Dangerous Island: భారతదేశంలోని నార్త్ సెంటినెల్ ఐలాండ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. 60 వేల ఏళ్లుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న ఇక్కడి తెగ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. అక్కడ అడుగుపెడితే చావే
అండమాన్ నికోబార్ దీవుల మధ్య నీలి సముద్రంలో ఒక విచిత్రమైన, భయానక ప్రపంచం ఉంది. ఆధునిక సాంకేతికతకు, నేటి నాగరిక సమాజానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. ఇది భారత్‌లోనే అత్యంత ప్రమాదకరమైన, రహస్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతోంది.
ఈ ఇన్నేళ్లలో దేశంలోని మూ మూలలకు ఆధునిక పాలన, చట్టాలు, టెక్నాలజీ వ్యవస్థలు చేరాయి. కానీ, భారత పటంలో భాగమైనా కూడా ఏ ప్రభుత్వానికీ లొంగని ఒక రహస్య ద్వీపం ఉంది. తన ఇష్టానుసారం స్వతంత్రంగా జీవించే ఆ ప్రదేశం గురించి చాలామందికి తెలియదు. అక్కడ పాలన చేయడం అటుంచితే, ఆ ప్రజలను కనీసం సంప్రదించడం కూడా సాధ్యం కాలేదు. వారిని కలిసేందుకు వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ మరణాల ద్వీపం విశేషాలు ఇప్పుడు చూద్దాం.
24
ఏమిటా ద్వీపం? 60,000 ఏళ్లుగా ఒంటరి జీవితం
అండమాన్ నికోబార్ దీవుల మధ్య ఉన్న ఈ భయంకర ప్రదేశమే ‘నార్త్ సెంటినెల్ ఐలాండ్’. ఆధునిక సాంకేతికతకు, నేటి సమాజానికి పూర్తిగా దూరంగా ఉండే అత్యంత ప్రమాదకర ప్రాంతం ఇది.
ఇక్కడ నివసించే వారిని ‘సెంటినెలీస్’ తెగ అంటారు. వీరు గత 60,000 ఏళ్లుగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా ఒంటరిగా జీవిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో కూడా వీరు చరిత్ర పూర్వ యుగం నాటి మానవుల లాగే వేటాడుతూనే కాలం వెళ్లదీస్తున్నారు.
34
కనిపిస్తే చాలు బాణాల దాడి
ఈ ద్వీప ప్రజలకు బయటి ప్రపంచ మానవులంటే తీవ్రమైన ద్వేషం, భయం. వారి ద్వీపానికి దగ్గరగా హెలికాప్టర్లు ఎగిరినా లేదా పడవలు వెళ్లినా సరే.. వారు విల్లు-బాణాలు, ఈటెలు, భయంకరమైన ఆయుధాలతో దాడి చేస్తారు.
వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదు
2006 లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న ఇద్దరు భారతీయ జాలర్ల పడవ ప్రమాదవశాత్తూ ఈ ద్వీపం తీరానికి కొట్టుకుపోయింది. దాంతో ఆ తెగ ప్రజలు ఆ ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు.
తరువాత 2018 లో జాన్ అలెన్ చౌ అనే 26 ఏళ్ల అమెరికన్ క్రిస్టియన్ మత ప్రచారకుడు అక్రమంగా ఈ ద్వీపంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. సెంటినెలీస్ అతడిపై బాణాలతో దాడి చేసి చంపేశారు. చివరికి అతని మృతదేహాన్ని కూడా వెనక్కి తీసుకురావడం భారత ప్రభుత్వానికి సాధ్యం కాలేదు.
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ ద్వీపం చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇక్కడ నిరంతరం కాపలా కాస్తుంటారు.
ఈ నిషేధానికి ముఖ్య కారణం ఏంటి?
ఈ నిబంధన కేవలం పర్యాటకుల రక్షణ కోసం మాత్రమే కాదు, ఆ తెగ ప్రజల రక్షణ కోసం కూడా పెట్టిందే. వారు వేలాది సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా విడివిడిగా ఉన్నారు. అందువల్ల మనలో ఉండే సాధారణ జ్వరం, దగ్గు వంటి వైరస్‌లను తట్టుకునే రోగనిరోధక శక్తి వారి శరీరాల్లో లేదు. మనం వారి వద్దకు వెళ్తే, మన ద్వారా వ్యాపించే చిన్నపాటి వ్యాధి కూడా ఆ తెగ మొత్తాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతానికి వెళ్లడం పై నిషేధం విధించింది.