సరైన టికెట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. డబ్బులు ఆదా చేసుకోవాలని చూసి ఇబ్బందులు పడటం కంటే నిబంధనలు పాటించడం సురక్షితం. సరైన సమాచారంతో టికెట్ బుక్ చేస్తే జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అదే సమయంలో పిల్లలకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన, సంతోషకరమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.
55
వీరికీ రైలులో ఉచిత ప్రయాణం..
అయితే పిల్లలకే కాదు కొందరు పెద్దవారికి కూడా రైలులో ఉచితంగా ప్రయాణించే సదుపాయం ఉంటుంది. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత సైనిక పురస్కారాలు పొందినవారిని గౌరవిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది రైల్వే శాఖ. ఇలా వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, మహావీర చక్ర, పరంవీర చక్ర, శౌర్య చక్ర పురస్కారాలు పొందినవారు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. పురస్కారం అందుకున్నవారితో పాటు ఓ సహాయకుడికి కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది రైల్వే శాఖ.